ప్రధాని మోదీకి జన్మనివ్వడమే ఆమె చేసిన నేరం..!!
అహ్మదాబాద్: దేశంలో మరో రెండు అతిపెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వాళ వెలువడనుంది. దీనికి సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. దీనికోసం విలేకరుల సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం-ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.

పీఎం మోదీ తల్లి చుట్టూ..
ఈ పరిస్థితుల మధ్య గుజరాత్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార భారతీయ జనత పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. రెండు పార్టీల నాయకులు ఆరోపణలు-ప్రత్యారోపణలను సంధించుకుంటోన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌నూ వదలట్లేదు. వంద సంవత్సరాల వయస్సున్న హీరాబెన్.. ఇప్పుడు గుజరాత్ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన పరిస్థితి నెలకొంది.
పాత వీడియో..
హీరాబెన్‌పై విమర్శలు సంధించిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా. ఆమెను కించపర్చాడంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ పాత వీడియోను తాజాగా తెరమీదికి తీసుకొచ్చారు. హీరాబెన్‌ను గోపాల్ ఇటాలియా దుర్భాషలాడారని ఆరోపించారు. ప్రధాని మోదీని కూడా అవమానించేలా వ్యాఖ్యానాలు చేశారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటుందని అన్నారు.

మోదీ తల్లిని దుర్భాషలాడం..
ప్రధాని తల్లిని దుర్భాషలాడటం వల్ల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగలమని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అనుకుంటే పొరపడ్డట్టేనని స్మృతి ఇరానీ అన్నారు. రాజకీయంగా ఆదరణ లభిందని, ఆమెపై చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారని చెప్పారు. మోదీ తల్లిని కించపరిచేలా మాట్లాడినందుకు గుజరాతీయులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆగ్రహాన్ని చూపిస్తారని, గుణపాఠం చెబుతారని అన్నారు.

అదే ఆమె చేసిన నేరమా?
ఈ వ్యాఖ్యల వెనుక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని, ఆయన సూచనలు, సలహాలతోనే గోపాల్ ఇటాలియా హీరాబెన్‌ను దుర్భాషలాడారని స్మతి ఇరానీ ఆరోపించారు. హిందూ సమాజం, హిందూ మహిళలను అవమానపరిచారని ధ్వజమెత్తారు. రాజకీయాలతో సంబంధం లేని హీరాబెన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం ఆప్ నేతల క్షమించరాని తప్పుగా అభివర్ణించారు. మోదీకి తల్లి కావడమే ఆమె చేసిన నేరమా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications