ప్రధాని మోడీ రోడ్ షో.. ముస్లింల మద్దతు కూడగట్టేనా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటున్నది. బుధవారం పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఒక్కటైన వారణాసి..
వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటున్నది. బుధవారం పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఒక్కటైన వారణాసి.. ప్రధాని నరేంద్రమోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో వరుసగా రెండో రోజు ఆదివారం నిర్వహించిన రోడ్ షోకు భారీగా ముస్లింలు తరలి వచ్చారు.
కానీ వారంతా బీజేపీకి ఓటేస్తారా? తమ విధేయతను మార్చుకుంటారా? అంటే అటువంటి అవకాశమే లేదని వారే అంటున్నారు. 'ఆయన మా ప్రధానమంత్రి బనారస్ తరాఖ్ఖీ కరేగా టూ హమ్ భీ కరెంగైన్. బట్ బీజేపీ వాలే హమైన్ పసంద్ నహీ కర్తే (ఆయన మా ప్రధానమంత్రి. ఒకవేళ వారణాసిలో ప్రగతి పనులు సాగుతున్నాయంటే ఆయన వల్లే. అప్పుడెలా ఉంటుందో చూడాలి. కానీ బీజేపీ తమను ఇష్టపడదు)' అని రఫీఖ్ అహ్మద్ అనే ఓ వ్యాపారి పేర్కొన్నాడు.
రాష్ట్ర జనాభాలో ముస్లింలు 20%. వారంతా దాదాపు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) - కాంగ్రెస్ పార్టీ కూటమికి మద్దతునిస్తారని భావిస్తున్నారు. ప్రదాని మోదీ రోడ్ షో నేపథ్యంలో ముస్లింల్లో చీలిక వస్తుందా? లేదా? అన్నదీ అనుమానమే. వారణాసి నగర పరిధిలోని మూడు అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో బీజేపీ మూడు సీట్లు గెలుచుకున్నదంటే ముస్లిం ఓట్లలో చీలిక వల్లేనని చెప్తున్నారు.

నోట్ల రద్దుతో వీవింగ్ కమ్యూనిటీపై ప్రభావం..
మోదీకి ఓట్లేస్తారా? అని ముస్లిం యువతను అడిగితే వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. ‘బీజేపీ ఎంతమంది ముస్లిం నేతలకు టిక్కెట్లు ఇచ్చింది. జీరో. రాష్ట్ర జనాభాలో మేం 20%. కానీ 403 స్థానాలకు పోటీ చేసేందుకు ముస్లింల్లో ఒక్క నేత కూడా వారికి దొరకలేదా? వారికి ఎందుకు ఓటేయాలి?' అని యువకులు ప్రశ్నిస్తున్నారు. కొందరు ముస్లింలు కేంద్రం అమలుచేస్తున్న వివిధ అభివ్రుద్ధి కార్యక్రమాలు ప్రధాని మోదీవల్లేనని కొందరు ముస్లింలు చెప్తున్నారు. కానీ ఆ అభివ్రుద్ది పథకాల అమలుపై ఉన్న సానుకూలత పెద్ద నోట్ల రద్దుతో తుడిచిపెట్టుకు పోయింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రత్యేకించి చేనేత రంగ కార్మికులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. చేనేత కార్మికులుగా ముస్లింలు కూడా పనిచేస్తున్నారు. అబ్దుల్ రవూఫ్ అనే హ్యాండ్లూమ్ డీలర్ స్పందిస్తూ మోదీ అనుసరిస్తున్న తీరు పట్ల అసంత్రుప్తి వ్యక్తంచేస్తున్నా.. ఆయన పనీతిరుపై ఆశలు పెట్టుకున్నట్లు చెప్తున్నాడు.

వీవర్లపై గణనీయ ప్రభావం
నోట్ల రద్దు వల్ల తమ బెనారస్ చీరల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పలువురు చేనేత కార్మికులు, వీవర్లు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతం పట్ల ఆకర్షితులైన వారితో సహా చేనేత కార్మిక రంగం పూర్తిగా చీలిపోయారు. జుబేర్ అహ్మద్ అనే వ్యక్తి సరదాగా మాట్లాడుతూ తమలో కొందరు బీజేపీకి ఓటేశామని అన్నా ఏ ఒక్కరూ విశ్వసించరని, నమ్మరని వ్యాఖ్యానించాడు. 2014లో మోదీకి ఓటేశామని తమ స్నేహితులు చెబితే.. తమ హిందూ మిత్రులు ఫక్కున నవ్వేశారని తెలిపాడు.

బీజేపీ కోసం కేంద్రమంత్రుల తిష్ఠ
ఎల్లవేళలా విడివిడిగా పోటీచేసే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఈ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయని రఫీఖ్ అహ్మద్ తెలిపాడు. కనుక వారణాసిలోని ముస్లింలంతా చాలా కాలం తర్వాత ఒక అభ్యర్థికే.. అదీ ఎస్పీ - కాంగ్రెస్ కూటమి అభ్యర్థికే ఓటేయాలని నిర్ణయించుకున్నారని రఫీఖ్ అహ్మద్ అని అన్నాడు.ముస్లింల ఓట్లు ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకే పడతాయని.. నగర పరిధిలోని మూడు సీట్లలో రెండు సీట్లు కూటమి కచ్చితంగా గెలుస్తాయని పేర్కొన్నాడు. వివిధ వర్గాల, సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ప్రజలను లక్ష్యంగా చేసుకుని పలువురు కేంద్రమంత్రులు చిన్నా చితకా కార్యక్రమాలు చేపట్టినా ఫలితాలు భిన్నంగా ఉంటాయని అంటున్నాడు.

ప్రధాని మోదీపై షాట్ గన్ ఫైర్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రముఖుల ప్రచారంతో ఓట్లు పడుతాయనుకుంటే పొరపాటేనని పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి అన్నారు. హార్వర్డ్ వర్సిటీ కన్నా హార్డ్ వర్క్ చాలా శక్తివంతమైనదని ఇటీవల ప్రధాని మోదీ అన్న మాటలనూ ఆయన పేర్కొంటూ కష్టపడే కార్యకర్తలకు, నేతలకు మధ్య తేడా ఉన్నదని చురకలంటించారు.

మోదీపై ములాయం ఇలా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక మోసగాడని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. మోసాలతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న మోదీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్హానీలో ఎస్పీ అభ్యర్థి పరాస్ నాథ్ యాదవ్‌కు మద్దతుగా జరిగిన ప్రచారసభలో చెప్పారు. తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, అంతా సజావుగానే సాగు తున్నదని అన్నారు. మేం ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ప్రజలపై జరిగే అకృత్యాలకు వ్యతిరేకంగా ఎస్పీ నిలబడుతుంది. వారికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటుంది అని పేర్కొన్న ములాయం.. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications