విషాదం: డ్యూటీ చేస్తూ తుపాకీతో కాల్చుకున్న ఐఏఎఫ్ జవాను చౌదరి
సిమ్లా: భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఓ 24ఏళ్ల జవాను తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాన్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌మ్యాన్(ఎల్ఏసీ) కృష్ణేండు చౌదరి తన వద్ద ఉన్న సర్వీసు రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి కసౌలి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సెంట్రీ విధుల్లో ఉన్న సమయంలో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని సోలాన్ అడిషనల్ ఎస్పీ శివకుమార్ తెలిపారు.

ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. చౌదరి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లాకు చెందిన చౌదరి.. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంపై తోటి ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.
పోస్టుమార్టం నిమిత్తం చౌదరి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ శివకుమార్ తెలిపారు. అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications