Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైలు ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా ఇన్సూరెన్స్ పొందడం ఎలా? మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు

ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.

ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది.

తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, రైలు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

''ఇప్పుడు టికెట్ బుకింగ్ సమయంలోనే ఇన్సూరెన్స్ సదుపాయం లభిస్తుంది. అది కూడా చాలా తక్కువ ప్రీమియంతో బుక్ చేసుకోవచ్చు. ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో దీనికి డిమాండ్ పెరుగుతుంది. ఇక నుంచి ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలోనే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశాలు పెరుగుతాయి’’ అని దక్షిణ మధ్య రైల్వే మాజీ జనరల్ మేనేజర్ ఒకరు బీబీసీతో చెప్పారు.

రైలు ప్రయాణాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది?ప్రీమియం ఎంత చెల్లించాలి? ఏ సందర్భాల్లో ఇన్సూరెన్స్ వస్తుంది? ఎంత వస్తుంది?

పది పాయింట్లలో ఈ వివరాలు తెలుసుకుందాం.

రైల్వే ఇన్సూరెన్స్

1. ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి?

టికెట్ బుకింగ్ సమయంలోనే ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసుకునేప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది.

కన్ఫర్మ్ లేదా ఆర్ఏసీ టికెట్లకే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ఈ ఇన్సూరెన్స్ పథకం కేవలం భారతీయ పౌరులకే వర్తిస్తుంది. విదేశీయులకు వర్తించదు.

బెర్త్ లేదా సీటు బుకింగ్ అవసరం లేకుండా ప్రయాణించే ఐదేళ్ల లోపు పిల్లలకు వర్తించదు.

2. ప్రీమియం అధికంగా ఉంటుందా?

టికెట్ ధరతోపాటు అదనంగా కేవలం 35 పైసలు చెల్లించాలి.

2021 నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ ప్రీమియం అమలులో ఉంది.

ఒక పీఎన్ఆర్ సంఖ్య కింద ఎంతమంది ప్రయాణికులుంటే అంతమందికీ ప్రీమియం చెల్లించాలి.

రైలు ప్రమాద బీమా

3. ఏ సందర్భాల్లో ఇన్సూరెన్స్ వస్తుంది?

రైలు ప్రమాదాలకు గురైనప్పుడు ఇన్సూరెన్స్ సదుపాయం పొందే వీలుంటుంది.

సాధారణంగా ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవాలి.

ప్రయాణికులు రైలు ప్రమాదంలో చనిపోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైతే గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు పరిహారం ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది.

దీన్ని బాధితులు లేదా నామినీకి అందజేస్తుంది.

ఆస్పత్రిలో చేరితే రూ. 2 లక్షల వరకు వైద్య ఖర్చులను భరిస్తుంది.

పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ. 7.5 లక్షల పరిహారం అందుతుంది.

తీవ్ర గాయాల పాలైతే రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ. 10 వేల వరకు చెల్లిస్తారు.

కొన్ని అనుకోని పరిస్థితుల్లో జరిగే ప్రమాదాలకు క్లెయిమ్‌తో సంబంధం లేకుండా బీమా సొమ్ము వస్తుంది.

ఉదాహరణకు ఒడిశా రైలు ప్రమాద ఘటనలో క్లెయిమ్‌తో సంబంధం లేకుండా బాధితులు లేదా నామినీలకు పరిహారం అందుతుంది.

ఒకవేళ నామినీ వివరాలు రాయకపోతే, న్యాయపరంగా ఎవరు అర్హులవుతారో వారికి చెల్లిస్తారు.

4. ఇన్సూరెన్స్ పొందడానికి ఏం కావాలి?

చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని సొంతూరికు తరలించడం లేదా అంత్యక్రియలకు ఖర్చుల కింద రూ. 10 వేలు అందిస్తారు.

ఆ సమయంలో ఎలాంటి పత్రాలూ చూపించాల్సిన అవసరం ఉండదు.

ప్రయాణికులు ప్రమాదం జరిగిన తేదీల్లో కొనుగోలు చేసిన రైలు టికెట్ లేదా ప్లాట్ ఫారం టికెట్ ఉంటే చాలు.

5. ఈ పాలసీ తీసుకోవడమెలా?

టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణికులకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సమాచారం అందుతుంది.

వాళ్లు ఇచ్చే లింకును క్లిక్ చేసి నామినీ వివరాలు ఎంట్రీ చేయవచ్చు.

పాలసీ నెంబరు టికెట్ బుకింగ్ హిస్టరీలో కనిపిస్తుంది.

రైల్వే ఇన్సూరెన్స్

6. కేవలం రైలు ప్రమాదానికి గురైతేనే బీమా సొమ్ము చెల్లిస్తారా?

రైల్వే చట్టం 1989, సెక్షన్ 124లో ప్రమాదాలకు గురైనప్పుడు పరిహారం చెల్లించే అంశంపై సమాచారం ఉంది.

రైలు ప్రయాణంలో ఏదైనా అనుకోని ప్రమాదానికి గురై చనిపోతే పరిహారం చెల్లిస్తారు.

1994 ఆగస్టు 1వ తేదీన చట్టానికి కేంద్ర ప్రభుత్వం మరో సవరణ చేసింది.

దీని ప్రకారం, కేవలం ప్రమాదాలకు గురైనప్పుడే కాకుండా, మరికొన్ని సందర్భాల్లోనూ పరిహారం చెల్లించేందుకు వీలు కల్పించింది.

తీవ్రవాదుల దాడి, హింసాత్మక ఘటనలు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, కాల్పుల వంటివి జరిగి ప్రయాణికులు చనిపోతే పరిహారం చెల్లిస్తారు.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రమాదం లేక దాడి జరిగితేనే పరిహారం చెల్లించేందుకు వీలుంటుంది.

బుకింగ్ ఆఫీసు, వెయిటింగ్ హాలు, సామాన్లు పెట్టే గది, ప్లాట్ ఫారం వంటి ప్రదేశాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటే అందులో చనిపోయిన లేదా గాయపడిన ప్రయాణికులకు పరిహారం అందిస్తారు.

అలాగే 'వికల్ప్' పథకం కింద బుక్ చేసుకుని ఒక రైలుకు బదులుగా మరో రైలులో ప్రయాణించే ప్రయాణికులకూ వర్తిస్తుంది.

7. ఏ సందర్భాల్లో రైల్వే ఇన్సూరెన్స్ వర్తించదు?

సెక్షన్ 124-ఏ ప్రకారం కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు చనిపోయినా, పరిహారం చెల్లించేందుకు వీలుండదు.

ప్రమాదం కాకుండా, ఆత్మహత్య చేసుకోవడం, స్వయంగా గాయపరుచుకోవడం, నేరపూరిత చర్యలకు పాల్పడటం, వ్యాధులతో చనిపోవడం జరిగితే పరిహారం ఇవ్వరు.

రైల్వే ట్రాక్ దాటుతూ చనిపోతే పరిహారం చెల్లించరు.

ఒకే ప్రమాదంలో వేర్వేరు ప్రయోజనాలకు బీమా సొమ్ము ఇవ్వరు.

టికెట్ కన్ఫర్మ్ కాకుండా రైలు ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురైనా బీమా సొమ్ము ఇవ్వరు.

8. ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?

రైల్వే చట్టం సెక్షన్ 125 ప్రకారం నాలుగు నెలల్లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవాలి.

ప్రయాణికులు లేదా నామినీ లేక న్యాయపరమైన సంబధికులు దరఖాస్తు చేసుకోవచ్చు.

లిబర్టీ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం ఉన్నట్లుగా ఐఆర్‌సీటీసీ చెబుతోంది.

ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయలో వచ్చిన ఎస్ఎంఎస్ ఆధారంగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లింపు జరిగిందో తెలుసుకోవచ్చు.

రైల్వే ఇన్సూరెన్స్

9. ఏ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి?

దరఖాస్తు సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలి.

ప్రమాదం జరిగినట్లుగా రైల్వే శాఖ అధికారులు ఇచ్చే నివేదిక, ప్రయాణికుడు చనిపోవడం లేదా గాయపడినట్లుగా చెప్పే నివేదిక సమర్పించాలి.

వీటితోపాటు, అదనపు ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలి.

గాయాల పాలైన ప్రయాణికులు లేదా వారి తరపున బంధువులు లేక ఆధరైజడ్ ఏజెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రమాదంలో వ్యక్తి చనిపోతే, అతనిపై ఆధారపడిన వ్యక్తి లేదా గార్డియన్ (మైనర్ అయితే ) దరఖాస్తు చేసుకోవాలి.

10. ఎప్పటిలోగా బీమా సొమ్ము అందుుతుంది?

అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత 15 రోజుల్లోగా బీమా సొమ్మును ఇన్సూరెన్స్ కంపెనీ అందించాలి.

అయితే, రైలు ప్రమాదాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం రూపంలో భారీ మొత్తం వెళుతోంది. కానీ, క్లెయిమ్స్ మాత్రం ఏటా తక్కువగా కనిపిస్తున్నాయి.

ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ ఆర్‌టీఐ ద్వారా ఈ కింది సమాచారం సేకరించారు.

2018, 2019 సంవత్సరాలకు ఐఆర్‌సీటీసీ, ప్రయాణికుల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.46.18 కోట్లు వెళ్లింది. క్లెయిమ్‌ల రూపంలో చెల్లించినది రూ.7 కోట్లు మాత్రమే.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+