దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న జ్వరాల కేసులు- డాక్టర్లకు ఐఎంఏ కీలక సూచన
దేశంలో జ్వరాల కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో రోగులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. డాక్టర్లు కూడా వారికి ఇష్టారాజ్యంగా యాంటీ బయోటిక్స్ ఇచ్చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జ్వరాల కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సీజన్ మారుతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో రోగులు జ్వరంతో పాటు అనుబంధ లక్షణాలతో బాధపడుతున్నారు. వీటిలో దగ్గు, వికారం, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, కొన్ని సందర్భాల్లో అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా ఓ సూచన చేసింది.
ఇలాంటి లక్షణాలతో తమ వద్దకు వస్తున్న రోగులకు యాంటీ బయోటిక్స్ ఇవ్వొద్దని డాక్టర్లకు ఐఎంఏ సూచించింది. వీరికి కేవలం ఏ రోగ లక్షణంతో వస్తే దానికి సంబంధించిన మందులు మాత్రమే ఇవ్వాలని కోరింది. ఇన్ఫెక్షన్ సాధారణంగా ఐదు నుండి ఏడు రోజుల వరకు ఉంటుందని, మూడు రోజుల చివరిలో జ్వరం తగ్గిపోతుందని తెలిపింది. కానీ దగ్గు మూడు వారాల వరకు కొనసాగుతుందని ఐఎంఏ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నుండి వచ్చిన సమాచారం ప్రకారం H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ కేసులు చాలా నమోదవుతున్నాయి.

ఇన్‌ఫ్లుఎంజా, ఇతర వైరస్‌ల కారణంగా అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు కాలానుగుణంగా జలుబు లేదా దగ్గు రావడం సర్వసాధారణమని ఐఎంఏ చెబుతోంది. ప్రజలు అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రారంభిస్తారని, అది కూడా మోతాదు, ఫ్రీక్వెన్సీని పట్టించుకోకుండా వాడుతున్నట్లు తెలిపింది. ఇది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కు దారి తీస్తుంది కాబట్టి దీన్ని నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తన సూచనలో వివరించింది.












Click it and Unblock the Notifications