అలా అనుకుంటే.. బీజేపీకే ఓటు వేయండి: ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ పిలుపు.. !
Recommended Video
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు గురువారం సాయంత్రం తెరపడబోతున్న నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఢిల్లీ వాతావరణం వేడెక్కింది. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు.. ఈ ఎన్నికల ప్రచార వివాదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించిన పర్వేష్ వర్మ
ఇదే పౌరసత్వ సవరణ చట్టం నిరసనలను అడ్డు పెట్టుకుని బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్, లోక్‌సభ సభ్యుడు పర్వేష్ వర్మ ఓ అడుగు ముందుకేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించారు. దీనికి ధీటుగా స్పందించారు కేజ్రీవాల్. బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన ఎదురుదాడికి దిగారు.

ఢిల్లీ ప్రజల విచక్షణకే వదిలేస్తున్నా..
తనను ఉగ్రవాదిగా పేర్కొనడాన్ని కేజ్రీవాల్ తప్పు పట్టారు. తాను ఉగ్రవాదినా? కాదా? అనే విషయాన్ని ఢిల్లీ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తాను ఉగ్రవాదినేనని ఢిల్లీ ప్రజలు భావిస్తే.. బీజేపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న జరిగే పోలింగ్ సందర్భంగా కమలం గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. తాను ఉగ్రవాదిని కాదని భావిస్తే.. తమ పార్టీని గెలిపించాలని విజ్ఙప్తి చేశారు.ఈ ఉదయం ఆయన ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు.

రాజకీయాల్లోకి హిందూ మతాన్ని లాగుతోన్న బీజేపీ..
తనపై హిందూ వ్యతిరేకిగా, ఉగ్రవాదిగా ముద్ర వేయడానికి బీజేపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఏ కారణంతో రాజకీయాల్లోకి హిందూ మతాన్ని లాగుతోందని ప్రశ్నించారు. హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని ఆ వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకోవడానికి కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. పర్వేష్ వర్మ ఉగ్రవాదిగా పేర్కొన్నడం తనను కలచి వేసిందని అన్నారు. తన భార్య, బిడ్డలను కూడా పట్టించుకోకుండా.. దేశ ప్రజల కోసం పని చేశానని చెప్పారు.

ప్రజల కోసం చాలా వదులుకున్నా..
తనతో పాటు ఐఐటీలో చదువుకున్న స్నేహితుల్లో 80 శాతం మంది దేశం వదిలి వెళ్లారని, విదేశాల్లో మంచి వేతనాన్ని పొందుతూ స్థిరపడ్డారని అన్నారు. తాను మాత్రం దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చివరికి ఆదాయపు పన్ను కమిషనర్ ఉద్యోగాన్ని కూడా వదలుకున్నారని చెప్పారు. అలాంటి తనపై ఉగ్రవాది అనే ముద్ర వేయడం బాధ కలిగిస్తోందని కేజ్రీవాల్ చెప్పారు. తనపై హిందూ వ్యతిరేకి అనే ముద్రను వేయడానికి ప్రయత్నిస్తోందని, తాను హిందువునని గర్వంగా చెప్పుకొంటానని అన్నారు.

కపిల్ గుర్జర్‌ను తమ పార్టీ కార్యకర్తగా చిత్రీకరించడానికి తంటాలు..
హనుమాన్ చాలీసాను అనర్గళంగా మీడియా సమక్షంలోనే పఠించానని గుర్తు చేశారు. జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై కాల్పులు జరిపిన కపిల్ గుర్జర్‌ను తమ పార్టీ కార్యకర్తగా రుజువు చేయడానికి బీజేపీ నాయకులు తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనికోసం వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications