ఇంట్రెస్టింగ్: ముంబైలో 'హారన్ వ్రత్' క్యాంపెయిన్, ఎందుకో తెలుసా!
న్యూఢిల్లీ: మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం ఎంతలా పీడిస్తుందో.. శబ్ద కాలుష్యం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అసలే విపరీతమైన ట్రాఫిక్.. ఎక్కడైనా చిక్కుకుపోయామంటే గంటల తరబడి ముందుకు కదల్లేని పరిస్థితి.
ఇలాంటి తరుణంలో చెవులకు చిల్లులు పడేలా వాహనాలు హారన్స్ మోగుతుంటే.. ఎక్కడ లేని కోపం, చికాకు తన్నుకొస్తుంటాయి. కానీ ఏం చేస్తాం?.. ఏమీ చేయలేం!..
కానీ ముంబైకి చెందిన ఆవాజ్ ఎన్జీవో ఫౌండేషన్ మాత్రం అలా అనుకోలేదు. కచ్చితంగా దీనికి ఏదైనా పరిష్కారం కనిపెట్టాలని భావించింది. ఇందుకోసం ముంబై ఆటోరిక్షామెన్ యూనియన్‌తో పాటు మహారాష్ట్ర రవాణాశాఖతో చేతులు కలిపింది.
Mumbai: Awaaz Foundation along with the Maharashtra transport department, Rickshawmen's Union and Mumbai Police started 'HornVrat' campaign urging people to refrain from honking. pic.twitter.com/4rqn1AtlhO
— ANI (@ANI) April 4, 2018
ఈ క్రమంలోనే ప్రజలకు ధ్వని కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఓ ఆటోను రంగంలోకి దించారు. ఇందుకోసం ఆ ఆటోని పదుల సంఖ్యలో హారన్లతో అలంకరించారు. ఈ ప్రచారానికి 'హారన్ వ్రత్' అని నామకరణం చేసి.. శబ్ద కాలుష్యంపై ముంబైలో అవగాహన కల్పిస్తున్నారు.
జనవరి 27, 2018 నుంచి ఈ క్యాంపెయినింగ్ కొనసాగుతోంది. ధ్వని కాలుష్యాన్ని వీలైనంత మేర తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆవాజ్ ఎన్జీవో ఫౌండేషన్ చెబుతోంది.
కాగా, ఒక ఎన్జీవో అంచనా ప్రకారం ముంబై నగరంలో ఒక గంటకి 18మిలియన్ల సార్లు 'హారన్' శబ్దం ధ్వనిస్తోంది. రోజులో ఒక ముంబై డ్రైవర్ సగటున 48సార్లు హారన్ మోగిస్తున్నాడు. రోజురోజుకు ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుండటంతో.. ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 'హారన్ వ్రత్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.












Click it and Unblock the Notifications