• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘చైనాలో నా శరీరం నుంచి 15 తూటాలు బయటకు తీశారు.. భారత్ వచ్చాక 16వ తూటా తీశారు’

By BBC News తెలుగు
|

భారత్ యుద్ధ ఖైదీలు

కొండల్లో రెండు రోజులపాటు నడిచిన తర్వాత బ్రిగేడియర్ పరశురామ్ జాన్ దల్వి ఓ సువిశాల ప్రాంగణాన్ని చూశారు. ఆయన వెనుక ఏడుగురు ఉన్నారు. అందరికీ ఆయన దారిచూపుతూ ముందుకు వెళ్తున్నారు.

ఒక సన్నని మార్గంలోకి ప్రవేశించిన వెంటనే ఆయనకు చైనా సైన్యం ఎదురైంది. అదే సమయంలో ఆయనవైపు గురిపెట్టిన పదులకొద్దీ తుపాకులూ కనిపించాయి.

అప్పుడు, దల్వీ తన చేతి గడియారాన్ని చూసుకున్నారు.. సరిగ్గా ఉదయం 9.22 గంటలు అయ్యింది. ఆ రోజు 1962 అక్టోబరు 22.

దల్వీని, ఆయనతో వచ్చిన ఏడుగురినీ చైనా సైన్యం బందీలుగా తీసుకుంది. ముఖంపై మశూచి మచ్చలు కనిపిస్తున్న చైనా కెప్టెన్ దయపై వారు బతుకున్నట్టు అనిపించింది.

''హిమాలయన్ బ్లండర్'' పుస్తకంలో బ్రిగేడియర్ దల్వీ ఈ విషయాలను రాసుకొచ్చారు.

''66 గంటల నుంచీ ఏమీ తినలేదు. సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తు నుంచి 18,500 అడుగుల ఎత్తుకు వెళ్లాం. మళ్లీ ఒక ప్రవాహంలా 10,500 అడుగుల కంటే కిందకు వచ్చాం. నేను అలసిపోయాను. చాలా ఆకలివేసింది. గడ్డం కూడా విపరీతంగా పెరిగింది. ముళ్ల చెట్ల మధ్య నడవడంతో నా బట్టలు బాగా చిరిగిపోయాయి''.

ఆయన్ను విడిగా..

బ్రిగేడియర్ దల్వీని టిబెట్‌లో సెథాంగ్ శిబిరంలో ఇతర భారత సైనికుల నుంచి విడిగా ఉంచారు. కవిత్వంపై ఎంతో ఆసక్తి ఉండే ఆయన కొన్ని రోజులపాటు కుంగుబాటుతో గడపాల్సి వచ్చింది.

యుద్ధ ఖైదీలతో చైనా సైనికులు కొన్నిసార్లు టేబుల్ టెన్నిస్, మరికొన్ని సార్లు కార్డ్స్ ఆడేవారు.

వారెవరి దగ్గరా ఇంగ్లిష్ పుస్తకాలు కనిపించలేదు. కొన్ని వారాల తర్వాత దల్వీకి ఓ పెన్ను, పేపర్లు ఇచ్చారు.

''ఆ పేపర్లపై మా నాన్న తను చదివిన పుస్తకాల పేర్లు రాసేవారు. అతనికి గుర్తున్న హీరోలు, హీరోయిన్ల పేర్లు కూడా రాసేవారు. ప్రతివారం చైనీస్ కమిషనర్ వచ్చి.. ఆ పేపర్లను చించేసేవారు''అని దల్వీ కుమారుడు మైఖెల్ దల్వీ వివరించారు.

రోజూ రెండు పుటలా తినడానికి బంగాళ దుంపలు ఇచ్చేవారు. క్రిస్మస్ రోజు మాత్రం తినడానికి చికెన్ పెట్టారు. చైనా సైనికులతో కలిసి వారు దాన్ని తిన్నారు. వారి జుట్టును నెలకు ఒకసారి కత్తిరించేవారు. గడ్డం మాత్రం షేవ్ చేయించేవారు. వారు గడ్డం వారు గీసుకోవడానికి కూడా చైనా సైనికులు అనుమతించేవారు కాదు. 1963 ఏప్రిల్‌లో యుద్ధ ఖైదీలుగా వీరందరినీ బీజింగ్‌కు తరలించారు.

యుద్ధ ఖైదీలందరి చేతులకూ సంకెళ్లు వేసి మే డే పరేడ్‌లో ప్రదర్శించాలని చైనా ప్రభుత్వం భావించింది.

అయితే బ్రిగేడియర్ దల్వీ తీవ్రంగా వ్యతిరేకించడంతో చైనా సైనికులు ఈ ఆలోచనను విరమించుకున్నారు.

కల్నల్ తివారీ ప్రతిఘటన

కల్నల్ తివారీ.. బ్రిగేడియర్ దల్వీ అంత అదృష్టవంతుడు కాదు. మేజర్ జనరల్‌గా పనిచేసిన ఆయన మరణానికి ముందు పాండిచ్చేరి హౌస్‌లో ఆనాటి పరిస్థితులను వివరించారు.

''వ‌చ్చీరాని ఇంగ్లిష్ మాట్లాడ‌గ‌లిగే ఓ సైన్యాధికారి నా ర్యాంకును చూసి.. చాలా అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించాడు. నా ప‌క్క‌నే ఓ గూర్ఖా సైనికుడు ప‌డున్నాడు. అత‌డు నా వైపుచూసి న‌న్ను గుర్తుపట్టి.. సాబ్ పానీ అంటూ కొంచెం నీళ్లు ఇవ్వ‌మ‌ని అడిగాడు.

అత‌డికి సాయం చేసేందుకు నేను ముందుకు దూకాను. అయితే చైనా కెప్టెన్ న‌న్ను కొట్టి.. వ‌చ్చీరాని ఇంగ్లిష్‌లో తిట్టాడు.

'స్టుపిడ్ క‌ల్న‌ల్ కూర్చో.. నువ్వు యుద్ధ‌ఖైదీవి నేను చెప్పేవ‌ర‌కూ క‌ద‌లొద్దు. క‌దిలితే కాల్చేస్తా'అని అరిచాడు.

ఆ త‌ర్వాత నామ్కా చూ న‌ది వైపుగా మ‌మ్మ‌ల్ని తీసుకెళ్లారు. మొద‌టి మూడు రోజులు మాకు తిన‌డానికి ఏమీ ఇవ్వ‌లేదు. త‌ర్వాత ఉడ‌క‌బెట్టిన ఉప్పుడు బియ్యం, వేయించిన ముల్లంగి దుంప‌లు ఇచ్చారు''.

గడ్డే పరుపుగా..

''అక్టోబ‌రు 26న మేం చెన్ యె యుద్ధ‌ఖైదీల శిబిరానికి వ‌చ్చాం. మొద‌టి రెండు రోజులు మ‌మ్మ‌ల్ని చీక‌టి గ‌దిలో ఒంట‌రిగా ఉంచారు. త‌ర్వాత తీవ్రంగా గాయ‌ప‌డ్డ క‌ల్న‌ల్ రీఖ్‌ను కూడా నా గ‌దిలోకి తీసుకువ‌చ్చారు.

అల్పాహారం ఉద‌యం 7 నుంచి 7.30 మధ్య పెట్టేవారు. మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యం ప‌ది నుంచి 11 వ‌ర‌కు. రాత్రి భోజ‌నం మాత్రం సాయంత్రం మూడు నుంచి మూడ‌న్న‌ర మ‌ధ్య‌లో ఉండేది.

మేం ఉంటున్న గ‌దుల‌కు త‌లుపులు, కిటికీలు లేవు. బ‌హుశా చైనా సైనికులు వీటిని వంట చెర‌కుగా ఉప‌యోగించి ఉండొచ్చు. నేను గ‌దిలోనే ఎక్కువ స‌మ‌యం గ‌డిపేవాణ్ని.

మొద‌టి రెండు రాత్రులూ చ‌లిలో వ‌ణికిపోయాం. మ‌మ్మ‌ల్ని తీసుకొచ్చేట‌ప్పుడు ఒక గ‌డ్డిమోపు క‌నిపించింది. దీన్ని వాడుకోవ‌చ్చా? అని చైనా సైనికుల్ని అడిగితే.. స‌రేన‌న్నారు. ఆ గ‌డ్డి మోపును దుప్ప‌టిగా, ప‌రుపుగా వాడుకున్నాం.

లతా మంగేష్కర్ పాటలు

చైనా జైళ్లలో నాటి పరిస్థితులను మేజర్ తివారీ గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పారు. ''కొన్నిసార్లు చైనా సైనికులు భార‌త పాట‌లు పెట్టేవారు. 'ఆజా రే మే తో క‌బ్ సే ఖ‌డీ ఇస్ పార్' అంటూ ల‌తా మంగేష్క‌ర్ పాట‌ను ప‌దేపదే వినిపించేవారు. అది విన్న‌ప్పుడ‌ల్లా మా ఇల్లు గుర్తొచ్చేది. ఒక‌రోజు బ‌హ‌దూర్ షా జఫ‌ర్ గ‌జ‌ల్స్‌ను ఓ చైనా మ‌హిళ పాడిన‌ప్పుడు చాలా ఆశ్చ‌ర్యంగా అనిపించింది.

దిల్లీ నుంచి రంగూన్‌కు తీసుకెళ్లాక జఫ‌ర్ రాసిన పాట‌ల‌ను నాతో ఉండే ర‌త‌న్‌, ఆమె క‌లిసి పాడేవారు. ఉర్దూ మాట్లాడే ఆమె బ‌హుశా ల‌ఖ్‌న‌వూలో చాలా ఏళ్లు ఉండి ఉండొచ్చు''.

భారత్ యుద్ధ ఖైదీలు

1962 యుద్ధ సమయంలో 3942 మంది భారతీయులను యుద్ధ ఖైదీలుగా చైనా తీసుకుంది. అయితే, భారత్‌కు ఒక్క చైనా సైనికుడూ బందీగా దొరకలేదు.

యుద్ధ ఖైదీలపై జెనీవా ఒప్పందంపై 1951లోనే భారత్ సంతకం చేసింది. చైనా మాత్రం జులై 1952లో దీన్ని ఆమోదించింది.

అక్టోబరు 1968లో భారత్-చైనా సరిహద్దు వివాదంపై ఇండియర్ జర్నల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే మ్యాగజైన్‌లో కురుక్షేత్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేంద్ర చోప్రా ఓ ఆర్టికల్ రాశారు.

''సైనో ఇండియన్ బోర్డర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ద ట్రీట్‌మెంట్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్'' పేరుతో ఈ కథనం ప్రచురితమైంది. దీనిలో చైనాకు చిక్కిన ఓ భారత యుద్ధ ఖైదీ తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.

''నన్ను అరెస్టు చేసిన రోజు.. నాతోపాటు 15 నుంచి 16 మంది గాయపడిన భారత సైనికులు ఉన్నారు. వారికి తక్షణమే వైద్య సాయం అవసరం. వారు నొప్పితో అరిచేవారు. కానీ వారిని చైనా సైనికులు పట్టించుకోలేదు. 48 గంటలపాటు తినడానికి ఏమీ ఇవ్వలేదు. తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు. ఇది జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 12 నుంచి 15 వరకు నిబంధనలను ఉల్లంఘించడమే''

అదనపు సమాచారాన్ని కోరిన చైనా

ఇది మాత్రమే కాదు. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్-17 ప్రకారం.. కేవలం పేరు, రెజిమెంట్ నంబరు, హోదా, పుట్టిన తేదీలను మాత్రమే యుద్ధ ఖైదీలను అడగొచ్చు. కానీ చైనా సైనికులు చాలా ప్రశ్నలు అడిగారు. వీటిలో ఇవి కూడా ఉన్నాయి..

  1. మీ పేరిట ఎంత భూమి ఉంది?
  2. మీకు ఎన్ని సొంత ఇళ్లు ఉన్నాయి?
  3. మీ వార్షిక ఆదాయం ఎంత?
  4. ఏ రాజకీయ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు?
  5. మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు?
  6. ఎన్ని దేశాలను మీరు సందర్శించారు?

భారత సైనికులు ఇలా సమాచారాన్ని సేకరించడంపై వ్యతిరేకత వ్యక్తంచేసినప్పటికీ.. తమ ప్రభుత్వమే తమను ఇలాంటి ప్రశ్నలు అడగమని చైనా సైనికులు చెప్పినట్లు సురేంద్ర చోప్రా వివరించారు.

సైనికుల మోహరింపులు, వారి ఆయుధాలు, వారి అధికారుల వివరాల కూడా చైనా సైనికులు అడిగారు. ఇవన్నీ జెనీవా ఒప్పందం ఉల్లంఘనలే అవుతాయి.

భారత్ యుద్ధ ఖైదీలు

అధికారులను అవమానించాలని ఒత్తిడి

జెనీవా ఒప్పందంలోని 11వ ఆర్టికల్ ప్రకారం.. ఖైదీలందరికీ వారి సొంత దేశంలో పెట్టే మోతాదులోనే భోజనం పెట్టాలి. కానీ భారత ఖైదీలకు 1400 కేలరీల కంటే తక్కువ శక్తినిచ్చే భోజనమే పెట్టేవారు. భారత్‌లో వీరు 2500 కేలరీల శక్తినిచ్చే భోజనం తినేవారు.

అంతేకాదు, సీనియర్ అధికారులను అడుగడుగునా అవమానించేవారు.

''మీరు ఇకపై అధికారులు కాదని చైనా సైనికులు పదేపదే అనేవారు. మీ అధికారులకు ఇక సలాం కొట్టాల్సిన పనిలేదని తోటి జవాన్లకు చెప్పేవారు. అయితే, చైనా అధికారులకు గౌరవం ఇవ్వాలని సూచించేవారు. ఎప్పుడైనా మా సైనికులు మాకు సలాం కొడితే.. చైనా సైనికులు కోపగించుకునేవారు. మీకూ వారికీ ఏమీ తేడాలేదని చెప్పేవారు. అందరూ ఖైదీలేనని అనేవారు.

సైనికుల మధ్య గొడవలు పెట్టడమే లక్ష్యంగా వారు ఇలాంటి పనులు చేసేవారు. మా సైనికుల ముందే.. అధికారులతో రేషన్ సరకులు, నీళ్లు మోయించేవారు. పరిసరాలనూ శుభ్రం చేయించేవారు. కొందరు జవాన్లు అయితే ప్రభావితం కూడా అయ్యేవారు''అని ఓ సీనియర్ అధికారి వివరించారు.

భారత్ యుద్ధ ఖైదీలు

రక్తంతో తడిసిన కట్లే మళ్లీ కట్టుకోవాల్సి వచ్చింది

రెండో రాజ్‌పుత్ యూనిట్‌కు చెందిన మేజర్ ఓంకార్ నాథ్ దూబేకు నామ్‌కా చూ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 16 తూటాలు తగిలాయి.

ఆయన్ను చైనా సైనికులు బందీగా తీసుకున్నారు. ఆయనతో కలిసి 70 మంది జవాన్లు పోరాడారు. అయితే, వారిలో ముగ్గురు మాత్రమే బతికి బయటపడి పట్టుబడ్డారు.

వారణాసికి చెందిన ఆయన్ను టిబెట్‌లోని లాసా సమీపంలోని మర్మోంగ్ శిబిరంలో ఉంచారు.

''పాడుబడిన ఇళ్లను అక్కడ ఆసుపత్రిగా మార్చారు. అది పేరుకు మాత్రమే ఆసుపత్రి. అక్కడ ఎక్స్‌రే తీయడానికి కూడా పరికరాలు లేవు.

అక్కడే నా శరీరం నుంచి 15 తూటాలను బయటకు తీశారు. జనవరి 1963న భారత్‌కు తిరిగివచ్చినప్పుడు ఆ 16వ తూటాను భారత సైన్యంలోని వైద్యులు తీశారు.

చైనాలో నాకు కట్టిన కట్లను మళ్లీ వేడి నీళ్లలో పెట్టి కట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వారి దగ్గర కొత్త బ్యాండేజీలు కూడా ఉండేవి కాదు''అని అప్పటి పరిస్థితులను ఆయన గుర్తుచేసుకున్నారు.

''మేం పడుకోవడానికి ఒక పలుచని పరుపు, చాప ఇచ్చారు. దుప్పట్లు చాలా మురికిగా ఉండేవి. ఒక దుప్పటినే చాలా మంది కప్పుకోవాల్సి ఉండేది. మంచి భోజనమూ ఉండేది కాదు. అన్నంతోపాటు అక్కడ దొరికే ఓ గడ్డితో కూరచేసి పెట్టేవారు''.

''గూర్ఖా సైనికులను కొంచెం మెరుగ్గా చూసుకునేవారు. మమ్మల్ని మాత్రం చాలా అవమానించేవారు. వారికి మంచి భోజనం ఇచ్చేవారు''

''నేపాలీ, చీనీ భాయీభాయీ అని వారితో చెప్పేవారు. గూర్ఖా బందీలను నేరుగా నేపాల్‌కు పంపించేవారు. అయితే వారిని తీసుకునేందుకు నేపాల్ వ్యతిరేకించేది''

హిందీ, చీనీ భాయీ భాయీ పాట

బ్రిగేడియర్ అమర్‌జీత్ బల్.. 1962లో సెకెండ్ లెఫ్టినెంట్‌గా పనిచేశారు.

''మా తూటాలన్నీ అయిపోయాయి. దీంతో మేం యుద్ధ ఖైదీలుగా మారాల్సి వచ్చింది. చైనా సైనికులు నా తలపై తుపాకీ వెనుక భాగంతో కొట్టారు. నా తుపాకీని లాగేసుకున్నారు. ఆ తర్వాత నన్ను ఈ యుద్ధ ఖైదీల శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 500 మంది యుద్ధ ఖైదీలు ఉన్నారు. భారతీయ సైనికులే మా భోజనం తయారుచేసేవారు. దీంతో నాకు కొంత మంచిదైంది. రోజూ ఉదయం నాకు బ్లాక్‌ టీ వచ్చేది. రెండు భోజనాల్లోనూ రోటీ, అన్నం, ముల్లంగి కూర మాత్రమే ఇచ్చేవారు. అక్కడ గూంజ్ రహా హై సారే ఓర్.. హిందీ, చీనీ భాయీభాయీ పాట వినిపించేది. దాన్ని వినీవినీ మా చెవులు విసుగెత్తిపోయాయి''.

జవాన్లతో బ్రిగేడియర్ అమర్‌జీత్ బల్

''యుద్ధ ఖైదీలుగా తీసుకున్నవారిని కొట్టేవారు కూడా. నాకు కూడా అలానే జరిగింది. కానీ నేను ఓ సైనికుణ్ని మాత్రమే కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు''.

''చైనా సైన్యాధికారులు అనువాదకుల సాయంతో భారతీయ యుద్ధ ఖైదీలతో మాట్లాడేవారు. అమెరికాకు భారత్ కీలుబొమ్మ లాంటిదని వారు వ్యాఖ్యానించేవారు. అయితే, ఆ వ్యాఖ్యలు మాపై ఎలాంటి ప్రభావం చూపలేదు''.

చివరగా ఒక రోజు, బల్‌తోపాటు అతడి సహచరులనూ వదిలిపెట్టే సమయం వచ్చింది.

అమర్‌జీత్ బాల్

''ఆ విషయం విని మేమెంతో సంతోషపడ్డాం. ఆ తర్వాత 20 రోజులు 20 నెలల్లా గడిచాయి. సరిహద్దులు దాటిన వెంటనే.. మాతృభూమిని ముద్దుపెట్టుకున్నాం. మాతృభూమి దేవత లాంటిది అంటూ పాట పాడుకున్నాం''అని బల్ వివరించారు.

ఈ విషయాలు చెప్పేటప్పుడు బల్ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన గొంతు చెమర్చింది. భారత్‌కు వచ్చాక ప్రపంచంలోనే అత్యుత్తమ టీ దొరికిందని అన్నారు. ఇందులో పాలున్నాయి, చక్కెరా ఉందనీ, అది అమృతంలా అనిపించిందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
‘In China 15 bullets were taken out of my body,16th bullet was taken when I came to India’ said Brigadier Dalwi.''అన్నంతోపాటు అక్కడ దొరికే ఓ గడ్డితో కూరచేసి పెట్టేవారు. మేం పడుకోవడానికి ఒక పలచని పరుపు, చాప ఇచ్చారు. దుప్పట్లు చాలా మురికిగా ఉండేవి. ఒకే దుప్పటిని చాలామంది కప్పుకోవాల్సి ఉండేది. మంచి భోజనమూ ఉండేది కాదు ''
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X