బెంగాల్ నుంచి ఇద్దరు మంత్రులు ఔట్, మోడీపై దీదీ గుస్సా.. వారేం చేశారని ప్రశ్న
కేంద్ర మంత్రివర్గ విస్తరణ కత్తిమీద సాములా మారింది. సామాజిక సమీకరణాలు, రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూ.. విస్తరణ ఉండనుంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఆ స్టేట్స్‌కు చెందినవారికే ప్రాధాన్యం అనే చర్చ జరుగుతుంది. దానికి తగినట్టు కూర్పు ఉండబోతోంది. అయితే పశ్చిమ బెంగాల్ అంటే బీజేపీకి స్పెషల్ ఇంట్రెస్ట్.. అక్కడ పగ్గాలు చేపట్టాలనుకొని.. వెనకబడ్డ సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించింది. దీనిపై దీదీ మమతా బెనర్జీ గట్టిగానే స్పందించారు.
బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌదరీ ఏం చేశారని అడిగారు. వారిద్దరినీ తప్పించడం వెనక గల కారణాలు చెప్పాలని అడిగారు. తమ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వద్దా..? బీజేపీ ఎందుకిలా చేసింది అని అడిగారు. అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చేత రాజీనామా చేయించడంపై కూడా దీదీ స్పందించారు. కరోనా కాలంలో తీసుకున్న నిర్ణయాలు ప్రధాని మోడీ తప్ప.. హర్షవర్ధన్ కాదన్నారు. అలాంటి సమయంలో ఆయనను ఎందుకు బలి చేస్తున్నారని అడిగారు.

బెంగాల్ నుంచి బాబుల్, దేబశ్రీని తప్పించగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. నితీశ్ ప్రమాణిక్, జాన్ బర్లా, సంతాను ఠాకూర్, సుభాష్ సర్కార్ మోడీ టీంలో చేరబోతున్నారు. ఈ నలుగురికి సహాయ మంత్రులు అప్పగించే అవకాశం ఉంది. అయితే దీదీ మాత్రం.. ఉన్నఫలంగా ఇద్దరినీ తప్పించడంపై ఫైరయ్యారు.
రాజీనామాపై బాబుల్ సుప్రియో స్పందించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన రాజీనామా గురించి అడిగారని.. రిజైన్ చేశానని వివరించారు. తనకు ఇన్నాళ్లు మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా మంత్రి పదవీ చేపట్టేవారికి అభినందనలు తెలిపారు. ఇకపై కూడా తన నియోజకవర్గంపై దృష్టిసారిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications