24 గంటల్లో రికార్డుస్థాయిలో పెరిగిన కరోనా కేసులు: 780కి చేరిన మరణాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనావైరస్ విజృంభణ క్రమంగా తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్ విధించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.

రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లోనే 1752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పెరుగుదలతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 23,452కు పెరిగింది. 4813 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల్లో ఇది 20.57శాతంగా ఉంది. మరణాల సంఖ్య 780కి చేరింది.

వ్యాప్తి వేగం తగ్గింది..
దేశంలో రెట్టింపు కేసులు అయ్యే సమయం పది రోజులకు పెరిగింది. ఇంతకు ముందు 7.5 రోజులకే రెట్టింపు కేసులు నమోదయ్యేవి. లాక్ డౌన్ విధించడం వల్లే కరోనా వ్యాప్తిని కట్టడి వేయగలిగామని, లేదంటే భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యేవని కేంద్రం తెలిపింది. గత 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Recommended Video

ఆ జిల్లాల్లో కేసుల్లేవు.. అంతా లాక్‌డౌన్ వల్లే..
గత 14 రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో ఒక్క కరోనా కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల సహకారం వల్ల కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామని వెల్లడించింది. కరోనావైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనా కేసులు రెట్టింపు అవుతున్న సమయం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 10 రోజులకోసారి కేసులు రెట్టింపు అవుతున్నాయన్నారు. లాక్ డౌన్ విధించడం వల్లే ఇవాళ కేసుల సంఖ్య 23వేలు దగ్గర ఉందని, లేదంటే ఆ సంఖ్య ఈ పాటికే 73వేలు దాటేదని నీతి ఆయోగ్ సభ్యుడు, ఎంపవర్డ్ గ్రూప్-41 ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications