Rains : ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు ఇలా..ఐఎండీ తాజా అంచనా ఇదే..!
దేశవ్యాప్తంగా వచ్చే రెండు నెలల్లో రుతుపవనాల కారణంగా వర్షాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా అంచనాల్ని ఇవాళ వెల్లడించింది. ఇందులో నైరుతి రుతుపవనాల రెండో దశ అయిన ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షపాతం ఎలా ఉండబోతోందో తెలిపింది. దీని ప్రకారం వచ్చే రెండు నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది.
జూలైలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. ఉత్తరాదిని పలు రాష్ట్రాలు వరదల బారిన కూడా పడ్డాయి. ఇప్పుడు రుతుపవనాల రెండవ సగం (ఆగస్టు, సెప్టెంబర్)నెలల్లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ ఇవాళ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం ఏ స్ధాయిలో నమోదవుతుందో కూడా పేర్కొంది.

తూర్పు-మధ్య భారతదేశం, తూర్పు, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయాల వెంబడి ఉన్న చాలా ఉపవిభాగాలలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య, మధ్య భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర ఇవాళ వెల్లడించారు.
జూలైలో దేశవ్యాప్తంగా 13 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలు 1901 తర్వాత ఈ నెలలో మూడవ అత్యల్ప వర్షపాతం నమోదు చేశాయని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటివరకూ పడిన రుతుపవన వర్షాలలో కూడా భారీ వ్యత్యాసం నమోదైంది. జూన్‌లో 9 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. జూలైలో 13 శాతం అదనపు వర్షాలు పడ్డాయి. దేశంలో ఇప్పటివరకు వర్షాకాలంలో సాధారణం 445.8 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండగా ఈసారి 467 మిల్లీమీటర్లు నమోదైంది, ఇది 5 శాతం ఎక్కువగా అంచనా వేశారు.












Click it and Unblock the Notifications