Maharastra Turnout: 30 ఏళ్లలో అత్యధికంగా మహా పోలింగ్-ఎన్డీయేలో ఆందోళన..?
హోరాహోరీగా సాగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి ఎన్నికల్లో అర్ధరాత్రి సమయానికి అందిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 65.2 శాతం పోలింగ్ నమోదైంది. తుది గణాంకాలను ఈసీ ఇవాళ విడుదల చేయనుంది. అయితే అర్ధరాత్రి వరకూ పోలింగ్ శాతం చూసినా ఇది గత 30 ఏళ్లలో అత్యధికంగా తేలింది. ఎప్పుడో 1995లో మహారాష్ట్ర ఎన్నికల్లో 71.69 శాతం పోలింగ్ నమోదైంది.
తాజాగా మహారాష్ట్రలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 61.39 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి వరకూ గణాంకాల ప్రకారం 65.2 శాతం ఓటింగ్ నమోదైంది. దీన్ని బట్టి చూస్తే లోక్ సభ ఎన్నికలను మించి పోలింగ్ జరిగిందని తేలింది. అలాగే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 61.4 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు కూడా మించి పోలింగ్ నమోదైంది. దీంతో పెరిగిన పోలింగ్ శాతం ఎవరిని ముంచబోతోంది, ఎవరిని తేల్చబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

మహారాష్ట్రలో పెరిగిన పోలింగ్ శాతం అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇరు కూటములూ పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమనని చెప్పుకుంటున్నాయి. కానీ ఏ రాష్ట్రంలో అయినా పెరిగే పోలింగ్ శాతాలు సాధారణంగా అధికార పార్టీలపై వ్యతిరేకతకు నిదర్శనంగా పలుమార్లు నిరూపణ అయింది. అలాగే నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా మహారాష్ట్ర విషయంలో రెండుగా చీలిపోయాయి. దీంతో బీజేపీ నేతృృత్వంలోని మహాయుతి కూటమి పైకి గెలుస్తామని చెబుతున్నా అంతర్గతంగా ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.
వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతిలోని మూడు పార్టీలు బిజెపి, శివసేన, ఎన్‌సిపి కలిపి మొత్తం 42.71 శాతం ఓట్లను సాధించాయి. అలాగే మహా వికాస్ అఘాడిలోని మూడు పార్టీలు కాంగ్రెస్, శివసేన యుబిటి, ఎన్‌సిపి ఎస్‌పి కలిసి 43.91 శాతం ఓట్లు సాధించాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 3.5 శాతం ఓట్లు పెరగడం చూస్తుంటే ఏదో సంచలనం తప్పేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications