వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దర్గా ముందు తిండి కోసం ఎదురు చూసే ఈ చిన్నారి మిలియనీర్ ఎలా అయ్యాడు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

చదువుకోవాల్సిన వయసులో షాజెబ్ ఆకలితో వీధుల్లో తిరిగేవాడు. అనాథలా గడిపే అతడి జీవితాన్ని ఒక ఘటన మలుపుతిప్పింది.

ఉత్తరాఖండ్‌లోని ''పిరాన్ కలియర్ షరీఫ్’’ దర్గా పరిసరాల్లో షాజెబ్ తిరుగుతూ కనిపించేవాడు. అక్కడి లంగర్‌లో పెట్టే భోజనంతోనే కడుపు నింపుకునేవాడు. అయితే, తను లక్షల రూపాయలకు వారసుడనే సంగతి అతడికి ఏ మాత్రం తెలియదు.

ఇదేదో చందమామ కథలా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం.

తల్లిదండ్రుల గొడవతో..

షాజెబ్ వయసు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు, అతడి జీవితం భిన్నంగా ఉండేది. అతడిని ఇంట్లో అందరూ చక్కగా చూసుకునేవారు.

తల్లి ఇమ్రానా బేగం, తండ్రి మహమ్మద్ నావెద్‌లతో కలిసి సహారన్‌పుర్ జిల్లా నాగల్ బ్లాక్‌లోని ''పాండోలీ’’ గ్రామంలో అతడు జీవించేవాడు.

అయితే, 2019లో అతడి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. తల్లి ఇమ్రానా బేగం, తండ్రి నావెద్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఆ గొడవ తర్వాత షాజెద్‌ను తీసుకొని హరియాణా యమునానగర్‌లోని పుట్టింటికి ఇమ్రానా వెళ్లిపోయారు. అయితే, అప్పటికి నాలుగేళ్ల ముందు నుంచీ, అంటే 2015 నుంచి నావెద్ పక్షవాతంతో బాధపడేవారు.

భార్య, కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేటప్పుడు, నావెద్ మంచంపై అలానే ఉండిపోయారు. ఇమ్రానాను వెనక్కి రావాలని ఆయన చాలాసార్లు పిలిచారు. కానీ, ఆమె రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె తన ఫోన్ నంబరును కూడా మార్చేశారు.

మధ్యలోనున్న వ్యక్తి షాజెబ్ తండ్రి నావెద్

కోవిడ్-19 వ్యాప్తితో

అలా రోజులు గడిచాయి. తర్వాత యమునానగర్‌లోని పుట్టింటి నుంచి ఉత్తరాఖండ్‌ హరిద్వార్ జిల్లా పిరాన్ కలియర్ షరీఫ్ ప్రాంతానికి కొడుకుని తీసుకొని ఇమ్రానా వెళ్లిపోయారు.

రూ.1500 పెట్టి ''పిరాన్ కలియర్ షరీఫ్’’లో ఇమ్రానా బేగం ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆమె దర్గాలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.

అయితే, కోవిడ్-19 వ్యాప్తితో వీరి జీవితాలు తలకిందులయ్యాయి. రెండో వేవ్‌లో ఇమ్రానాకు కోవిడ్-19 సోకింది. షాజెబ్ కళ్ల ముందే ఆమె చనిపోయారు.

''చివరి రోజుల్లో నేను అమ్మతోనే గడిపాను’’అని ఇంట్లో సోఫాపై కూర్చుని ప్రస్తుతం షాజెబ్ వివరించాడు. దర్గాకు వచ్చేవారే తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించారని తెలిపాడు.

''నేను చాలా ఏడ్చేవాడిని. దర్గాలో పెట్టే భోజనంతోనే కడుపు నింపుకునేవాడిని. కొన్నిసార్లు ఆకలితో పడుకోవాల్సి వచ్చేది’’అని అతడు వివరించాడు.

టీ దుకాణంలో గ్లాసులు కడుగుతూ

పరిచయంలేని చోటు, వ్యక్తుల నడుమ షాజెబ్ ఒంటరి జీవితం గడపడం మొదలుపెట్టాడు. అలా అతడి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి.

ఆకలి తీర్చుకునేందుకు దగ్గర్లోని టీ దుకాణంలో షాజెబ్ పనిచేసేవాడు. అక్కడకు వచ్చే కస్టమర్లు అతడిని చోటూ అని పిలిచేవారు. వారికి టీ ఇవ్వడం, ఆ గ్లాసులు కడగడం అతడి పని.

అయితే, దుకాణానికి వచ్చే కొంతమంది అతడితో కఠినంగా ప్రవర్తించేవారు కూడా. మొత్తంగా అతడికి రోజుకు రూ.150 వచ్చేవి. వీటిలో రూ.30 ఇంటి అద్దెకే ఇవ్వాల్సి వచ్చేది.

ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని దర్గాలో ఒక వ్యక్తి దగ్గర షాజెబ్ ఉంచేవాడు. అలా అతడు రూ.600 దాచుకున్నాడు.

''నా చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఆడుకుంటే, నాకు కూడా ఆడుకోవాలని అనిపించేది. పిల్లలు ఎవరైనా స్కూలుకు వెళ్తూ కనిపిస్తే.. నాకు కూడా అమ్మ, నాన్న ఉంటే నేను కూడా స్కూలుకు వెళ్లేవాడ్నేమో అనిపించేది’’అని షాజెబ్ చెప్పాడు.

అతడి జీవితం ఎలా మారింది?

ఒక రోజు ''పిరాన్ కలియార్’’ ప్రాంతంలోని తన చెల్లి వాజిదాను కలిసేందుకు ముబీన్ అలీ వచ్చారు. ఆయన షాజెబ్‌కు కూడా దూరపు బంధువు.

ఆ పరిసరాల్లో షాజెబ్‌ను చూసిన వెంటనే.. ''నీ పేరు ఏంటి? నువ్వు ఎక్కడ ఉంటావు?’’అని ముబీన్ అడిగారు.

''నా పేరు షాజెబ్. మేం సహారన్‌పుర్‌లో ఉండేవాళ్లం’’ అని అతడు సమాధానం ఇచ్చాడు.

వెంటనే మీ నాన్న పేరు ఏమిటని ముబీన్ అడిగారు.. ''దీంతో నావెద్’’ అని సమాధానం ఇచ్చాడు షాజెబ్.

''మీ తాతయ్య పేరు యాకుబ్ ఏనా?’’అని అడిగినప్పుడు.. ''అవును’’అని సమాధానం ఇచ్చాడు షాజెబ్.

''యాకుబ్‌తోపాటు నీకు ఇంకా ఎవరు తెలుసు?’’అని అడిగినప్పుడు.. ''దాదా షా అలం, చిన్నాన్న రియాజ్, పిన్ని హీనా’’అని వరుసగా పేర్లను షాజెబ్ చెప్పాడు.

ఆ సమాధానాలు విన్న తర్వాత, ''నువ్వు మా ఇంటి బిడ్డవి’’అని ముబీన్ అతడికి హత్తుకున్నాడు.

వెంటనే తన ఫోన్ తెరచి షాజెబ్ నాలుగేళ్ల వయసున్నప్పుడు తీసిన ఫోటోలను ముబీన్ చూపించాడు. ఆ ఫోటో చూడగానే.. ''ఇది నా ఫోటో’’అని షాజెబ్ గుర్తుపట్టాడు.

వెంటనే సహారన్‌పుర్‌లోని యాకుబ్ కుటుంబానికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ముబీన్ చెప్పారు. ఆ మరుసటిరోజే షాజెబ్ బాబాయి నవాజ్ ఆలం అక్కడకు వచ్చాడు. అతడిని వారి సొంత ఇంటికి తీసుకెళ్లారు.

మిలియనీర్

ఈ కథ నిజమేనని ధ్రువీకరించుకునేందుకు మేం హరిద్వార్‌లోని ''పిరాన్ కలియార్’’ ప్రాంతానికి వెళ్లాం. ఇక్కడే మూడేళ్లపాటు షాజెబ్ గడిపాడు.

అక్కడ మేం మునావర్ అలీని కలిశాం. ఆయన కుటుంబం దర్గా ఎదురు ఇంట్లో జీవిస్తుంది.

ఇక్కడ షాజెబ్ ఒంటరిగా పేదరికంలో జీవించినప్పటి ప్రాంతాలన్నీ అలీ మాకు చూపించారు. ''నిజానికి యాకుబ్ మాకు కూడా బంధువే అవుతారు. కానీ, షాజెబ్ ఇక్కడ ఉండేటప్పుడు మేం గుర్తించలేకపోయాం’’అని ఆయన వివరించారు.

''దర్గా వెలుపల చిన్న షెడ్డు కింద షాజెబ్ ఉండేవాడు. చలికాలంలో మా ఇంటి దగ్గర పడుకోవడానికి రావాలని మేం అతడికి సూచించేవాళ్లం. ఒక్కోసారి అతడు భోజనం కోసం కూడా మా ఇంటికి వచ్చేవాడు’’అని మునావర్ చెప్పారు.

''షాజెబ్ చిన్నప్పటి ఫోటో మా దగ్గర కూడా ఉంది. కానీ, ఇప్పుడు అతడు బాగా మారిపోయాడు. దీంతో మేం గుర్తుపట్టలేకపోయాం’’అని మునావర్ వివరించారు.

షాజెబ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు?

ప్రస్తుతం సహారన్‌పుర్‌లో పెద్ద ఇంటిలో చాలా మంది కుటుంబ సభ్యుల మధ్య షాజెబ్ జీవిస్తున్నాడు.

ఆ ఇంటిలో షా ఆలం, షాజెబ్ నాన్నమ్మ షెహనాజ్ బేగం, నలుగురు చిన్నాన్నలు రియాజ్, ఫయాజ్, షానవాజ్, నవాజ్‌లు కూడా వారి భార్యలతో జీవిస్తున్నారు. ఈ ఇంట్లో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. షాజెబ్‌తో కలిసి వీరి సంఖ్య పదికి పెరిగింది. వీరందరితో కలిసి షాజెబ్ హాయిగా ఆడుకుంటున్నాడు.

ఇమ్రానా వెళ్లిపోయినా కొంత కాలానికి షాజెబ్ తండ్రి నావెద్ మరణించారు. అయితే, నావెద్ పేరిట ఉన్న కొన్ని ఆస్తుల పత్రాలను ఆయన సోదరులు మాకు చూపించారు. వీటి మొత్తం విలువ రూ.50 లక్షల వరకూ ఉంటుందని వారు చెప్పారు. ఆ ఆస్తి మొత్తం షాజెబ్‌కు చెందుతుందని వివరించారు.

''అతడు కోరుకున్నది చేస్తాం’’

ఏళ్ల తర్వాత మళ్లీ షాజెబ్‌ను కవలడంపై అతడి నాన్నమ్మ షెహనాజ్ బేగం చాలా సంతోషంగా ఉన్నారు.

''షాజెబ్ కోరుకున్నది చేస్తాం. ఏం చదువుకోవాలని అతడు భావిస్తే అది చదివిస్తాం. అతడిని బాగా చూసుకుంటాం’’అని ఆమె చెప్పారు.

ప్రస్తుతం 11 ఏళ్ల షాజెబ్ కుటుంబ సభ్యుల నడుమ సంతోషంగా జీవిస్తున్నాడు. పెద్దయ్యాక అనాథల కోసం ఒక ఆశ్రమం కట్టాలని అతడు భావిస్తున్నారు.

''నాలా ఏ చిన్నారీ బాధ పడకూడదు’’అని అతడు వివరించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How did this little boy who waited for food in front of a dargah become a millionaire?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X