కాంగ్రెస్ కు అక్కడ కలిసొచ్చిన బజరంగ్ దళ్ నిషేధం హామీ- జేడీఎస్ కంచుకోట బద్దలు..
కర్నాటకలో ఇవాళ వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వని ఓటర్లు ఈసారి మాత్రం కాంగ్రెస్ ను పూర్తిగా విశ్వసించారు.
దీని వెనుక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైన పలు అంశాలున్నాయి. అలాగే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బజరంగ్ దళ్ నిషేధం హామీ ప్రభావం కూడా ఉన్నట్లు తేలింది. బజరంగ్ బలి నినాదం ఈసారి కాంగ్రెస్ ను దెబ్బకొడుతుందన్న అంచనాలు పటాపంచలయ్యాయి.

కర్నాటకలోని ఆరు ప్రాంతాల్లో కీలకమైన పాత మైసూరు ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. గత కొన్నేళుగా ఈ ప్రాంతంపై జేడీఎస్ పట్టు కొనసాగిస్తూ వస్తోంది. బీజేపీకి ఈ ప్రాంతంపై అంతగా పట్టు లేదు. కాంగ్రెస్ మాత్రం ఇక్కడ రెండోస్ధానంలో ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఇచ్చిన బజరంగ్ దళ్ నిషేధం హామీ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపై ఏమాత్రం ప్రభావం చూపిందో తెలియదు కానీ పాత మైసూరులో మాత్రం కాంగ్రెస్ కు అత్యధిక సీట్లను కట్టబెట్టింది.
కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్ వంటి సంస్ధలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించింది. దీన్ని బీజేపీ ప్రజల్లోకి నెగెటివ్ గా తీసుకెళ్లింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తారని, బజరంగ్ బలిగా భావించే హనుమంతుడిని పూజించడాన్ని నిషేధిస్తారని ప్రచారం చేసింది. చివరకు ప్రధాని మోడీ సైతం ఇదే ప్రచారం చేశారు. దీంతో ఈ నినాదం తమకు బూమరాంగ్ అవుతుందని కాంగ్రెస్ భయపడింది. కానీ పాతమైసూరుతో పాటు ఎక్కడా దీని ప్రభావం కనిపించలేదు.
అంతే కాదు పాత మైసూరు ప్రాంతంలో ముస్లింల ఓట్లను ఈ బజరంగ్ బలి నినాదం సంఘటితం చేసింది. దీని ప్రభావంతో అప్పటివరకూ జేడీఎస్ కు ఓటేద్దామనుకున్న వారు, జేడీఎస్ సంప్రదాయ ఓటర్లు కూడా తొలిసారి కాంగ్రెస్ వైపు మొగ్గారు.
దీంతో ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా 35 సీట్లు గెల్చుకుంది. తద్వారా జేడీఎస్ ను రెండోస్ధానానికి, బీజేపీని కనీస సీట్లకు పరిమితం చేసింది. గతంలో జేడీఎస్ ఇక్కడ 24 సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్ 16 గెల్చుకుంది. ఈసారి కాంగ్రెస్ 30 సీట్లు, గెల్చుకోగా.. జేడీఎస్ 20కి పరిమితమైంది.












Click it and Unblock the Notifications