సంచలనం: కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!
న్యూఢిల్లీ: కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ప్రాణాంతక వ్యాధులతో దీర్ఘకాలం బాధపడుతూ ఇక కోలుకోలేని వారికి కారుణ్య మరణాన్ని(పాసివ్ యుతనేసియా) అనుమతించింది. గౌరవంగా మరణించే హక్కు మానవులకు ఉందని పేర్కొంటూ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను వెలువరించింది.
వైద్యంతో నయం కాని రోగాలతో బాధపడే రోగులకు ఆ బాధల నుంచి విముక్తి కల్పించేందుకు పరోక్ష కారుణ్య మరణాలను ప్రసాదించాలని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇందుకు లివింగ్ విల్ (సజీవ వీలునామా)ను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌పై గతేడాది అక్టోబరు 11నే వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం దీనిపై తీర్పును వెల్లడించింది. అయితే కారుణ్య మరణాలను అమలుచేయడానికి కొన్ని మార్గదర్శకాలను తయారుచేసింది. సజీవ వీలునామాను పరిగణనలోకి తీసుకోవచ్చని అయితే అందుకు సదరు రోగుల కుటుంబసభ్యుల నుంచి అనుమతి ఉండాలని పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులు సభ్యులుగా కూడిన రాజ్యాంగ ధర్మాసనం లివింగ్ విల్, పాసివ్ యుతనేసియాపై తీర్పును ప్రకటించింది. రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వ్యాధి నయం కాదని చట్టబద్ధ మెడికల్ బోర్డు ప్రకటించిన అనంతరమే లైఫ్ సపోర్ట్ వ్యవస్థను తొలగించాలని ధర్మాసనం పేర్కొంది.
నయం కాని కోమాలోకి వెళితే తమను లైఫ్ సపోర్ట్ మీద ఉంచొద్దని చెబుతూ రోగులు ముందే 'లివింగ్ విల్' కూడా రాసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఓ వ్యక్తి కోమాలోకి వెళ్లే పరిస్థితి ఉంటే... భవిష్యత్‌లో వైద్య చికిత్స జరగాల్సిన తీరు, జీవించడంపై ముందుగానే లిఖిత పూర్వకంగా ఇచ్చే వీలునామానే లివింగ్ విల్ అంటారు.
కారుణ్య మరణం విషయంలో న్యాయమూర్తులు నాలుగు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించినప్పటికీ.. లివింగ్ విల్ పై మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చారు.
జీవించడం ఇష్టం లేకపోయినప్పటికీ ఓ వ్యక్తి అచేతన స్థితిలోనే బాధపడుతూ ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. సజీవ వీలునామాను తీసుకుని రోగి కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు హైకోర్టుకు వెళితే.. పరోక్ష కారుణ్యం అవసరమో లేదో నిర్ణయించేందుకు ఆ న్యాయస్థానం మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపింది.












Click it and Unblock the Notifications