NCP Crisis : అజిత్ పవార్ ఫిరాయింపు ఎన్సీపీకే కాదు-ఇతర పార్టీలకూ దెబ్బేనా ?
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఫిరాయింపు నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఎన్సీపీలో తన వర్గాన్ని తీసుకుని ఎన్డీయే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరిపోయిన అజిత్ పవార్.. ఇప్పుడు తమదే అసలైన పార్టీగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఈసీ నుంచి క్లియరెన్స్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీన్ని అడ్డుకునేందుకు ఎన్సీపీ నేత శరద్ పవార్ పావులు కదుపుతున్నారు.
మరోవైపు అజిత్ పవార్ ఫిరాయింపు వ్యవహారం ఇప్పుడు అన్నిపార్టీలను కుదిపేస్తోంది. ఎన్సీపీతో పాటు ఇతర పార్టీలపైనా ఈ ప్రభావం పడుతోంది. అజిత్ పవార్ ఫిరాయింపు కారణంగా ఎన్సీపీ నిట్టనిలువునా చీలిపోయింది. నిన్న మొన్నటివరకూ అధినేత పవార్ కు అండగా ఉన్న ప్రఫుల్ పటేల్ వంటివారు కూడా అజిత్ వెంట వెళ్లిపోవడం పార్టీని షాక్ కు గురిచేస్తోంది. అదే సమయంలో శరదవ్ పవార్, ఆయన కుమార్తె సుప్రియాసూలే మాత్రమే ఇప్పుడు పార్టీని నడిపించాల్సిన పరిస్దితి వచ్చేసింది.

అటు అజిత్ పవార్ ఫిరాయింపు, డిప్యూటీ సీఎం పదవి చేపట్టడందో ఈ ప్రభావం ప్రభుత్వంపైనా పడుతోంది. ఎన్డీయే ప్రభుత్వంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను అక్కడి నుంచి తప్పించి కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే సీఎం పదవి ఇవ్వకుండా తనను డిప్యూటీ సీఎంగా పరిమితం చేయడంపై అసంతృప్తిగా ఉన్న ఫడ్నవీస్ కు ఇప్పుడు అజిత్ పవార్ ఫిరాయింపు రూపంలో షాక్ తలిగింది. దీంతో ఆయన విషయంలో బీజేపీ వేసే అడుగులు కీలకంగా మారిపోయాయి.

మరోవైపు అజిత్ పవార్ ఫిరాయింపుతో బీజేపీకి రాష్ట్రంలో నమ్మకమైన మిత్రపక్షం దొరికింది. దీంతో సీఎం ఏక్ నాథ్ షిండేను బీజేపీ లైట్ తీసుకునే అవకాశముంది. 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే షిండే నాయకత్వంపై బీజేపీకి నమ్మకం లేదు. 48 లోక్‌సభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో గెలుపు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా మారింది. ఈ తరుణంలో 56 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మందిని తెచ్చుకున్నా షిండేకు పూర్తి గుర్తింపు రాలేదు.
అదే సమయంలో రాష్ట్రంలో ఉద్ధవ్ థాక్రేపై సానుభూతి పెరుగుతోంది.
అటు మహారాష్ట్రలో షిండే సర్కార్ పనితీరు అంతంతమాత్రంగా ఉన్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి దారుణ ఫలితాలు తప్పవనే వాదన పెరుగుతోంది. షిండేపై అంచనాలు నానాటికీ తగ్గిపోతుండటంతోనే బీజేపీ ఇప్పుడు అజిత్ పవార్ ను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. అయినా అజిత్ పవార్ ఫిరాయింపు వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగితే విపక్ష కూటమికి ప్రజల్లో సానుభూతి మరింత పెరిగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications