ఎన్నికల నగారా మోగింది - బీజేపీ పాలిత రాష్ట్రంలో: షెడ్యూల్ ఇదే..!!
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గుజరాత్‌కు కూడా ఇవ్వాళే షెడ్యూల్‌ను ఆయన ప్రకటిస్తారని భావించినప్పటికీ- అలా జరగలేదు. రేపో-మాపో గుజరాత్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

నగదు రవాణాపై..
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నగదు రవాణాపై డేగకన్ను వేసినట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నగదు రవాణాపై కఠిన ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. నకిలీ వార్తలను అరికట్టడానికీ ప్రత్యేక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు చెప్పారు. డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు.. ఇలా ఏ ఒక్క దాన్నీ అక్రమంగా రవాణా చేయడానికి అనుమతి ఉండబోదని అన్నారు.

నవంబర్ 12న
హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017లో నిర్వహించిన ఎన్నికల్లో 44 స్థానాలతో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడీ 68 స్థానాలకూ ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. నవంబర్ 12వ తేదీన పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8వ తేదీన ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి వివరాలను తెలుసుకోవడానికి ఈసీ 'నో యువర్ క్యాండిడేట్' యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రెండు లక్షల మంది వరకు కొత్త ఓటర్లు..
తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఓటర్లు- సదరు అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. హిమాచల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 55,07,261. ఇందులో మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకునే వారు 1,86,681 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని వయోధిక వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, పోలింగ్ శాతం పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications