ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!!
Kerala landslides: కేరళలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించారు. 400 మందికి పైగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
వాయనాడ్ జిల్లాలో ఈ తెల్లవారు జామున ఈ ఉదంతం సంభవించింది. కేరళలో కొద్దిరోజులుగా ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేెకించి- కేరళ ఉత్తరప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటోంది. చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.

భారీ వర్షాల తాకిడికి వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని మెప్పాడి, ముండక్కై టౌన్, చూరల్‌మాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగి జనావాసాల మీద పడ్డాయి. అదే సమయంలో బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది.
అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు తొలి దుర్ఘటన సంభవించింది. ముండక్కై టౌన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. తెల్లవారు జామున 4 గంటల సమయంలో చూరల్‌మాలాలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది. చూరల్‌మాలాలో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో ఉన్న వాళ్లు ప్రమాదానికి గురయ్యారు. చుట్టు పక్కల ఉన్న నివాసాలు దెబ్బతిన్నాయి.
కోజికోడ్ జిల్లా వనిమాళ్ గ్రామ పంచాయితీ పరిధిలోని విలంగాడ్ వద్దా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. 400 మందికి పైగా చిక్కుకుపోయారు. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అట్టమాలా గ్రామంలో ఆరు మృతదేహాలను వెలికి తీశారు.
ఈ పరిస్థితుల్లో కేరళలో వచ్చే 24 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు పడబోతోన్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం.. కేరళ మధ్య, ఉత్తర ప్రాంతంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రత్యేకించి- అయిదు జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మళప్పురం, కోజికోడ్, వాయనాడ్, కాసర్‌గాడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 50 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
కొట్టాయం, కాసర్‌గాడ్, కన్నూర్, వాయనాడ్, పాలక్కాడ్, ఎర్నాకుళం, కోజికోడ్, మళప్పురం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు నేడు సెలవు ఇచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications