El Nino: చరిత్ర చూడని ఉష్ణోగ్రతలు.. రికార్డు సృష్టించిన 2026!
మన భూగోళం ఊహించని రీతిలో వేడెక్కిపోతోంది. ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భవిష్యత్తు మానవాళి మనుగడనే ప్రశ్నిస్తున్నాయి. తుఫానులు, కరవులు, తీవ్రమైన ఎండలతో ప్రపంచం అతలాకుతలమవుతుంటే.. వాతావరణ మార్పుల ముప్పు మరింత పెరిగిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి చేరుతున్న హానికర వాయువులకు తోడు 'ఎల్ నినో' ప్రభావం జతకూడటంతో చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాల్లో 2026 ఒకటిగా నిలవబోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ బాంబు పేల్చింది. తుర్కియేలోని అంతాల్యా వేదికగా జరుగుతున్న కాప్-31 సదస్సు ప్రారంభ రోజే డబ్ల్యూఎంఓ ఈ సంచలన నివేదికను విడుదల చేసింది.
సగటు ఉష్ణోగ్రతల్లో రికార్డుల మోత
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య నమోదు అయిన వివరాల ప్రకారం, పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూగోళం సగటున 1.47 డిగ్రీల సెల్సియస్ అదనంగా వేడెక్కింది. ఇది 2023, 2025 ఏడాదుల కంటే ఎక్కువే కావడం గమనార్హం. కేవలం 2024 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రెండో సంవత్సరంగా 2026 నిలిచింది. ఆగస్టు నుంచి ఊపందుకున్న ఎల్ నినో డిసెంబర్ నాటికి తీవ్రరూపం దాల్చనుండటంతో ఈ ఏడాది ఆఖరుకు వేడి మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లు చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాలుగా రికార్డులకెక్కాయి.

మహాసముద్రాల్లో మంటలు.. పర్యావరణ సమతుల్యత దెబ్బ!
మనం విడుదల చేస్తున్న విపరీతమైన గ్రీన్ హౌస్ వాయువుల వల్ల సూర్యుని నుంచి వచ్చే వేడి, భూమి నుంచి తిరిగి వెళ్లే శక్తి మధ్య ఉండాల్సిన సమతుల్యత పూర్తిగా దెబ్బతిన్నది. దీనివల్ల భూమి ఊహించని వేగంతో వేడిని నిల్వ చేసుకుంటోంది. ఈ అదనపు వేడిలో దాదాపు 90 శాతాన్ని మహాసముద్రాలే పీల్చుకుంటున్నాయి. దీంతో వరుసగా పదవ ఏడాది కూడా సముద్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1750వ సంవత్సరంతో పోలిస్తే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత 53 శాతం పెరగ్గా, మీథేన్ సాంద్రత ఏకంగా 167 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.
భారత్‌పై తీవ్ర ప్రభావం.. ప్రపంచవ్యాప్తంగా ప్రాణనష్టం
ఈ తీవ్రమైన వాతావరణ మార్పులు కేవలం రికార్డులకే పరిమితం కాలేదు, లక్షలాది మంది జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి. తీవ్రమైన ఎండలు, కరవులు, అడవుల్లో కార్చిచ్చుల వల్ల ఐరోపాలో ఒక్క ఏడాదిలోనే 30 వేలకు పైగా ప్రాణాలు పోయాయి. మన భారతదేశంలోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన తీవ్రమైన వడగాల్పుల వల్ల దేశంలో సుమారు 14.65 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పంటల దిగుబడి తగ్గి ఆహార భద్రత ప్రమాదంలో పడటంతో పాటు నిరుద్యోగం, వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ముప్పు ముంగిట మానవాళి: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
మనం తీవ్రమైన వాతావరణ అత్యవసర పరిస్థితిలోకి అడుగుపెట్టామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ తప్పిదాల వల్ల ఇప్పటికే వేడెక్కిన భూగోళాన్ని సగటు కంటే పెద్దదైన 'సూపర్ సైజ్ ఎల్ నినో' మరింత ఉడికించి వేస్తోందన్నారు. రోజురోజుకూ మానవాళి చెల్లిస్తున్న మూల్యం పెరుగుతోందని, దీనివల్ల తప్పు చేయని పేద దేశాలు, ప్రజలే ముందుగా బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాల నాయకులు మేల్కొని బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, ఉద్గారాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications
