ఏడాదికి వీడింది: బిడ్డను తల్లిదండ్రులే చంపేశారు
బెంగుళూరు: కర్ణాటకలో పరువు హత్యలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వస్థలమైన మైసూరు జిల్లా కేఆర్ నగర్ తాలుకాలోని నాడప్పన హళ్లి అనే గ్రామంలో జరిగిన పరువు హత్య ఏడాది తర్వాత వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం నాడప్పన హళ్లి గ్రామానికి చెందిన పుట్టరాజు శెట్టి, లీలమ్మల కుమార్తె సునీత (19) అదే గ్రామానికి చెందిన బంధువుల అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు.
ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో గ్రామంలో పరువు పోతుందని భావించి ఆమె తల్లిదండ్రులు ఒకరోజు పొలానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహం పక్కన పరుగుల మందు డబ్బా పడేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చారు.

అనంతరం తమ కుమార్తె కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని చుట్టుపక్కల వారిని నమ్మించారు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సునీతను తల్లిదండ్రులే హత్య చేశారని జిల్లా ఎస్పీకి లేఖ రాయడంతో ఆయన విచారణకు ఆదేశించారు.
దీంతో కేఆర్ నగర్ తాలుకా పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తులో భాగంగా సునీత తల్లిదండ్రులను విచారించడంతో అసలు విషయం వెల్లడించారు. తమ కుమార్తె పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో పరువు పోతుందనే కారణంతో తామే హత్య చేసినట్లు అంగీకరించారు.
దీంతో వారిని ఏడాది తర్వాత ఆదివారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే 2011 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కర్ణాటకలో 10 పరువు హత్యలు జరిగాయని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications