రైతులకు మోడీ సర్కారు శుభవార్త: రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ ప్రకటన
న్యూఢిల్లీ: ఊహించినదానికంటే ముందే దేశ రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ పంటలకు కనీస మద్దతును పెంచుతూ.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. రబీ సీజన్‌లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వేర్వేరు పంటలకు కనీసం రూ. 40 నుంచి రూ. 400 వరకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి మండల బుధవారం సమావేశమైంది. ఈ సందర్బంగా దేశంలో 2022-23 మార్కెటింగ్ సీజన్‌లో అధీకృత రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

ఆయా పంటలు సాగుచేసిన రైతులకు దిగుబడిపై గిట్టుబాటు ధర లభ్యతపై భరోసా ఇస్తూ 2022-23 మార్కెటింగ్ సీజన్‌కుగాను ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు నిరుటితో పోలిస్తే అత్యధికంగా పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంటల సాగులో వైవిధ్యం దిశగా రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్యంగా బార్లీ, శనగలు, గోధుమలు, చెరకు, ఆవాలులపై కనీస మద్దతు ధరలు పెంచిన కేంద్రం.. 2022 - 23 మార్కెటింగ్ సీజన్‌కు ఈ కొత్త కనీస మద్దతు ధరలు వర్తింపచేయనుంది. గత సంవత్సరం కంటే ఎంఎస్పీలో అత్యధిక పెరుగుదల కాయధాన్యాలు (మసూర్) , రేప్‌సీడ్‌లు, ఆవాలు పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 400 చొప్పున మద్దుతు ధర లభించనుంది. ఇక, క్వింటాల్ చెరకు మద్దతు ధర రూ. 290 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా, గోధుమలపై రూ.40, బార్లీ రూ.35 , శనగలపై రూ.350 మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక, పెరిగిన ధరలతో క్వింటాల్ గోధుమలకు రూ. 2015 మద్దతు ధర లభించనుంది. ఇక పెంచిన ధరలతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కాస్త ఊరట లభించనుంది. డిమాండ్-సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి, రైతుల్లో ఇతర పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
మరోవైపు, నూనె గింజలు, పప్పులు, ముతక తృణధాన్యాలకు అనుకూలంగా ఎమ్మెస్పీ లను పునర్వ్యవస్థీకరించడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ప్రకటించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్‌తో పాటు ఎంఎస్‌పి పెరుగుదల విస్తరణ, ఉత్పాదకతను విస్తరించడంలో సహాయపడుతుందని కేంద్రం భావిస్తోంది. అన్నదాతల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఉపాధిని కల్పించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్రం భావిస్తోంది. ఓ వైపు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు నిరసనలు చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది రైతు నిరసనలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications