పార్టీ కావాలంటే పోటీ చేస్తా: కేజ్రీవాల్, కోర్టుకు డుమ్మా
న్యూఢిల్లీ: పార్టీ ఆదేశిస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను భావించడం లేదని, అయితే, పార్టీ ఆదేశిస్తే, అవసరం అనుకుంటే పోటీ చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పోటీ ఎఎపి, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉంటుందన్నారు.
ఢిల్లీలో ఓడినట్లుగానే కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికలలో ఓడిపోతుందన్నారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడైనా తమకు మద్దతు ఉపసంహరించుకోవచ్చునని, తాము వారి సహకారం ఏమీ కోరడం లేదన్నారు. వారు మద్దతు ఉపసంహరించుకున్నా తాము ఆందోళన చెందమన్నారు.

కోర్టుకు కేజ్రీవాల్ డుమ్మా
కేజ్రివాల్ తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం కేసు విచారణకు కోర్టులో హాజరు కాలేదు. శనివారం, చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (సిఎంఎం) సంజయ్ బన్సాల్, ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న కేజ్రివాల్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఒక్క రోజుకు మాత్రమే ఇందుకు అనుమతిస్తున్నట్లు బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.
2012లోవిద్యుత్ ఛార్జీలను వ్యతిరేకించిన కేజ్రీవాల్ ఒక టెలివిజన్ షోలో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆమె మాజీ రాజకీయ కార్యదర్శి పవన్ ఖేరా, కేజ్రివాల్‌కు వ్యతిరేకంగా పరువునష్టం కేసు వేశారు. ఖేరా ఫిర్యాదు మేరకు కోర్టు గతంలో కేజ్రివాల్‌కు వ్యతిరేకంగా కేసును నమోదు చేసింది.
ఖేరా, దీక్షిత్‌ల నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారి గౌరవ ప్రతిష్ఠలకు భంగకరమని కోర్టు పేర్కొంటూ మిమ్మిల్ని సెక్షన్ 500 (పరువు నష్టం) కేసు కింద ఎందుకు శిక్షించకూడదో తెలపాలంటూ కేజ్రివాల్‌కు షోకాజ్ నోటీసులను జారీచేసింది. కాగా కేజ్రీవాల్ తాను తప్పుగా మాట్లాడలేదని, అది తప్పుడు ఫిర్యాదని కేజ్రివాల్ కోర్టుకు తెలిపారు.
అంతేకాక, ఖేరా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు లెక్కలేనన్ని ప్రయోజనాలను దీక్షిత్ ప్రభుత్వం కల్పించిందనేందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 5కు కోర్టు వాయిదా వేసింది. అదే రోజున సాక్ష్యాలను నమోదు చేయాలని కోర్టు నిర్ణయించింది.












Click it and Unblock the Notifications