వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలా పోపట్: ప్రపంచంలో ఏ దేశానికీ చెందని వ్యక్తి ఈమె

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇలా పోపట్

ఇలా పోపట్ గత 50 ఏళ్లుగా భారతదేశంలోనే నివసిస్తున్నారు. ఆమెకు ఇక్కడే పెళ్లయింది, పిల్లలు పుట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కూడా ఉన్నాయి.

కానీ, ఆమె విదేశాలకు వెళ్లలేరు. ఎందుకంటే ఆమెకు పాస్‌పోర్ట్ లేదు. ఇదే విషయమై ఇప్పుడు ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనకు పాస్‌పోర్ట్ జారీ చేయాల్సిందిగా భారత అధికారులకు ఆదేశాలివ్వాలంటూ కోర్టును కోరారు.

66 ఏళ్ల పోపట్ 1955లో యుగాండాలో జన్మించారు. ఆమెకు పదేళ్లు ఉన్నప్పుడు తన తల్లి పాస్‌పోర్ట్‌పై ఓడలో భారతదేశానికి చేరుకున్నారు.

అప్పటి నుంచి పోపట్ భారతదేశంలోనే నివసిస్తున్నారు. తన "భారతీయతను" నిరూపించుకోవడానికి కావలసినని పత్రాలు ఉన్నాయని ఆమె అంటున్నారు.

ఎన్నో ఏళ్లుగా భారత పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కానీ రాలేదు.

మూడు దేశాలు ఆమెను "ఏ దేశానికి చెందని మహిళ"గా ముద్రవేశాయి.

"ప్రతిసారి నా పౌరసత్వంపై ప్రశ్న వస్తుంది. ఆ ప్రక్రియ అక్కడ ఆగిపోతుంది" అని పోపట్ చెప్పారు.

పాస్‌పోర్ట్

యుగాండా నుంచి భారత్‌కు..

ఇలా పోపట్ తండ్రి గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో పుట్టి పెరిగారు. 1952లో ఆయన ఉద్యోగం కోసం యుగాండా వెళ్లారు. కొన్నేళ్ల తరువాత ఆయనకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ వచ్చింది.

ఇలా పోపట్ 1955లో తూర్పు ఆఫ్రికా దేశంలోని కములి పట్టణంలో జన్మించారు. అప్పటికి ఆ దేశం ఇంకా బ్రిటిష్ పాలనలోనే ఉంది. తరువాత ఏడేళ్లకు స్వతంత్రం పొందింది.

1966లో యుగాండాలో తీవ్ర రాజకీయ గందరగోళం ఏర్పడింది. అత్యవసర పరిస్థితిని ప్రకటించి, రాజ్యాంగాన్ని రద్దు చేశారు. దాంతో, ఇలా పోపట్ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకుని భారతదేశం వచ్చేశారు.

"నేను మైనర్‌గా ఉన్నప్పుడు భారత్ వచ్చాను. మా అమ్మ పాస్‌పోర్ట్‌లో నా పేరు ఉంది. అమ్మ పాస్‌పోర్ట్‌లో ఆమెను 'బ్రిటిష్ ప్రొటెక్టెడ్ పర్సన్' అని పేర్కొన్నారు. ఇది ఇంగ్లండ్ ప్రభుత్వం ఇచ్చే ఒక విధమైన జాతీయ గుర్తింపు" అని పోపట్ చెప్పారు.

పాస్‌పోర్ట్ లేకుండా ఆమె భారత్ ఎలా రాగలిగారో ఆమె తరపు లాయర్ ఆదిత్య చితాలే వివరించారు.

"బహుశా అప్పటి నియమాల ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రుల పాస్‌పోర్ట్‌పై దేశంలోకి ప్రవేశించవచ్చు. లేదంటే ఆమెను దేశంలోకి అనుమతించరు" అని ఆయన అన్నారు.

భారతదేశానికి తిరిగి వచ్చాక పోపట్ కుటుంబం కొన్నాళ్లు పోర్‌బందర్‌లో నివసించింది. తరువాత 1972లో ముంబై చేరుకుంది. అక్కడే 1977లో ఇలా పోపట్‌కు వివాహమైంది, పిల్లలు పుట్టారు.

భారత పౌరసత్వం కోసం దరఖాస్తులు

పోపట్ 1997లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. భారతదేశంలో '1955 పౌరసత్వ చట్టం' ప్రకారం ఇక్కడి వ్యక్తిని వివాహం చేసుకుని, ఏడేళ్ల పాటు ఇక్కడే నివసిస్తే పౌరసత్వానికి అర్హత పొందవచ్చు. కానీ, ఆమెకు అనుకూలంగా నిర్ణయం రాలేదు. దరఖాస్తును తిరస్కరించారు.

అప్పుడు ఆమె ముంబైలోని బ్రిటిష్ హైకమిషన్‌ను ఆశ్రయించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరికీ బ్రిటిష్ పాస్‌పోర్ట్‌ ఉన్నందున, తనకు బ్రిటిష్ పౌరసత్వం లభించగలదని ఆశించారు. ఆమె తల్లి తరపు బంధువులు ఇప్పటికీ బ్రిటన్‌లో ఉన్నారు.

కానీ, ఆమెకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ పొందేందుకు అర్హత లేదని తేల్చిచెప్పారు. ఎందుకంటే, ఆమె తండ్రి లేదా తాత 1962 తరువాత బ్రిటన్‌లోగానీ లేదా దాని వలస రాజ్యాల్లోగానీ "పుట్టలేదు, అక్కడ వారి పేరు నమోదు కాలేదు", కాబట్టి ఆమెకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ రాదు.

అయితే పోపట్‌కు యుగాండా పాస్‌పోర్ట్ లభించే అవకాశం ఉంది కానీ, "యుగాండా ప్రభుత్వం కూడా పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు తిరస్కరిస్తే మీరు ఏ దేశానికి చెందని వ్యక్తి (స్టేట్‌లెస్) అవుతారు" అని కూడా బ్రిటిష్ హైకమిషన్ పేర్కొంది.

ఆమెను స్టేట్‌లెస్‌గా పేర్కొన్న మొదటి సందర్భం అది. ఆ తరువాత ఆమెను స్టేట్‌లెస్‌గా పేర్కొనడం సాధారణం అయిపోయింది.

తరువాతి సంవత్సరాలలో ఆమె భారత పాస్‌పోర్ట్ కోసం రెండుసార్లు దరఖస్తు పెట్టుకున్నారు. కానీ, తిరస్కారమే ఎదురైంది.

"బ్రిటన్‌లో ఉన్న మా తాతను కలుసుకోవడానికి కనీసం ట్రావెల్ పాస్‌పోర్ట్ ఇప్పించమని అడిగాను. కానీ, ఇవ్వలేదు" అని ఆమె చెప్పారు.

వడోదరలో ఉంటున్న ఆమె తమ్ముడికి బ్రిటిష్ పాస్‌పోర్ట్ వచ్చింది.

ఇలా కు మాత్రం ఆమె తల్లిదండ్రులు బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఎందుకు ఇప్పించలేకపోయారు?

"మాది ఉమ్మడి కుటుంబం. మాకేం పెద్దగా తెలీదు. పెద్దవాళ్లు ఏం చెబితే అది చేసేవాళ్లం. వాళ్లను ప్రశ్నించడం లేదా నిలదీయడం మాకు తెలీదు. కాబట్టి ఆ ప్రక్రియలో ఏం లోపం జరిగిందో మాకు తెలీదు" అని ఇలా పోపట్ అన్నారు.

యుగాండా

'స్టేట్‌లెస్ మహిళ'

2015లో మూడవసారి కూడా ఆమె దరఖాస్తును తిరస్కరించినప్పుడే, ఆమె మొదట భారత పౌరురాలిగా తన పేరును నమోదు చేసుకోవాలని అధికారులు చెప్పారు.

"ఆమె ముందు పౌరసత్వానికి దరఖాస్తు పెట్టుకోవాలి. అది లేకపోతే పాస్‌పోర్ట్ రాదు" అని లాయర్ చితాలే కూడా అంగీకరించారు.

ఈ విషయంలో తనకు ఎవరూ సరైన సూచనలు, సలహాలు ఇవ్వలేదని ఇలా పోపట్ అన్నారు.

"మాకు పెద్దగా ఏం తెలీదు. ఏం చేయాలో ఎవరూ చెప్పలేదు. ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కడం, దిగడమే తప్ప మాకు మార్గం కనిపించలేదు. అన్నిచోట్ల నన్ను "స్టేట్‌లెస్" అని పిలుస్తారు. నాకు పాస్‌పోర్ట్ వచ్చే అవకాశాలు లేవని నిరుత్సాహపరుస్తారు" అని ఇలా పోపట్ చెప్పారు.

2018లో పోపట్ కుమార్తె తన తల్లి పౌరసత్వం లేదా పాస్‌పోర్ట్ కోసం దిల్లీలోని యుగాండా హైకమిషన్‌కు లేఖ రాశారు. దీని ఆధారంగా ఇలా పోపట్ భారత పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు పెట్టుకోవచ్చని భావించారు.

అయితే, పోపట్ యుగాండాలో జన్మించారు కానీ, ఎప్పుడూ "యుగాండా పౌరురాలిగా గుర్తింపు పొందలేదని" కాన్సులేట్ తేల్చిచెప్పింది.

"స్టేట్‌లెస్ వ్యక్తిగా" మళ్లీ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకోమని ఆమెకు చెప్పారు.

2019లో తిరిగి ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ తిరస్కారమే ఎదురైంది. ఆమె సరైన వీసా లేదా పాస్‌పోర్ట్ లేకుండా దేశంలో నివసిస్తున్నారని, అందుకే 1955 పౌరసత్వ చట్టంలోని షరతులు వర్తించవని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇది పోపట్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. 2022లో బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.

"నా భర్త భారతీయుడు. నా పిల్లలు, మనుమలు కూడా భారతీయులే. ఆధార్ సహా అన్ని ప్రభుత్వ పత్రాలు నా దగ్గర ఉన్నాయి. కానీ, ఇవేమీ సరిపోవు అంటున్నారు" అని పిటిషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఆమె బీబీసీకి చెప్పారు.

1972లో యుగాండా నియంత ఈదీ అమీన్ ఆసియావాసులందరూ దేశం వదిలి వెళ్లిపోవాలని చెప్పడంతో, చాలామంది భారతీయులు ఆ దేశాన్ని విడిచిపెట్టారు. అయితే, వారిలో చాలామందికి బ్రిటన్, కెనడా, భారత పౌరసత్వాలు లభించాయి.

బాంబే హైకోర్టు ఆగస్టులో ఇలా పోపట్ కేసును విచారించనుంది.

"ఇప్పటికే బ్రిటన్‌లో నా ఇద్దరు మేనల్లుళ్ల వివాహానికి హాజరు కాలేకపోయాను. ఇప్పుడు దుబాయ్‌లో మరో మేనల్లుడి పెళ్లి జరగబోతోంది. అది కూడా మిస్ అవుతాను" అని ఆమె అన్నారు.

ఎప్పటికైనా భారత పౌరసత్వం పొందాలన్నదే తన కోరిక అని ఇలా పోపట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ila Popat: She is a person who does not belong to any country in the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X