పాకిస్తాన్‌ను తరిమికొట్టిన అభినందన్ వర్థమాన్‌కు వీరచక్ర పురస్కారం: రాష్ట్రపతి చేతుల మీదుగా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రోత్సాహిత జైషె మహ్మద్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో సృష్టించిన మారణ హోమానికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన మెరుపు దాడి.. బాలాకోట్ వైమానిక దాడులు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వాలోని పర్వత శ్రేణుల్లో వెలిసిన జైషె మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను నేలకూల్చారు వైమానిక దళాధికారులు. సరిహద్దులను దాటుకుని వెళ్లి మరీ పాకిస్తాన్ పీచమణిచారు.
Recommended Video
ఈ వైమానిక దాడులకు నాయకత్వాన్ని వహించిన అప్పటి వైమానిక దళ వింగ్ కమాండర్, గ్రూప్ కేప్టెన్‌గా పదోన్నతి పొందిన అభినందన్ వర్థమాన్.. తాజాగా వార్తల్లోకి ఎక్కారు. రక్షణ రంగంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన వీర చక్రను అందుకున్నారు. దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఆర్మీ ఆధికారులు హాజరయ్యారు. అభినందన్ వర్థమాన్‌తో పాటు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్‌కు మరణానంతరం ప్రకటించిన శౌర్యచక్ర అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. భార్య లెప్టినెంట్ నికిత కౌర్, తల్లి సరోజ్ దౌండియాల్.. శౌర్యచక్ర అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే- నాయబ్ సుబేదార్ సోమ్‌బీర్‌కు మరణానంతరం ప్రకటించిన శౌర్యచక్ర అవార్డును ఆయన భార్య, తల్లికి అందజేశారు.

బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో జాతీయ స్థాయిలో హీరోగా గుర్తింపు పొందారాయన. పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్-16ను నేలకూల్చారు. అనంతరం పొరపాటున పాకిస్తాన్ భూభాగంపైకి దిగారు. ఆయనను యుద్ధ సైనికుడిగా బంధించారు ఆ దేశ సైనికులు. ఆయన పాకిస్తాన్ చేతికి చిక్కడంతో కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. దౌత్యపరంగా ఒత్తిళ్లను తీసుకొచ్చింది. అంతర్జాతీయ వేదికల నుంచి పాకిస్తాన్‌పై అన్ని రకాల ఆంక్షలు, ఒత్తిళ్లకు లోను చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాకిస్తాన్ మెత్తబడింది..మెట్టుదిగింది. అభినందన్ వర్థమాన్‌ను క్షేమంగా భారత్‌కు అప్పగించింది. వాఘా సరిహద్దుల గుండా ఆయన దర్జాగా మాతృభూమిపై అడుగు పెట్టారు. కొద్దిరోజుల కిందటే అభినందన్‌కు వైమానిక దళాధికారులు పదోన్నతిని కల్పించారు. వింగ్ కమాండర్ స్థాయి నుంచి గ్రూప్ కేప్టెన్‌గా ఆయన ప్రమోషన్ పొందారు. వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్‌ను గ్రూప్ కేప్టెన్ ర్యాంక్ స్థాయి అధికారికగా పదోన్నతి కల్పించారు. వైమానిక దళంలో గ్రూప్ కేప్టెన్ అంటే.. సైన్యంలో కల్నల్ స్థాయికి సమానమైన ర్యాంక్ ఇది.












Click it and Unblock the Notifications