వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిఖాయిల్ గోర్బచెవ్ కథ ఎలా ముగిసింది, అమెరికాను సవాలు చేసిన అత్యంత శక్తిమంతమైన దేశం ఎలా పతనమైంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రసంగానికి ముందు వాచీ చూసుకుంటోన్న మిఖైల్ గోర్భచెఫ్

అమెరికా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం. కానీ దశాబ్దాల కాలం పాటు ఒక దేశం, అమెరికాకు సవాలుగా నిలిచింది. అయితే, 1991 డిసెంబర్ 25న ఆ దేశం ఉనికి కోల్పోయింది. ప్రపంచ పటం నుంచి నిష్క్రమించింది.

ఆరోజు, క్రెమ్లిన్ నుంచి సోవియట్ యూనియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ''సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా నా పనిని ముగిస్తున్నాను'' అని పేర్కొన్నారు.

యావత్ ప్రపంచం ఆయన ప్రసంగాన్ని ఆలకించింది. చాలా మందికి, అప్పటితో ప్రచ్ఛన్న యుద్ధం, కమ్యూనిస్టు శక్తి అంతరించినట్లు అనిపించింది. మరోవైపు, కొందరు మాత్రం 'బెలావెజా' ఒప్పందానికి వారాల ముందే సోవియట్ యూనియన్ ఉనికి కోల్పోయిందని నమ్ముతారు.

అదే ఏడాది ఆగస్టులో జరిగిన తిరుగుబాటు ప్రయత్నం తర్వాత సోవియట్ యూనియన్‌కు మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయని పెద్ద సంఖ్యలో ప్రజలు అర్థం చేసుకున్నారు.

సమాఖ్య ప్రభుత్వంలోని మిత్ర దేశాలతో గోర్బచేవ్ కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో మరింత సులభమైన యూనియన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. సోవియట్ యూనియన్‌ను కాపాడుకోవడానికి ఇదే చివరి మార్గమని గోర్బచేవ్ నమ్మారు.

1991 ఆగస్టు తిరుగుబాటు ప్రయత్నం సందర్భంగా తీసిన చిత్రం

1991 ఆగస్టులో తిరుగుబాటు ప్రయత్నం

''వారు ఒక రకమైన యూనియన్‌ను కాపాడుకోవాలని అనుకున్నారు. కానీ, కాలం గడిచిన కొద్దీ రాజ్యాంగ దేశాలకు చెందిన నేతలకు ఇది కష్టతరంగా మారింది. ముఖ్యంగా బోరిస్ యెల్ట్సిన్‌కు ఇది నచ్చలేదు'' అని బీబీసీ ముండోతో 'మాస్కో, 25 డిసెంబర్ 1991: ద లాస్ట్ డే ఆఫ్ ద సోవియట్ యూనియన్' రచయిత కోనోర్ ఓక్లోరీ చెప్పారు.

రాడికల్ కమ్యూనిస్టులు, ఆర్మీతో పాటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. క్రిమియాలోని తన ఇంట్లో గోర్బచేవ్‌ను గృహనిర్బంధం చేశారు. ఆయన సెలవుల సమయంలో ఈ ఇంట్లోనే గడిపేవారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ తిరుగుబాటు జరగలేదు. మాస్కోలో బోరిస్ యెల్ట్సిన్‌ సారథ్యంలో పౌర నిరసనలు జరగడంతో ఈ తిరుగుబాటు విఫలమైంది.

మిఖైల్ గోర్బచేవ్‌కు బోరిస్ సహచరుడు, విమర్శకుడు కూడా.

ఈ తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. కానీ, దాని ఫలితంగా గోర్బచేవ్‌ ప్రభావం ముగిసింది. రష్యాలో బోరిస్ యెల్ట్సిన్ ప్రభావశీల నాయకుడిగా ఎదిగారు.

''ఆగస్టు 20న, కొత్త యూనియన్ ఒప్పందంపై సంతకం చేయాలనేది గోర్బచేవ్‌ ప్రణాళిక. అదే జరిగితే, ఒక దేశంగా సోవియట్ యూనియన్‌ నాశనం అవుతుందని ఆర్మీతో పాటు కేజీబీ నమ్మింది. నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నా'' అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సోవియట్ యూనియన్ వ్యవహారాల నిపుణులు, ప్రొఫెసర్ వ్లాదిస్లావ్ జుబోక్ అన్నారు.

తిరుగుబాటు ప్రయత్నం తర్వాత పార్లమెంట్‌లో మిఖైల్ గోర్బచెఫ్, బోరిస్ యెల్తసిన్

కొత్త యూనియన్ ఒప్పందం

సోవియట్ యూనియన్ చరిత్రకు సంబంధించిన 'ఎ ఫెయిల్డ్ ఎంపైర్: ద సోవియట్ యూనియన్ ఇన్ ద కోల్డ్ వార్ ఫ్రమ్ స్టాలిన్ టు గోర్బచేవ్' పుస్తకాన్ని ప్రొఫెసర్ వ్లాదిస్లావ్ జుబెక్ రాశారు.

''తిరుగుబాటు ప్రయత్నం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే, ఆ సమయంలో అందరూ సెలవులో ఉన్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని ప్రజలు అనుకున్నారు. కానీ, అది ఆగస్టులోనే జరుగుతుందని ఎవరూ ఊహించలేదు'' అని జుబోక్ గుర్తు చేసుకున్నారు.

సోవియట్ యూనియన్ కాలంలో ప్రొఫెసర్ జుబోక్ మాస్కోలో నివసించారు. సోవియట్ యూనియన్ చరిత్రలో డిసెంబర్ 25 అనేది చాలా ముఖ్యమైన మైలు రాయిగా ప్రజలు నమ్ముతారని ఆయన చెప్పారు.

''కానీ నేను వారితో ఏకీభవించను. ఎందుకంటే ఆరోజు గోర్బచేవ్ జాతినుద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనకు ఎలాంటి అధికారాలు లేవు. ఆయన ప్రసంగం, ఒక టీవీ కార్యక్రమంలా అనిపించింది'' అని వెల్లడించారు.

ఆరోజు తిరుగుబాటు ప్రయత్నంలో పాల్గొన్నవారు ఆగస్టులో కొత్త యూనియన్ ఒప్పందం అమల్లోకి రాకుండా అడ్డుకున్నారు. కానీ సోవియట్ యూనియట్ విచ్ఛిన్నం కాకుండా ఆపలేకపోయారు.

తిరుగుబాటు ప్రయత్నం తర్వాత, సోవియట్ యూనియన్ పతనం మరింత సమీపించిందని చాలా మంది అనుకున్నారు. కానీ, గోర్బచేవ్ సహా కొందరు మాత్రం, సార్వభౌమ దేశాలతో కూడిన కొత్త రకమైన సమాఖ్య ద్వారా సోవియట్ యూనియన్‌ను రక్షించవచ్చని నమ్మారు.

బెలవెజా ఒప్పందంపై సంతకం చేస్తోన్న బోరిస్

బెలవెజా ఒప్పందం

''లక్షలాది మంది ప్రజలు సోవియట్ యూనియన్‌ ఆలోచనను ఇష్టపడ్డారు. వీరంతా ఒక పెద్ద దేశంలో నివసించడానికి అలవాటుపడ్డారు. ఒక కొత్త పేరుతో లేదా మరొక పాలనలో ఇది మనుగడ సాగిస్తుందని వారంతా ఆశించారు'' అని ప్రొఫెసర్ వ్లాదిస్లావ్ అన్నారు.

కానీ బోరిస్ యెల్ట్సిన్‌ మరో విధమైన ఆలోచన చేశారు.

1991 డిసెంబర్ 8న, అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్‌.. సోవియట్ యూనియన్‌లోని 15 రాజ్యాంగ దేశాల నుంచి ముగ్గురు నాయకులతో సమావేశమయ్యారు.

నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు లియోనిడ్ ఎం క్రావ్‌కుక్, బెలారస్ నేత స్టానిస్లావ్ షుష్కెవిచ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. వారు 'బెలావెజా ఒప్పందం' పేరుతో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం, సోవియట్ యూనియన్‌ను రద్దు చేసి, దాని స్థానంలో కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్‌ను ఏర్పాటు చేయాలి. అందులో సోవియట్ యూనియన్‌కు చెందిన రాజ్యాంగ దేశాలను చేర్చాలి.

''ఈ ఒప్పందం తర్వాత దాదాపు అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. గోర్బచేవ్ ఈ ఒప్పందానికి అంగీకరించలేదు. ఏదో ఒక రూపంలో యూనియన్‌ను కొనసాగించాలని ఆయన రెండు, మూడు వారాల పాటు పట్టుబట్టారు'' అని జర్నలిస్ట్ కోనోర్ ఒ క్లెరీ అన్నారు.

క్రెమ్లిన్‌లో డిసెంబర్ 25న ఎర్ర జెండాను తొలగించారు.

అల్మా-అతా ప్రొటోకాల్

సోవియట్ యూనియన్‌లో మిగిలిన 12 దేశాల నుంచి 8 దేశాలు, డిసెంబర్ 21న అల్మా-అతా ప్రొటోకాల్‌పై సంతకం చేయడం ద్వారా కామన్వెల్త్‌లో చేరాయి. ఈ ఘటనతో సోవియట్ యూనియన్ మనుగడ సాగించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ముగిశాయి.

