నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: ఆయన నిరాహారదీక్ష చేసిన భవనం ఇప్పుడు ఎలా ఉంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రరాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలు నేటికీ తమిళనాడులో ఉన్నాయి.

ఒకనాడు తెలుగువాళ్లకు ప్రధాన పట్టణంగా ఉండే మద్రాసు( ప్రస్తుతం చెన్నై)లో పొట్టి శ్రీరాములు దీక్ష చేశారు. ఆ ప్రాంతాన్ని బీబీసీ సందర్శించింది.

215 రాయపేట హైరోడ్డు, మైలాపూర్‌లో అప్పటి మద్రాసు మాజీ స్పీకర్ బులుసు సాంబమూర్తి అద్దెకు ఉన్న ఇంటిముందు అరుగుపైన శ్రీరాములు దీక్షకు దిగారు.

పొట్టి శ్రీరాములు స్మారకార్థం 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఇంటిని కొనుగోలు చేసింది.

2001లో ఆ భవనం స్థానంలో మూడంతస్తుల భవనం నిర్మించారు.

మెదట గ్రౌండ్ ప్లోర్లో ఒక హాలు ఉంటుంది. అందులో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేశాారు. ఆ హాలులో ఆనాటి ఫోటోలు, పత్రికల్లో వచ్చిన కటింగ్స్ ఫ్రేములను ప్రదర్శనకు పెట్టారు.

మెదటి అంతస్తులో మీటింగ్ హాలు ఉంటుంది. అకేషన్ ఉన్నప్పుడు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రెండవ అంతస్తులో లైబ్రరీ ఉంటుంది. అక్కడ ప్రాచీన పుస్తకాలు ఉన్నాయి. అయితే, అది ప్రజలకు అందుబాటులో లేదు.

దాన్ని అందుబాటులోకి తేవడానికి దాతలు నిధులు ప్రకటించినా సాంకేతిక కారణాల వల్ల అది ఇంకా అందుబాటులోకి రాలేదు. దానిపైన ఒ గది ఉంది అందులో ఆ భవనాన్ని చూసుకోవడానికి ఉండే కేర్ టేకర్స్ ఉంటారు.

ఆ భవనం ఆనుకుని ఓ ప్రైవేటు స్కూల్ ఉండడంతో ఆ వీదంతా రద్దీగా ఉంటుంది.

1952లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్షకు దిగారు.

పొట్టి శ్రీరాములు

చిన్నతనం నుంచీ కష్టాలే

పొట్టి శ్రీరాములు పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కనిగిరి దగ్గరున్న పడమటి పల్లె.

పడమటిపల్లె గ్రామం ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఉంది. పెదచెర్లోపల్లి మండలంలో ఉన్న ఈ గ్రామంలో పొట్టిశ్రీరాములు జ్ఞాపకాలు శిథిలమై పోతున్నాయి.

ఇప్పటికే వారి నివాసం శిథిలమై పోయింది. ఇటీవల సినీనటుడు త్రిపురనేని సాయిచంద్ వచ్చిన సమయంలో కూడా అక్కడ శిథిలాలు తొలగించిన దాఖలాలు లేవు.

చెన్నై నుంచి కాలినడకన అక్కడికి చేరుకున్న సాయిచంద్ కొద్దిసేపు అక్కడ కూర్చున్నారు. పొట్టి శ్రీరాములుకి నివాళులర్పించారు.

ఆయనకు పలువురు స్థానికులు కూడా సంఘీభావం తెలిపారు.

నేడు పడమటిపల్లెలో సుమారు 900 ఇళ్లున్నాయి. నాలుగున్నరవేల మంది నివసిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత గ్రామం.

పొట్టి శ్రీరాములుకి సంబంధించిన జ్ఞాపకాలు అక్కడ ఉండడం గర్వకారణమని స్థానికుడు, రైతు ఇంటూరి రామచంద్రరావు అన్నారు.

వాటిని పరిరక్షించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని ఆయన కోరారు.

"పొట్టిశ్రీరాములతో మా గ్రామానికి ఉన్న అనుబంధం గుర్తు చేస్తూ ఇటీవల సాయి చంద్ నిర్వహించిన పాదయాత్ర మూలంగా మా ఊరిలో కొత్తతరానికి కూడా ఆయన గురించి తెలిసింది. అయితే వారు నివశించిన ఇల్లు ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. కనీసం ఆయన జ్ఞాపకార్థం ఏదైనా నిర్మాణం చేపడితే బాగుంటుందని అంతా కోరుకుంటున్నాం" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.

1876లో తీవ్రమైన కరవు రావడంతో పొట్టి శ్రీరాములు కుటుంబం మద్రాసుకు వలస వెళ్లింది. అన్నాపిళ్లై వీధి నంబర్ 163లో అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కడే 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. ఆయన చదువంతా మద్రాసు నగరంలోనే సాగింది.

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి వారిని ఎంతో కష్టపడి పోషించారని, పొట్టి శ్రీరాములు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను చూశారని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్టాలి శంకర్ రావ్ బీబీసీతో చెప్పారు.

“ఒక దశలో తిండి కూడా లేని పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు మద్రాసులోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలోనే తిని అక్కడే చదువుకునే పరిస్థితి ఉండేది. చిన్నప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల చదువుకు కూడా ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ముంబైలో విద్యాభ్యాసం చేసి చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశారు” అని ఆయన తెలిపారు.

పొట్టి శ్రీరాములు స్మారక భవనం

దేశ సేవకు అంకితం

తర్వాత పొట్టి శ్రీరాములుకి సీతమ్మతో వివాహం అయింది.

ముంబైలో ఉద్యోగం చేసేటప్పుడు ఆమెని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ వాతావరణం అనుకూలించక ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత వారు ఆంధ్రాకి వెళ్లారు. సీతమ్మ పుట్టింటిలో మరణించారు. దానికి ముందే పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడు.

భార్య, బిడ్డలతోపాటు దానికి కొన్ని నెలల ముందే తల్లి కూడా చనిపోవడంతో పొట్టి శ్రీరాములు అన్నీ త్యజించాలని నిర్ణయించుకున్నారని, దేశ సేవకోసం అంకితంకావాలని నిర్ణయించుకున్నారని ఆచార్య విస్టాలి చెప్పారు.

“తక్కువ కాలంలో తల్లి, భార్య, బిడ్డ అందరూ చనిపోయారు. ఆయనకి ఎటువంటి వ్యామోహం లేదు. ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ సోదరులకి ఇచ్చేసి నేను దేశ సేవ కోసం వెళ్తాను అని ఉద్యమం చేపట్టారు. దళితుల కోసం ఉద్యమాలు చేసి అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చిన వ్యక్తి ఆయన.

1912లోనే ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు మొదలయ్యాయి. అదే సమయంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతోంది. గాంధీజీ ప్రభావం శ్రీరాములుపై చాలా ఎక్కువగా ఉంది. ఆయన గాంధీజీ అనుచరుడుగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. ఆయన దీక్ష పట్టుదల చూసిన గాంధీ శ్రీరాములు లాంటి వారు పదిమంది ఉంటే నేను సంవత్సరంలోనే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధిస్తానని ప్రకటించారు” అని ఆచార్య విస్టాలి చెప్పారు.

మాటవరసకు అంటే...

స్వాతంత్రోద్యమంలో పొట్టి శ్రీరాములు మూడుసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. సామాజిక మార్పుల కోసం, దళితుల దేవాలయ ప్రవేశం, దళితుల ఉద్యమం లాంటివి చేపట్టారు.

నాడు మద్రాసులోని తెలుగువారిపై తమిళుల ఆధిపత్యం ఎక్కువగా ఉండడంతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక వాదం బయలుదేరింది.

''ఎవరో ఒకరు ఆత్మత్యాగం చేయనిదే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా కనిపించడం లేదు అని ఆచార్య రంగా అనడంతో పొట్టి శ్రీరాములు దాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆంధ్రుల కోసం ఆత్మత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

గతంలో కూడా పొట్టి శ్రీరాములు అనేక దీక్షలు చేశారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలంటే అహింసా మార్గంలోనే సాధించాలనుకున్న ఆయన నిరాహార దీక్ష ఎక్కడ చేయాలని ఆలోచించారు.

ఆ సమయంలో మద్రాసు నగరం నడిబొడ్డున ఉన్న బులుసు సాంబమూర్తి ఇల్లు దానికి అనువైన ప్రదేశం అని గుర్తించారు. సాంబమూర్తి అనుమతితో అక్కడ తన నిరాహార దీక్ష ప్రారంభించారు” అని ఆచార్య విస్టాలి చెప్పారు.

పొట్టి శ్రీరాములు

మెల్లగా రగిలిన ప్రత్యేకాంధ్ర ఉద్యమం

పొట్టి శ్రీరాములు దీక్ష ప్రారంభించినప్పుడు, దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటివి అందరూ చేస్తుంటారులే అనుకున్నారు.

కానీ దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించే కొద్ది ఆంధ్ర రాష్ట్రమంతటా అక్కడక్కడా ప్రజల్లో స్పందన వచ్చింది. మెల్ల మెల్లగా నిరసనలు, ఆందోళనలు పెరిగాయి. దీంతో పత్రికలు దానిపై దృష్టిపెట్టడం పెరిగింది.

పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షచేస్తున్న సమయంలో డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసేవారు. ఆయన దీక్షకు దిగిన 40 రోజుల తర్వాత కేంద్రం కూడా దిగివచ్చింది.

కేంద్రం నీలం సంజీవరెడ్డిని తమ దూతగా ఆయన దగ్గరికి పంపించి, నిరాహారదీక్ష విరమించాలని కోరిందని. కానీ, తాను ఏ లక్ష్యం కోసం దీక్ష ప్రారంభించానో అది సాధించే వరకు, దానిని విరమించేది లేదని ఆయన మౌనంగా ఉండిపోయారని ఆచార్య విస్టాలి శంకర్ రావ్ వివరించారు.

“నేను గాంధీజీ అనుచరుడిని కాబట్టి ఎక్కడ కూడా ఘర్షణలు జరగకూడదు. అహింసా మార్గంలో శాంతియుతంగానే పోరాడాలి అనే సందేశాన్ని శ్రీరాములు పంపించారు. 1952 డిసెంబర్ 15 వరకు దీక్ష చేసి తర్వాత మరణించారు.

ఈ వార్త ఆంధ్ర రాష్ట్రం మొత్తం వ్యాపించడంతో తెలుగు వారంతా మద్రాసు నగరం చేరుకున్నారు. 16న మధ్యాహ్నం రెండు గంటలకు బులుసు సాంబమూర్తి ఇంటి నుంచే ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది” అని విస్టాలి చెప్పారు.

ఆ రోజున పొట్టి శ్రీరాములు అంతిమ యాత్ర మైలాపుర్ నుంచీ మెదలై ఆయన జన్మించిన అన్నా పిళ్లై వీధిమీదుగా, రాయపేట హైరోడ్, మౌట్ రోడ్, సెంట్రల్ మీదుగా సాగిందని ఆచార్య విస్టాలి శంకర్ రావ్ చెప్పారు.

“మద్రాసుకు తరలివచ్చిన వేలాది మంది తెలుగు వారు పొట్టి శ్రీరాములు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఎంతోమంది ఉద్యమకారులు చనిపోయారు. గాంధీ జాతిపిత అయితే, మనకు పొట్టి శ్రీరాములు రాష్ట్రపిత. దహనం అయిన తర్వాత ఆయన బూడిదను తీసుకెళ్లి పవిత్ర నదుల్లో కలిపారు. పొట్టి శ్రీరాములు అందించిన స్ఫూర్తి భవిష్యత్తు తరాల వారికి తెలియాల్సిన అవసరం ఉంది” అని విస్టాలి అన్నారు.

చెన్నై

త్యాగానికి గుర్తుగా భవనం

పొట్టి శ్రీరాములుకు గుర్తుగా మద్రాసులో ఒక భవనం నిర్మించారు.

శిథిలమైన ఆ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001 పునర్నిర్మించిందని, దాని బాగోగులు చూసుకోడానికి ఒక సొసైటీని కూడా ఏర్పాటుచేసిందని, చెన్నైలో పొట్టి శ్రీరాములు స్మారక భవనం బాగోగులు చూస్తున్న కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''1984లో స్థాపించిన సొసైటీ ఈ భవనం బాగోగులు చూస్తూ వచ్చింది. ఆ తర్వాత దీనిని మరింత అభివృద్ధి చేయడం కోసం 2018లో 12 మంది సభ్యులతో పొట్టి శ్రీరాములు స్మారక భవనం కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత 2021లో 11 మంది సభ్యులతో నన్ను ఇక్కడ చైర్మన్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ భవనం బాగోగులు చూసుకోవడం, పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించడం మా బాధ్యత” అని అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

సాయిచంద్

మూడేళ్లుగా నిధుల కొరత

పొట్టి శ్రీరాములు స్మారక భవనం బాగోగులు, అక్కడ నిర్వహించే కార్యక్రమాలకు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిధులు అందించేది. కానీ గత మూడేళ్లుగా తమకు ఆ నిధులు కూడా అందడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.

'2019లో ప్రభుత్వం జీవో ద్వారా మొదట 5 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి నిధులు రాలేదు. సంవత్సరానికి భవనం మెయింటెనెన్స్‌, జీతాలకే 5 లక్షల రూపాయల వరకు అవుతుంది. ఇక గ్రంథాలయం నిర్వహణకు మరింత అమౌంట్ అవసరం.

ఇక గాంధీ జయంతి, పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి సందర్భంగా నిర్వహించే తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి బాగా చేయాలంటే సంవత్సరానికి కనీసం 10 లక్షల రూపాయలు అవుతుంది.

తమిళనాడులో ఉన్నా, మన రాష్ట్ర గౌరవం చాటేలా దీనిని ఘనంగా నిర్వహించాలంటే, సంవత్సరానికి కనీసం 10 లక్షల రూపాయల నిధులు అందిస్తే, బాగుంటుంది. మన ప్రభుత్వానికి గౌరవంగా కూడా ఉంటుంది” అని అనిల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అమరజీవిగానే మిగిలిపోయారు

మరోవైపు పొట్టి శ్రీరాములకు సరైన గుర్తింపు లభించలేదని తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ అడ్వైజరీ బోర్డు మెంబర్ శశికళ అభిప్రాయపడ్డారు.

''పొట్టి శ్రీరాములుకు సరైన గుర్తింపు లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి రాష్ట్రం ఎంత మెచ్చుకుంటుంది. కానీ, పొట్టి శ్రీరాములు గారిని అమరజీవిగా గుర్తించారు తప్ప ఈరోజు వరకు ఏ రాష్ట్రమూ సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. పొట్టి శ్రీరాములుకి జాతీయస్థాయిలో గుర్తింపు రావాలని ఆర్యవైశ్యులుగా మేమంతా కోరుకుంటున్నాం’’అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Immortal' Potti Sriramulu: How does the building where he went on hunger strike look like now?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X