డీకే శివకుమార్ ను హైకమాండ్ ఎలా డీల్ చేస్తోంది ?, అసలే రఫ్ అండ్ టఫ్ లీడర్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ తీరుతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లోని కొందరు నాయకులు హడలిపోతున్నారు. తనకు ఏ ఎమ్మెల్యేల మద్దతు లేదు, ఆ ఎమ్మెల్యేల మద్దతు అసలే వద్దు, ఎమ్మెల్యేలను ఎవరు వెంటపెట్టుకుని వెళ్లినా తాను పట్టించుకోను, కేపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికలకు వెళ్లిన తాను 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను. అదే చాలు అని డీకే శివకుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
సిమ్లా నుంచి సోనియా గాంధీ ఢిల్లీ చేరుకున్న తరువాత ఆమె దగ్గరకు వెళ్లి తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిన డీకే శివకుమార్ చివరికి ఢిల్లీ వెళ్లారు. కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో డీకే శివకుమార్ ముందు వరుసలో ఉన్నారు. కర్ణాటక సీఎం పదవి సిద్దరామయ్యకు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో సోమవారం ఢిల్లీ వెళ్లకుండా బెంగళూరులోనే మకాం వేసిన డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు షాక్ ఇచ్చారు.

మామూలుగానే కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఎక్కువ అనే విషయం తెలిసిందే. వర్గ పోరులో కాంగ్రెస్ కి పెట్టింది పేరు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిద్దరామయ్యకు, డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి హామీలు ఇచ్చాయో అనే విషయం మాత్రం ఎవ్వరికి తెలీదు. అయితే ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చిన తరువాత సిద్దరామయ్య, డీకే శివకుమార్ సీఎం సీటు కోసం పోట్లాడుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు ఇద్దరికి సరిసమానం అయిన పదవులు ఇవ్వాలి, అందుకు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ అంగీకరించాలి. లేదంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వర్గపోరు మొదలౌతుందని, తరువాత మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భయపడుతోంది.

కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులకు డీకే. శివకుమార్, సిద్దరామయ్య అంగీకరించపోతే మూడో వ్యక్తిని సీఎం చేసి ఇద్దరికి సీఎం సీటు దూరం చేద్దామని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు అనుకుంటున్నారని తెలిసింది. అయితే రఫ్ అండ్ టఫ్ నాయకుడు డీకే. శివకుమార్ తో రానున్న రోజుల్లో మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు కొందరు భయపడుతున్నారని తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉన్న సమయంలో అన్నింటికి తెగించిన డీకే శివకుమార్ వారి సమస్యలను చాలా ధైర్యంగా పరిష్కరించారు. కర్ణాటకలో డీకే శివకుమార్ మీద అప్పటి నుంచి ఢిల్లీలోకి బీజేపీకి చెందిన కొందరు పెద్దలు కన్ను వేశారని, అందుకే సీబీఐ, ఈడీ అధికారులు రంగంలోకి దిగారని ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి అని రాజకీయ నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications