జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్: కుక్క వింతప్రవర్తన, కుక్కకు జీపీఎస్ ట్రాకర్ తో సెర్చ్
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి పామాయిల్ తోటలో తోట కాపలాదారులుగా పని చేస్తున్న సుంకర గణేష్, భవాని దంపతుల కుమార్తె రెండేళ్ల జ్ఞానేశ్వరి (జానూ) ఈ నెల 6వ తేదీన అదృశ్యమైంది. ఆరు రోజులు గడిచినా చిన్నారి జాడ తెలియకపోవడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఆరు రోజులుగా కనిపించని చిన్నారి జానూ జాడ
శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి తప్పిపోయిన జ్ఞానేశ్వరిని వెతికేందుకు అదే రాత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నుంచి సుమారు 200 మంది పోలీసు సిబ్బంది యాభై ఎకరాల పామాయిల్ తోట, చుట్టుపక్కల వందల ఎకరాల కొండ ప్రాంతాలను అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు దొరకలేదు.చిన్నారితో పాటు వారి పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది.

జీపీఎస్ ట్రాకర్ తెప్పించి కుక్కపై అమర్చి ట్రాక్ చేసే ప్లాన్
మంగళవారం మధ్యాహ్నం ఆ కుక్క ఇంటి వద్దకు తిరిగి వచ్చినప్పటికీ మళ్లీ వెళ్లిపోయింది. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ యువకులు కష్టపడి దాన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం బోనులో ఉంచి మచ్చిక చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకోవాలని పోలీసులు ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకర్ తెప్పించి కుక్కపై అమర్చి దాని కదలికలను ట్రాక్ చేసి చిన్నారి ఎక్కడికి వెళ్లిందో కనుగొనాలని ప్రణాళిక వేశారు.
వింతగా కుక్క ప్రవర్తన, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి మాట్లాడుతూ, "ప్రస్తుతం కుక్క ప్రవర్తన చాలా వింతగా ఉంది. దాని కదలికలను జీపీఎస్ సాయంతో నిశితంగా పర్యవేక్షించి చిన్నారి ఆచూకీ కోసం మరింత సమర్థవంతంగా గాలింపు చర్యలు చేపడతాం" అని తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 37 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫోన్ టవర్ లొకేషన్లు, సమీపంలోని బావులు, చెరువులు, నేల ప్రాంతాలు తనిఖీ చేశారు.
చిన్నారిని ఎవరైనా అపహరించి ఉంటారా? కోణంలో దర్యాప్తు
తోటలో ఇనుప కంచె వద్ద చిన్నారి మరియు కుక్క వెంట్రుకలు దొరికాయని భవాని తెలిపారు. వాటిని సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. శనివారం సాయంత్రం వర్షం పడటంతో మట్టి జారడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. చిన్నారిని ఎవరైనా అపహరించి ఉంటారా అనే అనుమానంతో కూడా విచారణ సాగుతోంది. గతంలో కారు సంబంధిత గొడవలు జరిగినట్లు భవాని పోలీసులకు చెప్పారు. ఆ సందర్భంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
నువ్వైనా మా జానూ ఆచూకీ చూపించమ్మా..పెంపుడు కుక్క వద్ద విలపించిన తల్లి
తల్లి భవాని పెంపుడు కుక్క వద్ద "నువ్వైనా మా జానూ ఆచూకీ చూపించమ్మా" అంటూ విలపించడం హృదయాన్ని కలచివేస్తోంది. పోలీసులు తమ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్ద చేర్చాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ కేసు సంబంధించి ఏవైనా సమాచారం ఉన్నవారు సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.













Click it and Unblock the Notifications