''దీని తర్వాతే, పరిస్థితి తన చేయి జారినట్లు గోర్బచేవ్ గ్రహించారు. అందుకే డిసెంబర్ 25న ప్రసంగంలో తన రాజీనామాను ప్రకటించాలని ఆయన అనుకుని ఉంటారు'' అని కోనోర్ అభిప్రాయపడ్డారు.

''మరికొన్ని రోజులు అధికారంలో ఉండటానికి బోరిస్ యెల్ట్సిన్‌ ఆయన్ను అనుమతించారు'' అని ఆయన చెప్పారు.

అల్మా-అతా ప్రొటోకాల్‌పై సంతకం చేయడం అనేది సోవియట్ యూనియన్ రాజ్యాంగానికి వ్యతిరేకమని ప్రొఫెసర్ వ్లాదిస్లావ్ జుబోక్ నొక్కి చెప్పారు. ''సోవియన్ యూనియన్‌ను విచ్ఛిన్నం చేసే హక్కు వారికి లేదు. కానీ అలా చేయడంలో వారు సఫలమయ్యారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.''

''ఆ సమయానికి కాన్ఫెడరేట్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనే స్పష్టత వచ్చింది. గోర్బచేవ్ స్థానంలో బోరిస్ ప్రభుత్వానికి ఆర్మీ విధేయంగా మారిపోయింది.''

గోర్బచెఫ్ రాజీనామా సమయంలో క్రెమ్లిన్ పూర్తిగా బోరిస్ నియంత్రణలో ఉంది

బోరిస్ నియంత్రణలో క్రెమ్లిన్

దీని తర్వాత, గోర్బచేవ్ రాజీనామా ప్రకటించేంత వరకు క్రెమ్లిన్‌లో పరిస్థితులు నిశ్శబ్ధంగా మారిపోయాయి. అధికారానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు.

డిసెంబర్ 25న కూడా క్రెమ్లిన్‌లో అలాంటి వాతావరణమే నెలకొంది. అప్పటికే అధ్యక్ష భవనం బోరిస్ యెల్ట్సిన్‌ నియంత్రణలోకి వెళ్లింది. క్రెమ్లిన్‌లో భద్రతా వ్యవహారాలను బోరిస్‌కు విధేయంగా ఉన్న ఒక రెజిమెంట్‌కు అప్పగించారు. దీంతో తన కార్యాలయానికి, కొన్ని గదులకు మాత్రమే గోర్బచేవ్ పరిమితమయ్యారు.

ఆ గదులను కూడా సీఎన్‌ఎన్, ఏబీసీ జర్నలిస్టులు ఆక్రమించారు. రాజీనామాకు సంబంధించిన కవరేజీని ప్రసారం చేసేందుకు వారు అక్కడ సన్నద్ధమవుతున్నారు.

''రాజీనామా ప్రకటనకు ముందు బ్రిటీష్ ప్రధానమంత్రి జాన్ మేజర్‌తో గోర్బచేవ్ ఫోన్‌లో మాట్లాడారు. దాని తర్వాత ఆయన విచారంగా కనిపించారు. ఒక గదిలోకి వెళ్లి ఒంటరిగా కాసేపు గడిపారు'' అని జర్నలిస్ట్ కోనోర్ చెప్పారు.

''ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. రెండు పెగ్గుల ఆల్కహాల్ తీసుకున్నారు. గోర్బచేవ్ ఏడ్వటాన్ని ఆయన సహచరుడు అలెగ్జాండర్ యాకోలెవ్ చూశారు. బహుశా, గోర్బచేవ్ జీవితంలోనే అది అత్యంత విచారకమైన క్షణాలు అయి ఉండొచ్చు. కానీ, ఆయన త్వరగా సంభాళించుకొని ప్రసంగానికి సిద్ధమయ్యారు'' అని ఆయన గుర్తు చేసుకున్నారు.

డిసెంబర్ 25న రష్యా జెండాను ఎగురవేశారు

'మనం కొత్త ప్రపంచంలో నివసిస్తున్నాం'

షెడ్యూల్‌లో నిర్ణయించినట్లు, సోవియట్ యూనియన్‌కు చివరి నాయకుడైన మిఖాయిల్ గోర్బచేవ్ ప్రసంగం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. పది నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. అప్పటికే ఉనికి కోల్పోయిన తన నాయకత్వానికి ఆయన అధికారికంగా రాజీనామా చేశారు.

రాజీనామా చేయాలనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ 'ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలో జీవిస్తున్నాం' అని అన్నారు.

ఆరోజు ప్రసంగానికి కేవలం టీవీలకు మాత్రమే అనుమతిచ్చారని ప్రొఫెసర్ వ్లాదిస్లావ్ చెప్పారు. సీఎన్‌ఎన్ ఆ ప్రసంగాన్ని అనువదించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రసారం చేశారని ఆయన వివరించారు.

