రైతులను ఆదుకోండి: చిరంజీవి, కిరణ్ విఫలం: బండారు
న్యూఢిల్లీ: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రి చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఫైలిన్ తుపాను కారణంగా జరిగిన నష్టం నుంచి రైతాంగం కోలుకోకముందే రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలతో 15 జిల్లాల్లో పంటలు దెబ్బతినడం బాధాకరమని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కుండపోత వర్షాల కారణంగా పంటలతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 13మంది మరణించినట్లు, ఇది వరద ఉధృతికి అద్దం పడుతోందన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు, చేతి వృత్తుల వారికి తీవ్ర నష్టం జరిగిందని, వారందర్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెగా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని చిరంజీవి పిలుపునిచ్చారు.

సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: దత్తాత్రేయ
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యం పేరుతో పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు.
ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి నివేదికలు పంపడంలో మునిగిపోయి వరద బాధితులను పట్టించుకోవడం లేదని దత్తాత్రేయ ఆరోపించారు. వరదల వల్ల మరణించిన 13మంది కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications