యోగి స్టైల్ దళిత బంధు: మాఫియా నుంచి లాక్కున్న భూములు పేదలకు -ఏకంగా 67వేల ఎకరాలు..
ముమ్మాటికీ హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో లబ్ది కోసమే 'దళిత బంధు' పథకాన్ని పెట్టానని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుండబద్దలు కొట్టడం, ఆ మేరకు హుజూరాబాద్ లోని దళితుల పేరుతో వేల కోట్లు విడుదల చేయడం తెలిసిందే. కేసీఆర్ దళిత బంధుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సమయంలోనే బీజేపీ సైతం ఇలాంటిదే మరో పథకాన్ని రూపొందించింది...
ఉత్తరప్రదేశ్ లో మరి కొద్ది నెల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, కేసీఆర్ దళిత బంధు తరహాలోనే ప్రజల్ని ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన స్టైల్లో దళిత బంధును ప్రకటించారు. అదేంటంటే.. యూపీ వ్యాప్తంగా భూ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో దళితులు, పేదలకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం యోగి తెలిపారు..

యూపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం సభను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం యోగి ఈ విషయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ సురేష్ కుమార్ త్రిపాఠి లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ దళిత బంధు తరహా ప్రణాళికను సీఎం వెల్లడించారు. యూపీలో 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కబ్జాలపై దృష్టి సారించామని..
గత ప్రభుత్వాల హయాంలలో పెద్ద ఎత్తున కబ్జాకు గురైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఆ టాస్క్ ఫోర్స్ ఇప్పటి వరకు 67,000 ఎకరాల రెవెన్యూ శాఖ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించిందని సీఎం యోగి తెలిపారు. ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న ఈ భూముల్లో దళితులు, పేదలకు ఇళ్లు కడతామని ఆయన వెల్లడించారు.
Recommended Video
అలాగే, దళితులకు ఇళ్లతోపాటు క్రీడా మైదానాలకూ ప్రాధాన్యత ఇస్తామని, పంచాయితీ స్థాయిలో వీటిని ఏర్పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. విద్యార్థులకు లాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 28 శాతానికి పెంచామని, ఈ ఏడాది జూలై నుంచి ఇది అమలవుతుందన్నారు. మహిళా సంక్షేమం గురించి మాట్లాడే ప్రతిపక్షంలోని కొందరు సిగ్గులేకుండా తాలిబన్లకు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications