ఏడాది కాలంగా మరుగుదొడ్డిలో మహిళ నిర్బంధం .. భార్యపై భర్త అమానుషం
దేశంలో రోజు రోజుకూ అమానుష ఘటనలు పెరిగిపోతున్నాయి. మానవత్వాన్ని మరిచి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు చాలా మంది. కొన్ని ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఇంత అమానుషమా అని ఆవేదనకు గురి చేస్తున్నాయి. అలాంటి ఓ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడాదికి పైగా ఒక భార్యను భర్త నిర్బంధించిన అమానవీయ ఘటన సమాజాన్ని షాక్ కు గురి చేస్తుంది .
తిండి పెట్టలేని దుస్థితిలో కసాయిగా మారిన కన్నతల్లి .. పేదరికంతో బిడ్డను కడతేర్చిన దారుణం

మరుగుదొడ్డిలో ఏడాదిగా భర్త నిర్బంధించిన భార్యను రక్షించిన అధికారి
హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పానిపట్ , రిష్ పూర్ గ్రామంలో ఒక భర్త ఏడాది కాలంగా భార్యను ఒక మరుగుదొడ్డిలో నిర్బంధించిన అమానుష ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ ఏడాది కాలంగా ఒక టాయిలెట్ లో నిర్బంధించబడింది అన్న సమాచారం మేరకు అక్కడి వెళ్ళిన స్త్రీ సంక్షేమ , బాల్య వివాహ నిషేధ అధికారి రజనీ గుప్తా అక్కడ మరుగుదొడ్డిలో నిర్బంధించబడిన మహిళను విముక్తురాలిని చేశారు .

ఆహరం లేక క్రుశించిపోయిన మహిళ.. మానసిక వ్యాధి ఉందని చెప్పిన భర్త
రజనీ గుప్తా మహిళ నిర్బంధం గురించి తనకు అందిన సమాచారం మేరకు మహిళను రక్షించానని చెప్పారు. చాలా రోజులుగా ఆ మహిళ ఆహారం లేకపోవటంతో కృశించిపోయిందని ఆమె పేర్కొన్నారు . అయితే సదరు మహిళ భర్త మానసికంగా ఆమె పరిస్థితి బాగోలేదని , ఆస్పత్రులలో చూపించినా ఫలితం లేదని , అందుకే తనను ఇలా నిర్బంధించామని చెప్పారు ఆమె భర్త నరేష్ . కానీ మహిళను అమానుషంగా ఏడాది కాలంగా నిర్బంధించిన సదరు భర్తపై కేసు నమోదు చేశారు అధికారులు . మానసిక అనారోగ్యం ఉంటే ఆస్పత్రిలో చేర్పించాలి కానీ ఈతరహా దారుణానికి పాల్పడటం క్షమించరాని నేరం అన్నారు .

వైద్యం కోసం ఆస్పత్రికి తరలింపు .. భర్తపై కేసు నమోదు
అయితే మహిళతో మాట్లాడిన అధికారులు ఆమె మానసికంగా బానే ఉన్నారని పేర్కొన్నారు. ఆమె మాటల్లో ఎలాంటి మానసిక రుగ్మత కనిపించలేదని వారంటున్నారు . ఆమె చాలా కాలంగా మరుగుదొడ్డిలో నిర్బంధించి ఉన్నందున ఆమె చాలా అపరిశుభ్రంగా ఉన్నట్టు వారు గుర్తించారు. ఆమెకు స్నానం చేయించి ,తిండి లేక నీరసించిన మహిళను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో మహిళను దారుణంగా ఏడాదిగా నిర్బంధించిన భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసికంగా అనారోగ్యం కారణంగా నిర్బంధించారా ? లేదా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా ? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు .