వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి? 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విమాన ప్రమాదం

1996 నవంబర్ 12 సాయంత్రం సౌదీ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి ఎప్పటిలాగే దిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. గాలి కూడా ప్రశాంతంగా వీస్తోంది.

కాసేపట్లో కొన్ని వేల అడుగుల ఎత్తున దాదాపు 350 మంది ప్రయాణికులతోసహా ఆ విమానం ముక్కలవబోతోంది అనడానికి అక్కడ ఎలాంటి సంకేతాలూ కనిపించడం లేదు.

గంటకు దాదాపు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న బోయింగ్ 747 నిమిషాల్లోనే 14 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. మరింత ఎత్తుకు వెళ్లడానికి దిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ అనుమతి కోరింది. కానీ ఏటీసీ దానికి అదే ఎత్తులో వెళ్లాలని సూచించింది.

ఆ రోజుల్లో దిల్లీ విమానాశ్రయం రన్-వే వన్ వేగా ఉండేది. (వచ్చిపోయే విమానాలు రన్ వే మీద ఒకే వైపు నుంచి జరిగేవి) అదే సమయంలో కజకిస్తాన్‌కు చెందిన ఐఈఎల్-76 విమానం దానికి వ్యతిరేక దిశలో 15 వేల అడుగుల ఎత్తులో దిల్లీ వైపు వస్తోంది. దిల్లీ ఏటీసీ నుంచి దానికి 'ఎఫ్ఎల్ 150' అంటే 15 వేల అడుగుల ఎత్తులోనే ఉండాలని ఆదేశాలు అందాయి.

"మీకు సరిగ్గా వ్యతిరేక దిశలో సౌదీ ఎయిర్ లైన్స్ విమానం కేవలం పది మైళ్ల దూరంలో ఉంది. అది ఐదు మైళ్లలోపే మీ విమానాన్ని దాటవచ్చు" అని ఏటీసీ కజకిస్తాన్ విమానానికి చెప్పింది.

"రిపోర్ట్ ఇఫ్ ఇన్ సైట్" అంటే విమానం కనిపిస్తే ఏటీసీకి సమాచారం ఇవ్వాలని కూడా సూచించింది.

కజకిస్తాన్ విమానం మరోసారి ఎత్తు గురించి అడిగింది. సౌదీ విమానం ఇప్పుడు 8 మైళ్ల దూరంలో, 14 వేల అడుగుల ఎత్తులో ఉందని ఏటీసీ చెప్పింది.

విమాన ప్రమాదం

"150కి(15 వేల అడుగులకు చేరుకున్నాం.. ఎందుకంటే 140 దగ్గర.. ఆ.. అది ఉంది.. ఒక.." అని కజకిస్తాన్ పైలెట్లు అనడం ఏటీసీకి వినిపించింది.

ఈ విమాన దుర్ఘటనపై దిల్లీ హైకోర్ట్ జడ్జి ఆర్సీ లాహోటీ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేసింది.

కజకిస్తాన్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన సంభాషణను బట్టి రెండు విమానాలూ ఢీకొనడానికి సరిగ్గా నాలుగు సెకన్ల ముందు ఎదురుగా ఉన్న సౌదీ విమానాన్ని వారు చూశారని ఆ కమిటీ చెప్పిది.

ఈ దుర్ఘటన విమానయాన చరిత్రలో అత్యంత భయానక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 8 దేశాలకు చెందిన మొత్తం 350 మంది చనిపోయారు.

వీరిలో సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలోనే 312 మంది ప్రయాణికులు 23 మంది సిబ్బంది ఉన్నారు. కజకిస్తాన్ విమానంలో 32 మంది ప్రయాణికులతోపాటూ ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

అలాగే సౌదీ విమానం పైలెట్ల చివరి మాటల ద్వారా కూడా కజకిస్తాన్ విమానం వారికి కూడా చివరి క్షణంలో కనిపించిందని, మృత్యువు తమకు చాలా దగ్గరగా వచ్చేసిందనే విషయం వాళ్లకు అర్థమైందని తెలిస్తోంది.

లాహోటీ కమిటీ నివేదికలోని వివరాల ప్రకారం సౌదీ పైలెట్లు చివరగా "అస్తగ్ఫిరుల్లాహ్, అషహద్, ఇన్నా లిల్లాహి వ రాజివూన్"(మేం భగవంతుడిని క్షమాపణ అడుగుతున్నాం. సాక్ష్యం ఇస్తున్నాం, మేం ఆయన దగ్గరకే చేరుతామని ఆశిస్తున్నాం) అన్నారు.

ఘటనా స్థలంలో కనిపించిన విమాన శకలాలను బట్టి కజకిస్తాన్ విమానం సౌదీ విమానానికి కింది నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. సౌదీ విమానం కనిపించగానే ఆ విమానం పైలెట్లు వెంటనే తాము వెళ్లాల్సిన 15 వేల అడుగుల ఎత్తుకు చేరుకోడానికి ప్రయత్నించారు. సరిగ్గా చివరి క్షణంలో దాని వెనుక భాగం సౌదీ విమానం కుడి రెక్కకు తగిలింది.

విమాన ప్రమాదం

ఒకే ఒక సాక్షి ఉన్నాడు

ఈ ప్రమాదంలో రెండు విమానాలూ ఢీకొంటున్న సమయంలో నేలపై నుంచి చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరు. కానీ ఆ సమయానికి ఆకాశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఘటన జరిగిన కొన్ని క్షణాల తర్వాత పరిస్థితి గురించి అతడు ఏటీసీకి చెప్పాడు.

దిల్లీకి 8 నిమిషాల దూరంలో అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక విమానం ఇస్లామాబాద్ నుంచి అమెరికా రాయబార కార్యాలయం సరుకులను దిల్లీకి తీసుకొస్తోంది. రెండు విమానాలూ ఢీకొన్ని రెండు నిమిషాల తర్వాత దాని పైలెట్ తాను ఒక పెద్ద అగ్ని గోళాన్ని చూశానని అది, క్షణాల్లో భూమిపై రెండు దిశలుగా పడడం కనిపించిందని దిల్లీ ఏటీసీకి చెప్పారు.

"మేం మా కుడివైపున ఒక పెద్ద అగ్ని గోళం లాంటిది చూశాం. అది ఒక పెద్ద పేలుడులా అనిపిస్తోంది" అని ఏటీసీతో మాట్లాడిన ఆ పైలెట్ చెప్పాడు. కానీ, అప్పటికే చాలా ఆలస్యమైందని వారికి అర్థమైంది.

మొదట దాన్ని తాము మెరుపు అనుకున్నామని, ప్రస్తుతం మీకు వాయవ్య దిశగా కుడివైపు దాదాపు 44 మైళ్ల దూరంలో రెండు మంటలు కనిపిస్తున్నాయని నిమిషం తర్వాత అదే అమెరికా విమానం పైలెట్ ఏటీసీకి ధ్రువీకరించాడు.

"మాకు మబ్బుల్లో నుంచి ఒక పెద్ద అగ్ని గోళం లాంటిది కనిపించింది, శకలాలు కూడా కనిపించాయి. నేలపై రెండు ప్రాంతాల్లో మంటలు ఉన్నాయి" ఓవర్ అన్నాడు.

ఆ మండుతున్న విమాన భాగాలు దిల్లీ ఎయిర్ పోర్టుకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో హరియాణాలోని చరఖీ దాద్రీ గ్రామంలో పడ్డాయి.

తర్వాత ఆ రోజు పత్రికల్లో ఈ దుర్ఘటన పతాక శీర్షికల్లో నిలిచింది. 257 శవాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని, 62 శవాలు అసలు గుర్తించలేనంతగా మాడిపోయాయని, మరో 32 పూర్తిగా ఛిద్రం అయ్యాయని వార్తా కథనాల్లో చెప్పారు.

విమాన ప్రమాదం మృతుల్లో 331 మంది భారతీయులు, 15 మంది సౌదీ, 9 మంది నేపాలీలు, ముగ్గురు పాకిస్తానీ, ఇద్దరు అమెరికన్లు, ఒక బ్రిటిష్, మరో బంగ్లాదేశీ ఉన్నారు.

విమాన ప్రమాదం

ఘటనాస్థలంలో దృశ్యం

పైనుంచి రెండు అగ్ని గోళాలు కింద పడడం, నల్లగా పొగలు కమ్ముకోవడం తాము చూశామని చరఖీ దాద్రీ గ్రామస్థులు మీడియాతో చెప్పారు.

గ్రామస్థులు చెప్పిన వివరాలను కమిటీ తమ నివేదికలో చెప్పింది.

"మొదట ఒక భారీ శబ్దం వచ్చింది. అది వినగానే గ్రామంలో అందరూ వణికిపోయారు. ఇళ్ల తలుపులు కిటికీలు పగిలి, గాజు ముక్కలు పడ్డాయి. దానిని భూకంపం అనుకున్న ఊళ్లోవాళ్లు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు" అని చెప్పారు.

తర్వాత అది విమాన ప్రమాదం అని తెలీగానే జనం మంటలు, పొగలు కనిపించిన వైపు పరిగెత్తారు. ఆ శకలాలు గ్రామానికి దూరంగా పొలాల్లో పడ్డాయి.

తమ గ్రామాన్ని కాపాడాలని ప్రయత్నించిన సౌదీ పైలెట్ విమానాన్ని పొలాల వైపు తీసుకెళ్లాడని వాళ్లు భావించారు. అయితే దర్యాప్తులో దానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదు.

అప్పటికే ఆ వార్త దిల్లీలోని మీడియా ఆఫీసులకు చేరుకుంది. అప్పటికే సాయంత్రం బులెటిన్లు రికార్డ్ అయిపోయాయి.

ప్రమాదం గురించి అరకొర సమాచారంతో జర్నలిస్టులు ఘటనాస్థలానికి చేరుకోవాలని పరుగులు తీశారు. కానీ, పూర్తిగా సమాచారం తెలుసుకోకుండా, ఆ హడావుడిలో కొందరు హరియాణాలోని చరఖీ దాద్రీకి బదులు ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రీ గ్రామానికి చేరుకున్నారు.

ప్రమాదం జరిగిన రోజు ఘటనా స్థలానికి చేరుకున్న మొదటి జర్నలిస్టుల్లో ఎన్డీటీవీలో పనిచేసిన నటాషా ఒకరు. ఆమె అక్కడికి చేరుకునేటప్పటికే రాత్రి దాదాపు 11 గంటలైంది. విమానం శకలాలు మండుతుండడం దూరం నుంచి కనిపించాయని ఆమె చెప్పారు.

"నేను ఆ శకలాల్లోంచి ముందుకు వెళ్తున్నప్పుడు నా కాలికి ఏదో తగిలింది. నాతో ఉన్న కెమెరా మెన్ తన కెమెరా లైట్ ఆన్ చేసి చూశాడు. అది ఒక శవం, నాకు ఇప్పటికీ ఆ ముఖం, ఆ మృతదేహం ఉన్న స్థితి గుర్తొస్తుంది. అతను నిద్రపోతున్నట్టే ఉన్నాడు" అని ఆమె చెప్పారు.

అక్కడంతా కాలుతున్న శవాల దుర్గంధం వ్యాపించిందని చెప్పిన నటాషా, ఆ మృతదేహాలు, శకలాలు అన్నీ చుట్టుపక్కల పొలాల్లో చెల్లా చెదురుగా పడ్డాయని, అక్కడ ఉన్నజర్నలిస్టులందరూ చీకట్లో మట్టి, పేడ అనుకుని శవాలపైనే నడిచారని చెప్పారు.

నటాషా కూడా మిగతా జర్నలిస్టులతో కలిసి రాత్రి అక్కడే ఉండిపోయారు. ఉదయం ఆ ప్రమాదం ఎంత భయంకరమైనదో వాళ్లకు అర్థమైంది. ఎక్కడ చూసినా శవాలు, వాచీలు, నగలు, కళ్ల జోళ్లు, చీరలు, మసాలా ప్యాకెట్లు, బొమ్మలు కనిపిస్తున్నాయి.

"అక్కడంతా పడున్న సామాన్లు స్వయంగా ఆ విషాదం గురించి చెబుతున్నాయి. నాకు అక్కడ ఒక బొమ్మ, టెడ్డీ బేర్, బ్యాగ్ పడుండడం కనిపించింది. కొన్ని మృతదేహాలు సగమే కనిపించాయి. మరికొన్ని పూర్తిగా కాలిపోయాయి. రెండు విమానాలు గాల్లో ఢీకొనడం లాంటి ప్రమాదం అసలు ఊహించలేనిది" అన్నారు.

"సౌదీ విమానం ఇంజన్ వేల అడుగుల ఎత్తు నుంచి వేగంగా పడిన చోట 20 అడుగుల గుంత పడింది. విమానం భాగాలను అసలు గుర్తించలేకపోతున్నారు. దాని తోక భాగం మాత్రమే కొద్దిగా కనిపిస్తోంది" అన్నారు.

అప్పటి వార్తా పత్రికల్లో కథనాల ప్రకారం స్థానికులు అప్పటికే శవాల నుంచి వాచీలు, నగలు, బట్టలు తీసుకునేశారు. ఆ తర్వాత కొందరు మృతుల సామాన్లు స్వాధీనం చేసుకోడానికి అధికారులకు సహకరించారు. వారితో కలిసి శవాలను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సాయం చేశారు.

"శవాలను చరఖీ దాద్రీ ఆస్పత్రికి తీసుకొచ్చినపుడు వాటిని కారిడార్లో, వార్డుల్లో ఉన్న ఐస్ కుప్పల మీద పడేశారు. దాంతో అక్కడంతా చాలా రక్తం ప్రవహించడం మొదలైంది" అని న్యూయార్క్ టైమ్స్ ఒక రిపోర్ట్ ప్రకారం రాసింది.

స్థానిక ఆస్పత్రుల్లో శవాలను పాడవకుండా ఉంచడం అంత సులభం కాదు. చాలా శవాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి, ఛిద్రమైపోయాయి. వాటిని వెంటనే ఖననం లేదా దహనం చేయడం తప్పనిసరిగా కనిపిస్తోంది.

విమాన ప్రమాదం

ఆశల ప్రయాణం

రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికులు తమ జీవితంలో మరింత ఎదగాలనే ఆశలతో తమ తాత్కాలిక గమ్యాల వైపు వెళ్తున్నారు.

కజకిస్తాన్ విమానాన్ని కిర్గిజ్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు అద్దెకు తీసుకున్నారు. చలికాలం వస్తుండడంతో తక్కువ ధరలో బట్టలు కొనుక్కు వెళ్లాలని వారు దిల్లీ వస్తున్నారు.

సౌదీ విమానంలో ఎక్కువగా కూలీలు ఉన్నారు. వాళ్లంతా సౌదీ అరేబియాలో అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగంలో పని చేయడానికి వెళ్తున్నారు.

25 ఏళ్ల తర్వాత ఇప్పటికీ మృతుల కుటుంబ సభ్యుల్లో ఆ ఘటన జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి.

బిహార్ గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన ఖుర్షీద్ ఆలమ్ చాలాసార్లు సౌదీ అరేబియా వెళ్లారు. ఆయన భార్య సఫియా ఖాతున్‌కు ఆయన చాలా కాలంపాటు విదేశాల్లో ఉండడం మామూలు విషయం అయిపోయింది.

ఖుర్షీద్ సౌదీ వెళ్లిన తర్వాత రెండేళ్ల తర్వాత నెల రోజులు ఉండడానికి మళ్లీ వస్తాడని ఆమెకు తెలుసు. కానీ కుటుంబాన్ని పోషించడానికి ఆయన వెళ్లక తప్పదు. ఆమెకు ఈ ప్రమాదం గురించి అది జరిగిన తర్వాత రోజు సాయంత్రం తెలిసింది.

ఆ సమయంలో అప్పటికప్పుడే ఏదైనా సమాచారం ఇవ్వడానికి చుట్టూ ఫోన్లు ఉండేవి కావు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గ్రామంలో ఒకాయన ఆమె దగ్గరికి వచ్చారు. ఖుర్షీద్ ఏ విమానంలో వెళ్లాడని అడిగాడు. దిల్లీ బయట ఒక విమానం ప్రమాదానికి గురైందని రేడియోలో విన్నట్లు చెప్పారు. ఆమె భయం నిజమైంది.

దీంతో కుటుంబం దగ్గర మిగిలిన కాస్త డబ్బు తీసుకుని ఖుర్షీద్ సోదరుడు షమీవుల్లా వెంటనే దిల్లీకి బయల్దేరాడు. చాలా కష్టపడి మూడు రోజుల తర్వాత చరఖీ దాద్రీ చేరుకున్నాడు. కానీ, అప్పటికే శవాలను దిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లారని ఆయనకు చెప్పారు.

మిగతా బాధిత కుటుంబ సభ్యులు రావడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని షమీవుల్లా చెప్పారు. అందరూ తమ వారి మృతదేహాలు వెతుక్కుంటూ ఘటనా స్థలం, దిల్లీ విమానాశ్రయం, ఆస్పత్రుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చిందన్నారు.

అధికారులు తమకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఎంతో దూరం నుంచి వచ్చిన అందరూ ఎవరి దగ్గరకు వెళ్లాలో, ఏం చేయాలో తెలీని పరిస్థితిలో పడిపోయారని అన్నారు.

అప్పటి వార్తా పత్రికల్లో ఆనాటి పరిస్థితి గురించి కథనాలు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాస్తే, దిల్లీ చేరుకున్న 12 గంటలైనా శవాలను శవపేటికల్లో పెట్టలేదు. కొన్ని బయటే ఉన్నాయి. వాటిపై కాకులు కూడా వాలుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. శవపేటికల కోసం మృతుల బంధువుల మధ్య గొడవ జరిగిందని, వాటి కోసం లంచాలు కూడా ఇవ్వాల్సి వస్తోందని అందులో చెప్పారు.

షమీవుల్లా ఎయిమ్స్ చేరుకున్నారు. కానీ అక్కడ కూడా శవం దొరకలేదు. ఆయన కనిపించిన ప్రతి ఒక్కరినీ తన తమ్ముడి శవం గురించి అడుగుతూ వచ్చారు. అప్పుడే ఆయనకు ఎవరో ప్రమాదంలో చనిపోయిన వారి శవాలను దిల్లీలోని మరో ఆస్పత్రికి కూడా పంపించారని చెప్పారు.

చివరకు ఎన్నో ట్రక్కుల్లో వెతికిన తర్వాత, నాలుగో రోజు రాత్రి 11 గంటలకు ఆయనకు తన తమ్ముడి శవం దొరికింది. ఐదో రోజు ఆయన తన గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయానికే శవం దుర్గంధం వస్తోంది. కానీ, తమ్ముడి శవం పూర్తిగా ఉండడంతో ఆయన అది చాలనుకున్నారు.

"మాకు శరీరం మీద ఒక గాయం కూడా కనిపించలేదు. కానీ, తన జేబులో ఉన్న డబ్బు మాత్రం మాయమైంది" అన్నాడు.

ఖుర్షీద్‌తోపాటూ అదే గ్రామంలో మరో వ్యక్తి కూడా ఆ ప్రమాదంలో చనిపోయాడు. కానీ అతడి శవం దొరకలేదు.

అస్లమ్ ఇజాజ్ పెళ్లైన కొన్ని వారాలకే సౌదీ అరేబియా వెళ్లిపోయారు.

ఈ దేశాల కంపెనీల లీవ్ షెడ్యూల్ సెలవులు ముగిస్తే, దానితోపాటూ కార్మికుల వీసా కూడా రద్దైపోయేలా ఉంటుంది. కార్మికులు తమ సెలవులు పెంచుకోకుండా చూడడానికే ఒక వ్యూహం ప్రకారం అలాంటి నిబంధనలు ఉంటాయి.

తన వీసా గురించి అస్లమ్ అప్రమత్తంగా ఉండేవారు. సెలవులు ఇంకా ఉన్నప్పటికీ ఆయన కొన్ని రోజుల ముందే తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుచుకున్నారు. దిల్లీలోని ఆయన బంధువు అమీరుల్ హక్ వీడ్కోలు పలకడానికి విమానాశ్రయం వచ్చారు. అన్ని చెకింగ్‌లూ పూర్తైన తర్వాత, విమానం ఎక్కడానికి వెళ్తూ లోపల్నుంచే ఇక నువ్వు వెళ్లచ్చు అని అస్లమ్ ఆయనకు చెప్పారు.

అమీరుల్ హక్ తిరిగొచ్చి దాదాపు గంటన్నర అయ్యింది. ఆయన పక్కింటి వాళ్లు టీవీలో సౌదీ అరేబియా విమానం ప్రమాదానికి గురైందని వార్తలు వస్తున్నాయని చెప్పారు.

ఆయన వెంటనే తమ గ్రామంలోని ఒకే ఒక ఫోన్‌కు కాల్ చేసి ఆ విషయం చెప్పారు. అస్లమ్ కుటుంబం ఆ విషయం అసలు నమ్మలేకపోయింది.

ఆ తర్వాత రోజు వారు పత్రికల్లో ఇచ్చిన హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేశారు. మృతుల జాబితాలో అస్లమ్ ఇజాజ్ పేరుందా అని అడిగారు. "అస్లమ్ ఇజాజ్‌ అని లేదు, అస్లమ్ జాద్ అని ఉంది" అని చెప్పారు. దాంతో, వారికి అతడు ఇక లేడనే విషయం అర్థమైంది.

దిల్లీలోని అస్లమ్ బంధువు అమీరుల్ హక్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలనుకున్నారు. ఆయన కూడా హరియాణా చరఖీ దాద్రీ వెళ్లడానికి బదులు ఉత్తర ప్రదేశ్ దాద్రీ గ్రామానికి చేరుకున్నారు. తర్వాత మళ్లీ చరఖీ దాద్రీ చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యింది.

అప్పటికే అధికారులు గుర్తించగలిగే శవాలను స్థానికుల సాయంతో సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రుల్లో శవాల గుట్టలో చొక్కాను బట్టి ఆయన అస్లమ్‌ను గుర్తించారు. మృతదేహం చెవుల్లో నుంచి రక్తం వస్తోంది. ఒక కాలు విరిగిపోయి ఉంది. మిగతా శరీరం అంతా బాగానే ఉంది.

అస్లమ్ ఆ రోజు మూడోసారి సౌదీ అరేబియా వెళ్తున్నారు. ఆయన మొదటిసారి వచ్చినపుడు, ఈసారీ పెళ్లి చేసుకునే వెళ్లాలని అనుకున్నాడు. కానీ, అది జరగలేదు. అయితే, రెండో సారి వచ్చినపుడు మాత్రం పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన 21 రోజులకే విమాన ప్రమాదంలో చనిపోయాడు.

విమాన ప్రమాదం

ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్, బిహార్ లాంటి ప్రాంతాలకు చెందిన అత్యంత పేద కుటుంబాల వారే. వీరిలో చాలా మంది ఎన్నో ఆశలతో మెరుగైన జీవితం కోసం మొదటిసారి సౌదీ వెళ్తున్నారు. కానీ శవాలుగా ఇంటికి చేరారు.

మృతుల్లో రాజస్థాన్, దిల్లీ, కేరళ, జమ్ము కశ్మీర్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, అస్సాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారున్నారు. ఈ దుర్ఘటనలో అనిల్ మహేశ్వరి ఇద్దరు కూతుళ్లు కూడా చనిపోయారు.

ఈ విమానం ఎక్కకుండా ప్రాణాలతో మిగిలిన ఒక అదృష్టవంతుడు కూడా ఉన్నాడు. ఏదో కారణాలతో తనను విమానం ఎక్కనివ్వకపోవడంతో ఆయన అధికారులతో గొడవ కూడా పడ్డాడు. ఆ ప్రమాదం జరిగిన దాదాపు వారం తర్వాత అతడు మళ్లీ సౌదీ అరేబియాకు వెళ్లాడు.

మరో కుటుంబం ఐదు రోజుల ముందే సౌదీ అరేబియా వెళ్లాల్సింది. కానీ కొడుకు అనారోగ్యానికి గురి కావడంతో ఆలస్యంగా ఆ రోజే వెళ్లాల్సి వచ్చింది.

ఈ ప్రమాదంలో చనిపోయిన ఒక బ్రిటిష్ నర్సు సౌదీ అరేబియాకు షిఫ్ట్ అవుతున్నారు. కొత్త ఆస్పత్రిలో పని ప్రారంభించడానికి ముందు ఆమె భారత్‌లో సెలవులు గడిపి తిరిగి వెళ్తున్నారు.

విమానంలోని ప్రయాణికుల్లాగే, వాటిని నడిపిన పైలెట్లకు కూడా కథలు ఉన్నాయి. కెప్టెన్ ఖాలిద్ అల్-షబీలీ అన్న షార్జాలో ఉంటారు. ఈ ప్రమాదం గురించి ధ్రువీకరించుకోగానే ఆయన వెంటనే న్యూ దిల్లీ బయల్దేరారు. తర్వాత నేరుగా ఘటనాస్థలానికి వెళ్లారు.

సౌదీ ఎయిర్ లైన్స్ మాజీ పైలెట్ అనస్ అల్-కవాజ్ తన 'మవాకిఫ్ తయ్యార్' పుస్తకంలో ఆ విమాన ప్రమాదం జరిగిన మూడో రోజు ఆయన తన సోదరుడి శవం గుర్తించగలిగారని చెప్పారు.

కెప్టెన్ ఖాలిద్ అల్-షబీలీ అన్న విమానం శకలాలు, కాలిపోయిన అవశేషాలను చూస్తున్నారు. అప్పుడే అక్కడ వాటిని తీస్తున్న ఒక సహాయ సిబ్బంది "ఇక్కడ విమానం శకలాల కింద కొన్ని శవాలు ఉన్నాయి" అని గట్టిగా అరిచారు.

"నేను మా తమ్ముడిని చూశాను. తన చాతీ మీద ఎయిర్ లైన్స్ బాడ్జ్, భుజానికి ఉన్న ఎపాలెట్స్, చొక్కా జేబులో ఉన్న కొన్ని ప్రభుత్వ కాగితాలు చూసి తనను గుర్తు పట్టాను" అని ఆయన చెప్పినట్లు అనస్ రాశారు.

"అల్-షబిలీ మృతదేహం ఎంత ఘోరంగా ఉందంటే, గుర్తు పట్టడానికే వీల్లేకుండా ఉంది. కానీ, నేను మృతదేహం శుభ్రం చేసినప్పుడు వింతగా అనిపించింది. తన చర్మం సహజంగా ఉండాల్సిన దానికంటే చాలా తెల్లగా అనిపించింది. ప్రమాదం జరిగి మూడు రోజులవుతున్నా మృతదేహం నుంచి రక్తం వస్తూనే ఉంది" అని ఆయన చెప్పారు.

ఈ ప్రమాదం తర్వాత పొలాల్లో పడిన నలుగురికి తర్వాత కూడా ప్రాణం ఉన్నట్టు కనిపించిందని, కానీ ఆస్పత్రికి చేర్చే లోపే వారు చనిపోయారని కొన్ని వార్తా పత్రికలు రాశాయి.

"అక్కడ కింద పడినప్పుడు అస్లమ్ కూడా ప్రాణాలతో ఉన్నాడని స్థానికులు నాకు చెప్పారు. కానీ అది నిజమో కాదో మాకు తెలీదు" అని అమీరుల్ హక్ కూడా అన్నారు.

విమాన ప్రమాదం

ప్రమాదానికి కారణం ఎవరు

ప్రమాదం గురించి ఎన్నో అంచనాలు వేశారు. విమానం హఠాత్తుగా పాడవడంతో ప్రమాదం జరిగిందని కొందరు, ఏటీసీ పరికరాలు అవుట్ డేటెడ్ కావడం వల్లే అని మరికొందరు అన్నారు. మరికొంతమంది తప్పంతా పైలెట్లదే అని చెప్పారు.

ఇక విమానాల బ్లాక్ బాక్స్ దర్యాప్తు విషయానికి వస్తే, భారత్‌లో దాన్ని తెరవడానికి సౌదీ, కజకిస్తాన్ మిగతా వారు ఒప్పుకోలేదు.

దీంతో, భారత్ నేషనల్ ఏరోనాటికల్ లాబరేటరీలో రికార్డులు తీయవచ్చని లాహోటీ కమిటీ సూచించింది. కానీ, రెండు ఎయిర్ లైన్స్ సంస్థలు ఆ ల్యాబ్ సామర్థ్యం పై సందేహాలు వ్యక్తం చేశాయి. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారత్ బయటే జరగాలని పట్టుబట్టాయి.

కజకిస్తాన్ ఎయిర్ లైన్స్ చివరికి తమ బ్లాక్ బాక్స్ పరీక్షను మాస్కోలోని ఒక ల్యాబ్‌లో చేయిస్తే, సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ బ్రిటన్‌లోని ఒకల్యాబ్‌లో తమ బ్లాక్ బాక్స్ డేటా తీయాలని నిర్ణయించింది.

రెండు దేశాల ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి రెండు ప్రాంతాలకు వెళ్లడానికి లాహోటీ కమిటీకి అనుమతి లభించింది.

ఘటనాస్థలాన్ని సందర్శించి, ఏటీసీ స్టాఫ్‌తో చర్చించిన తర్వాత ఫ్లైట్ రికార్డ్ డేటా, వాయిస్ రికార్డ్ అంటే బ్లాక్ బాక్స్ పరీక్షలన్నీ ముగిసిన తర్వాత విమాన ప్రమాదంపై లాహోటీ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది.

కజకిస్తాన్ విమానం అనుమతి లేకుండా 14 వేల అడుగుల ఎత్తు కంటే దిగువకు రావడమే విమానాలు ఢీకొనడానికి కారణం అని, ఏటీసీ సూచించిన ప్రకారం అది 15 వేల అడుగుల ఎత్తులో ఎగరలేదని చెప్పింది.

లాహోటీ కమిటీ ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం 15 సిఫారసులు చేసింది.

కజకిస్తాన్ విమానం ప్రమాదానికి గురి కావడం వెనుక ఆ దేశ పైలెట్‌కు ఇంగ్లిష్ మీద పట్టు లేకపోవడం కూడా ఒక కారణం అని కమిటీ చెప్పింది. దాంతో అతడు ఏటీసీ సూచనలను తప్పుగా అర్థం చేసుకున్నాడు.

ఈ రెండు విమానాలకూ ఏటీసీ వైపు నుంచి స్పష్టమైన తగిన ఆదేశాలు ఇచ్చారు. అవి ఒక నిర్ధారిత ప్రక్రియ ప్రకారమే ఉంటాయి. దిల్లీ విమానాశ్రయంలో వన్-వే కారిడార్ ఈ ప్రమాదానికి ఏ మాత్రం కారణం కాదు అని తెలిపింది.

దుర్ఘటనకు దాదాపు 30 సెకన్ల ముందు రెండు విమానాలూ మబ్బుల్లోకి ఉన్నాయి. దాంతో కాస్త ఊగిపోయాయి. కానీ దానివల్ల ఎలాంటి అత్యవసర స్థితి రాలేదు అని కూడా కమిటీ చెప్పింది.

ఈ ప్రమాదానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా విధ్వంసం, లేదా పేలుడు లేదంటే రెండు విమానాల్లో ఒకదానిలో మెకానికల్ వైఫల్యం లాంటివి కూడా కారణం కాదని కమిటీ చెప్పింది.

అయితే, దిల్లీ విమానాశ్రయం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని. అక్కడ విమానం దూరంతోపాటూ దాని ఎత్తు కూడా చెప్పగలిగేలా ఎలాంటి సెకండరీ రాడార్ అందుబాటులో లేదని కమిటీ చెప్పింది.

అప్పట్లో దిల్లీ విమానాశ్రయంలో ఉన్న రాడార్ సిస్టమ్‌ను చాలా పురాతనమైనదిగా చెబుతారు. అది దూరం మాత్రమే చెప్పగలదని, ఎత్తు చెప్పలేదని అంటున్నారు.

"విమానాశ్రయాల్లో కొత్త పరికరాలు అమర్చకపోతే ఇలాంటి ఘటనలు జరగవచ్చని ఈ ప్రమాదానికి కొన్ని నెలల ముందే నేను భారత ప్రభుత్వానికి లేఖ రాశాను" అని పైలెట్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు వీకే భల్లా చెప్పారు.

అప్పట్లో విమానాలకు దాని చుట్టుపక్కల ఉన్న విమానాల గురించి చెప్పగలిగేలా మొత్తం దేశంలో ఎలాంటి రాడార్ లేదు అన్నారు.

"నేను మూడు ఘటనలను ఉదాహరణగా చెప్పాను. పైలెట్లు తెలివిగా వ్యవహరించడంతో ఆ ప్రమాదాలు తప్పాయని సూచించాను. మీరు ఈ చర్యలు తీసుకోకపోతే గాలిలో విమానాలు ఢీకొనడం ఖాయం" అని ఆ లేఖలో రాశాను" అని చెప్పారు.

"నేను సమస్యను మాత్రమ ప్రస్తావించలేదు. దానికి పరిష్కారం కూడా సూచించాను. కానీ, ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాటిని అమలు చేశారు" అన్నారు.

ఈ ప్రమాదం తర్వాత చివరికి దిల్లీ రాడార్ సిస్టమ్‌ను అప్ డేట్ చేశారు. భారత్‌లోకి వచ్చే, దేశం నుంచి వెళ్లే అన్ని విమానాల్లో ఆకాశంలో ఢీకొనకుండా తప్పించే సిస్టమ్‌ ఉండడం పౌర విమానయాన డైరెక్టరేట్ తప్పనిసరి చేసింది. ఈ దుర్ఘటన ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో తర్వాత పైలెట్లకు ఇంగ్లిష్ ప్రావీణ్యం అనేది తప్పనిసరి చేశారు.

విమాన ప్రమాదం

25 ఏళ్ల తర్వాత స్మారకం

ఈ ప్రమాదంలో ఎక్కువ మంది బలహీన వర్గాల వారే. బాధిత కుటుంబాల వివరాల ప్రకారం భారత్‌ ప్రభుత్వం తరఫున వారికి ఎలాంటి పరిహారం అందలేదు.

లాహోటీ కమిటీ తన రిపోర్టును అందించిందా? ఈ ప్రమాదానికి కజకిస్తాన్ పైలెట్లే కారణం అని చెప్పిందా అని 1998 జులైలో ఒక ఎంపీ ప్రభుత్వాన్ని అడిగారు.

"అది నిజమైనప్పుడు దర్యాప్తుకు సంబంధించిన అన్ని ఖర్చులను, పరిహారాన్ని భారత ప్రభుత్వం కజకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎందుకు వసూలు చేయకూడదు" అని ప్రశ్నించారు.

లాహోటీ కమిటీ తన రిపోర్ట్ సమర్పించిందని, దానిని పరిశీలిస్తున్నామని అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి చెప్పారు. అయితే సౌదీ అరేబియా మాత్రం ఒక్కో మృతుడికీ 12 వేల పౌండ్లు(అప్పటి ధర ప్రకారం రూ.8.30 లక్షలు) పరిహారంగా చెల్లించింది.

ఈ ప్రమాదం జరిగిన ఎన్నో ఏళ్ల తర్వాత కూడా రెండు విమానాలు ఢీకొనడం అంటే అసలు నమ్మలేనట్లు అనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 349 మంది సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రం అది ఒక చేదు నిజం.

ఈ ప్రమాదంతో పరిస్థితులు కొందరి తలరాతనే మార్చేసింది.

భర్తను కల్పోయిన కొందరు అతడి తమ్ముడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరికొందరు కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే ఉపాధి వెతుక్కోవాల్సి వచ్చింది. చాలా మంది చివరకు తమ చదువు వదిలిపెట్టాల్సి వచ్చింది.

ఈలోపు హరియాణాలో స్థానిక ప్రభుత్వం చరఖీ దాద్రీలో ప్రమాద మృతుల కోసం ఒక స్మారకం నిర్మిస్తామని కూడా ప్రకటించింది.

వార్తా పత్రికల కథనాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ కింద అక్కడ ఒక స్మారకం, పర్యాటక కేంద్రం నిర్మించబోతున్నారు. దానికి అవసరమైన 15 నుంచి 20 ఎకరాల భూమిని ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How did two planes collide in Haryana airspace? how did this happen 25years back
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X