సోవియట్ యూనియన్ కన్నా మిగతా దేశాల్లో మిఖాయిల్ గోర్బచేవ్ అధికంగా కీర్తి గడించారు. ఆయన ప్రసంగం, మిగతా ప్రపంచానికి చాలా అవసరమైనదని నిపుణులు భావించారు.

''సోవియట్ టీవీల్లో ఆయన ప్రసంగం చాలా క్లుప్తంగా ఇచ్చారు. అప్పటికే ఆయన సోవియట్ యూనియన్‌లో ఆదరణను కోల్పోయారు. ఆయన ఏం చెబుతారో అనే ఆసక్తి ఎవరికీ లేదు. ప్రతీ ఒక్కరికీ సోవియట్ యూనియన్ ఒక ముగిసిన అధ్యాయం అని అర్థమైపోయింది'' అని జుబోక్ చెప్పారు.

మిఖాయిల్ గోర్బచేవ్

మిఖాయిల్ గోర్బచేవ్ ప్రసంగం

మిఖాయిల్ గోర్బచేవ్ ప్రసంగం చాలా గౌరవప్రదంగా ఉందని ప్రొఫెసర్ వ్లాదిస్లావ్ అభిప్రాయపడ్డారు. కానీ ఆ ప్రసంగం తర్వాత, ఆయన సహచరులలో, అధికార గణంలో కాస్త అసంతృప్తి కనిపించినట్లు ఆయన చెప్పారు.

''గోర్బచేవ్, తన వైఫల్యాల ఊసెత్తలేదు. ఎందుకు ఆర్థిక సంక్షోభం తలెత్తిందో చెప్పలేదు. ఆయన బోరిస్ ముందు అత్యున్నత స్థాయి నైతిక విలువలున్న వ్యక్తిగా ఉండాలనుకున్నారు. అందుకే ప్రసంగం తర్వాత గోర్బచేవ్‌ను కలిసేందుకు బోరిస్ నిరాకరించారు'' అని ఆయన చెప్పారు.

ఆయన ప్రసంగంలో యెల్ట్సిన్‌‌ను కాస్త ప్రశంసించి ఉండాల్సిందని జర్నలిస్ట్ కోనోర్ అన్నారు.

''తిరుగుబాటు ప్రయత్నం సమయంలో ఆయనను యెల్ట్సిన్‌ కాపాడారు. అప్పుడు యెల్ట్సిన్‌ లేకపోయుంటే, గోర్బచేవ్‌ జైలుకి వెళ్లి ఉండేవారు'' అని ఆయన చెప్పారు.

''ప్రసంగంలో తన పేరు ప్రస్తావించకపోయేసరికి యెల్ట్సిన్‌‌ మండిపడ్డారు. వెంటనే క్రెమ్లిన్ నుంచి ఎర్ర జెండాను తొలగించాలని ఆదేశించారు. నిజానికి ఆ జెండాను ఏడాది చివర వరకు ఉంచాలి'' అని చెప్పుకొచ్చారు.

బోరిస్ యెల్ట్సిన్‌‌ అసంతృప్తి

గోర్బచేవ్‌తో పాటు ఆయన భార్యకు సంబంధించిన వస్తువులను అదే రోజు రాత్రికి అధ్యక్ష భవనం నుంచి తరలించాలని యెల్ట్సిన్‌‌ ఆదేశించారు. అంతకుముందు గోర్బచెవ్ మరికొన్ని రోజులు అధ్యక్ష భవనంలో ఉండొచ్చని తెలిపిన బోరిస్ మనసు మార్చుకున్నారు.

ప్రసంగం తర్వాత గోర్బచేవ్, యెల్ట్సిన్‌‌ ఎప్పుడూ ఎదురుపడలేదు. క్రెమ్లిన్‌లో ఎర్ర జెండాను తొలిగించినప్పుడు కూడా మాస్కోలోని రెడ్ స్క్వేర్‌ నిర్జనంగా మారడం, అక్కడ గోర్బచేవ్ తన ప్రాముఖ్యాన్ని కోల్పోయారనడానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

అదే రోజు రాత్రి 7:32 నిమిషాలకు, రష్యా తొలి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్‌‌ నేతృత్వంలో సోవియట్ యూనియన్ ఎర్ర జెండా స్థానంలో రష్యన్ జెండాను ఎగురవేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్టు దేశం విచ్ఛిన్నం కావడంతో 15 స్వతంత్ర రిపబ్లిక్‌లు ఆవిర్భవించాయి. అర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, ఎస్టోనియా, జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, లాత్వియా, లిథువేనియా, మాల్డోవా, రష్యా, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్‌లు ఏర్పడ్డాయి.

మరోవైపు, గ్లోబులో మరో చివరన ఉన్న అమెరికా... ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How did the story of Mikhail Gorbachev end, and how did the most powerful nation that challenged America fall?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X