దిల్లీపై దండెత్తుతా! బీజేపీని తరిమికొడతా: మాస్ వార్నింగ్
"నన్ను ఓడించే సత్తా మీకు లేదు.. బెంగాల్ గడ్డపై మరోసారి జెండా ఎగురవేస్తా. ఇక్కడితో ఆగను, నేరుగా ఢిల్లీ కోటపై దండెత్తుతా!" - ఇవి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యర్థులకు పంపిన బహిరంగ హెచ్చరికలు. ఏప్రిల్ 24, గురువారం చౌరింగీలో జరిగిన భారీ బహిరంగ సభలో దీదీ ప్రసంగం ఆద్యంతం నిప్పులు చెరిగినట్లు సాగింది.
బీజేపీ కోసం లోపాయికారీగా పనిచేస్తున్న అధికారులపై, ఆ పార్టీ కార్యకర్తలపై మమత ఘాటు వ్యాఖ్యలు చేశారు. "బీజేపీకి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న 'A టూ Z' వరకు అందరి పేర్లు, చిరునామాలు నా డైరీలో నోట్ చేసుకున్నాను. మీ బ్యాక్‌గ్రౌండ్ చూసి అధికారులుగా నియమించుకున్నంత మాత్రాన మమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు మమ్మల్ని గమనిస్తున్నారని అనుకుంటున్నారా? మీ ప్రతి కదలికను నేను కనిపెడుతూనే ఉన్నాను" అంటూ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.

పవర్ వద్దు.. బీజేపీ పతనం కావాలి!
తనకు వ్యక్తిగతంగా అధికారంపై ఆశ లేదని, కానీ బీజేపీని గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని మమత ప్రకటించారు. "బెంగాల్‌లో విజయం సాధించిన వెంటనే అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తాను. ఢిల్లీని వశం చేసుకుంటాను. నాకు కుర్చీ అవసరం లేదు, కానీ దేశం నుంచి బీజేపీ పతనం కావాలి. బెంగాల్‌లో వారిని నాశనం చేసి, ఢిల్లీలో కూడా అధికారం నుంచి తరిమికొడతాను" అని ఆమె గర్జించారు.
చౌరింగీ కోటలో దీదీ మార్క్ ప్రచారం!
టీఎంసీ కంచుకోటగా ఉన్న చౌరింగీలో సిట్టింగ్ ఎమ్మెల్యే నైనా బందోపాధ్యాయ తరపున మమత ప్రచారం నిర్వహించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు అడ్డాగా ఉన్న ఈ నియోజకవర్గం, ఇప్పుడు టీఎంసీకి తిరుగులేని ప్రాంతంగా మారింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సంతోష్ పాఠక్‌ను ఓడించి, టీఎంసీ జైత్రయాత్రను కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. చౌరింగీలో ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది.
రికార్డు స్థాయిలో 91% పోలింగ్!
మొదటి దశ పోలింగ్‌లో బెంగాల్ ఓటర్లు క్యూ కట్టారు. ఏకంగా 91.83 శాతం పోలింగ్ నమోదు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతటి భారీ పోలింగ్ ఎవరికి అనుకూలమనే సస్పెన్స్ నెలకొన్న వేళ, మమత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సెగలు రేపుతున్నాయి. బెంగాల్ భవితవ్యం, దేశ రాజకీయాల మలుపు మే 4న వెలువడే ఫలితాలపైనే ఆధారపడి ఉన్నాయి.














Click it and Unblock the Notifications