వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారణాసిలో కళ్లముందే చనిపోయిన కొడుకు శవంతో సాయం కోసం తల్లడిల్లిన తల్లి కథ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వారణాసిలోని ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఒక ఈ-రిక్షాలో కూర్చున్న తల్లి, ఆమె కాళ్ల దగ్గర నిర్జీవంగా పడి ఉన్న కొడుకు కనిపిస్తుంటారు.

ఆ ఫొటో నిజంగానే కదిలించేలా దయనీయంగా ఉండడం, అది ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంలో జరిగింది కావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయ్యింది.

ఈ తల్లి మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అందులో ఆమె సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేసేందుకు తన కొడుకు ఫోన్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించడం కనిపిస్తోంది.

ఆ తల్లి పేరు చంద్రకళా సింగ్, ఈమెది వారణాసి పక్కనే ఉన్న జౌన్‌పూర్‌ దగ్గరున్న అహిరౌలీ(శీతల్‌గంజ్). ఆమె సోమవారం తన 29 ఏళ్ల కొడుకు వినీత్ సింగ్‌ను వైద్యం కోసం వారణాసి హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఆస్పత్రికి తీసుకొచ్చారు.

వినీత్ ముంబయిలో ఒక మెడికల్ షాపులో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. కరోనా రావడంతో అతడి ఉద్యోగం పోయింది. దాంతో, తిరిగి తన సొంత ఊరు వచ్చేశాడు.

బీహెచ్‌యూ ఆస్పత్రిలో వినీత్‌ను అడ్మిట్ చేసుకోలేదు. ఆ తర్వాత కొడుకును ఈ-రిక్షాలో తీసుకెళ్లిన ఆ తల్లి దగ్గర్లో ఉన్న మరికొన్ని ఆస్పత్రుల్లో కూడా చేర్పించడానికి ప్రయత్నించారు.

కానీ, ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. తర్వాత కొన్ని గంటల్లోనే అదే ఈ-రిక్షాలో వినీత్ గిలగిల్లాడుతూ తల్లి కళ్ల ముందే ప్రాణాలు వదిలాడు.

ఎదిగిన కొడుకు అకాల మరణంతో కుంగిపోయిన చంద్రకళా సింగ్. అతడి ప్రాణాలు నిలబెట్టడానికి ఎవరూ సాయం చేయకపోవడం తలుచుకుని కన్నీళ్లు పెట్టారు.

"మేం బీహెచ్‌యూ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ డాక్టర్ రాలేదు, మీరు ట్రామా సెంటర్‌కు వెళ్లండి అన్నారు. అక్కడే నా కొడుకు పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడే మెట్ల దగ్గర నిలబడలేక కింద పడుకున్నాడు. కానీ, ఆస్పత్రిలో వాళ్లు తనకు కరోనా ఉంది ఇక్కడ్నుంచి తీసుకెళ్లిపో అని అరవడం మొదలెట్టారు" అని చెప్పారు.

"నా బిడ్డకు శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఆక్సిజన్ పెట్టండి అని నేను వాళ్లను అడిగా. అంబులెన్స్ అయినా ఇవ్వమన్నా. కానీ అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత నేను ఎలాగోలా తనను ఈ-రిక్షాలో పడుకోబెట్టుకుని వేరే ఆస్పత్రికి వెళ్లా. అక్కడ కూడా చేర్పుచోకమని చప్పేశారు. తర్వాత ఇంకో ఆస్పత్రికి వెళ్లాలనుకున్నా. ఆలోపే నా కొడుకు నాకు లేకుండా పోయాడు. ఊపిరాడక గిలగిల్లాడుతూ చనిపోయాడు" అన్నారు.

చంద్రకళా సింగ్‌ అప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. పదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయారు. గత ఏడాది వినీత్ కంటే పెద్దవాడైన కొడుకు చనిపోయాడు. వరసగా రెండేళ్లలో చేతికొచ్చిన ఇద్దరు కొడుకులను పోగొట్టుకోవడంతో ఆమె పూర్తిగా కుంగిపోయారు. చంద్రకళా సింగ్‌కు మరో ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.

కానీ, "మాకు అండగా నిలిచేవారే లేకుండాపోయారు. మమ్మల్ని ఇప్పుడు చూసుకునేవారే లేరు" అంటూ ఆమె కన్నీళ్లు పెట్టారు.

వినీత్ మరణానికి కారణం

వినీత్ సింగ్‌కు కరోనా ఉన్నట్లు ఎవరూ ధ్రువీకరించలేదు. అతడికి అంతకు ముందు జ్వరం, జలుబు లాంటి లక్షణాలు కూడా ఏవీ లేవని వినీత్ కుటుంబ సభ్యులు చెప్పారు.

"వినీత్‌కు కరోనా లక్షణాలేవీ లేవు. జ్వరం కూడా రాలేదు. తనకు కిడ్నీకి సంబంధించిన సమస్య మాత్రం ఉంది. తను పనిచేసే ముంబయిలోనే దానికి వైద్యం చేయించుకుంటున్నాడు. ఆ చికిత్స కోసం తను ఈ మధ్య అంతా బీహెచ్‌యూకు వెళ్లొస్తుండేవాడు" అని వినీత్ చిన్నాన్న జయసింగ్ చెప్పారు.

"ఏప్రిల్ 19న వినీత్ ఆన్‌లైన్లో డాక్టర్ సమీర్ త్రివేదీ అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. కానీ అక్కడ తనకు చికిత్స చేయలేదు. ట్రామా సెంటర్ దగ్గర ఏ సాయం దొరకలేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పడకలు లేవని బయటనుంచే చెప్పేశారు. ఇది కరోనా కేసని కూడా అన్నారు. తనకు కిడ్నీ సమస్య ఉంది. సరైన సమయంలో చికిత్స చేసుంటే, ఆక్సిజన్ అందుంటే తను చనిపోయేవాడు కాదు" అన్నారు.

ఒక మనషి ప్రాణాలే పోయేలా చేశారు. ఇంత కంటే నిర్లక్ష్యం ఏముంటుంది. వ్యవస్థ ఎలా ఉందంటే, ఇక్కడ, పేదలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. వ్యవస్థ ఇలా నిర్లక్ష్యం చూపడం వల్ల చాలా మంది ప్రాణాలు పోవచ్చు" అంటారు జయసింగ్.

తన కష్టాన్ని, తన కొడుకు చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి మొట్టమొదట దైనిక్ జాగరణ్ ప్రచురించిన వార్తతో తెలిసిందని చంద్రకళా సింగ్ చెప్పారు. ఆ వార్తను శ్రవణ్ భరద్వాజ్ రాశారు.

"ఉదయం సుమారు 10 గంటలకు కకర్‌మత్తా-మహమూర్‌గంజ్ రోడ్‌లో ఒకరు చనిపోయారని, అక్కడ కలకలంగా ఉందని నాకు సమాచారం వచ్చింది. నేను అక్కడకు వెళ్లి ఏం జరిగిందో తల్లిని అడిగి ఆ వార్త రాశాను" అని ఆయన చెప్పారు.

వినీత్ చనిపోయిన అదే రోడ్డులో బీహెచ్‌యూతోపాటూ డజను ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయని, దానిని బట్టి కరోనాతో ఆస్పత్రుల్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అంచనా వేయవచ్చని అని శ్రవణ్ భరద్వాజ్ చెప్పారు.

కరోనాతో తరలి వెళ్తున్న కుటుంబాలు

ఆ వైరల్ ఫొటో తీసింది ఎవరు

వైరల్ అవుతున్న చంద్రకళా సింగ్, ఆమె కొడుకు ఫొటోను ఎవరు తీశారు. అది కూడా శ్రవణ్ చెప్పారు.

"నేను నా ఫ్రెండ్‌తో అక్కడకెళ్లాను. మీరు ఫొటో తీయండని ఆయన్ను అడిగాను. కానీ అతడు ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల మేం ఆయన పేరు బయటపెట్టలేదు" అన్నారు.

"నేను శ్రవణ్ చెప్పడంతో ఆ ఫొటో తీశాను. దానిని అప్పుడే శ్రవణ్‌కు పంపేశాను" అని ఫొటో తీసిన ఆ ప్రభుత్వ ఉద్యోకి కూడా బీబీసీతో చెప్పారు.

వినీత్ ఉదయం 9 గంటల సమయంలో చనిపోయినట్లు అతడి తల్లి చంద్రకళా సింగ్ చెప్పారు.

పదిన్నర సమయంలో తను అక్కడకు చేరుకున్నప్పుడు, అప్పటికే చాలా మంది జనం గుమిగూడి ఉన్నారని శ్రవణ్ భరద్వాజ్ తెలిపారు.

" అప్పుడు అక్కడున్న వేరే ఎవరైనా తమ మొబైల్‌ వేరే ఫొటోలు తీసుండచ్చు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తతో ఉన్న ఫొటో మాత్రం నా ఫ్రెండ్ తీసిందే" అన్నారు.

తన కొడుకు శవంతో చంద్రకళ సింగ్ సాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు అక్కడికి మాజీ స్థానిక కౌన్సిలర్ వికాస్ చంద్ర కూడా చేరుకున్నారు. 112కు ఫోన్ చేసిన ఆయన సాయం కోసం స్థానిక పోలీసులను పిలిపించారు.

"యువకుడు అప్పటికే చనిపోయాడు. అతడి తల్లి పరిస్థితి చూసి మేం ఇద్దరు కానిస్టేబుళ్లను అక్కడే ఉండమని చెప్పాం" అని స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనుజ్ కుమార్ తివారీ చెప్పారు.

కరోనాతో తరలి వెళ్తున్న కుటుంబాలు

శవం తీసుకెళ్లడానికి అంబులెన్స్ కూడా కష్టమే

వినీత్ సింగ్ చనిపోయాక అతడి శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ దొరకడం చాల సమస్యగా మారిందని ఆరోజు ఉదయం వాళ్లను వారణాసి మండువాడీహ్ స్టేషన్లో వదిలి వెళ్లిన మరిది జయసింగ్ చెప్పారు.

"నేను నా కూతురిని స్టేషన్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు, వాళ్లు కూడా నాతోపాటూ వచ్చారు. నేను వాళ్లను మండువాడీహ్ స్టేషన్ దగ్గర ఈ రిక్షాలో కూర్చోబెట్టి, డాక్టర్ చూపించు, ఆలోపు నేను దిల్లీ నుంచి వచ్చే అమ్మాయిని తీసుకొస్తా అన్నాను. తర్వాత 9.30కు నాకు వాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. దాంతో అక్కడికి చేరుకున్నాను" అని జయసింగ్ తెలిపారు.

"అక్కడికి చేరుకోగానే చాలా జనం గుమిగూడి ఉండడం కనిపించింది. అబ్బాయి శవం ఎండలో ఉంది. మేం రిక్షా అబ్బాయితో నీడలోకి తీసుకెళ్లమని చెప్పాం. తల్లి రిక్షాలోనే ఏడుస్తోంది. తర్వాత అంబులెన్స్ కోసం ప్రయత్నించాం. చాలా మందికి పోన్ చేశాం. ఒకరు 22 వేలు అడిగారు. చివరికి 60 కిలోమీటర్ల దూరానికి ఐదు వేలు ఇచ్చేలా అంబులెన్స్ దొరకడంతో వినీత్ శవంతో ఇల్లు చేరుకున్నాం" అన్నారు.

వలస కూలీలు

బీహెచ్‌యూ అధికారులు ఏమంటున్నారు

కరోనా సంక్షోభ సమయంలో వారణాసిలోని బీహెచ్‌యూ ఆస్పత్రిపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. పూర్వాంచల్‌లోని దాదాపు 40 జిల్లాల రోగులకు బీహెచ్‌యూ సేవలపై చాలా నమ్మకం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆస్పత్రిలో ఏర్పాట్లు కూడా సరిపోవడం లేదు.

"మాపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. అత్యవసర చికిత్సలో రోగులను చూస్తున్నారు. చాలా విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులను కూడా తీసుకొస్తున్నారు. కానీ, మేం అందరినీ కాపాడలేకపోతున్నాం" అని బీహెచ్‌యూ సర్ సుందర్ లాల్ చికిత్సాలయ్ మెడికల్ సూపరింటెండెంట్ శరద్ మాథుర్ చెప్పారు.

ఆస్పత్రిలో వినీత్‌ను ఎందుకు చేర్పించుకోలేదు అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు.

"కరోనాతో మేం కన్సల్టెన్సీ ఆపేశాం. కానీ, ప్రజల కోసం మేం ఆన్‌లైన్ కన్సల్టెన్సీ కొనసాగించాం. అతడికి దాని గురించి తెలిసుండకపోవచ్చు. లేదంటే మొదటే అనారోగ్యానికి గురై, అది తీవ్రం అయ్యాక ఇక్కడికి వచ్చుండవచ్చు. కానీ, ఫిజికల్ కన్సల్టెన్సీ ఆపివేయడంతో ఇక్కడ డాక్టర్లు లేకుండాపోయారు. అత్యవసర చికిత్సలో రోగులను మాత్రమే చూస్తున్నారు" అని శరద్ చెప్పారు.

ఆస్పత్రిలో సమస్యల గురించి చెప్పిన ఆయన "ఇక్కడ మాన్‌ పవర్ చాలా తక్కువగా ఉంది. మా దగ్గర ఎంత మంది ఉన్నారో వారందరికీ మేం డ్యూటీలు వేశాం. ప్రతి రోజూ వందల ప్రాణాలు కాపాడుతున్నాం. కానీ, జనం కూడా చాలా విషమం అయ్యాక ఆస్పత్రికి వస్తున్నారు" అన్నారు.

వారణాసిలో మోదీ

సోషల్ మీడియాలో ప్రశ్నలు

అయితే, చంద్రకళా సింగ్ తన కొడుకు శవంతో ఉన్న ఫొటోను షేర్ చేస్తున్న చాలా మంది నెటిజన్లు వారణాసి ప్రధాని నియోజకవర్గం కావడంతో ఆయనకే ప్రశ్నలు వేస్తున్నారు.

దాంతో జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ విషయంలో చర్యలు తీసుకున్నారు. వినీత్ సింగ్‌కు ఎమర్జెన్సీలో ఎందుకు చేర్చుకోలేదో చెప్పాలంటూ ఆస్పత్రి నిర్వాహకుల నుంచి వివరాలు అడిగారు. దీనిపై బీహెచ్‌యూ నిర్వాహక కమిటీ సమావేశం కూడా జరిగింది.

కానీ, ఆ ఘటన జరిగినప్పుడు సమాజం క్రూరంగా వ్యవహరించడంపై కూడా చర్చ జరుగుతోంది. తల్లి తన కొడుకు శవం తీసుకెళ్లడానిక సాయం కోసం అందరినీ వేడుకుంటున్నప్పుడు, జనంలో ఎవరో ఆమె సంచి దొంగిలించారు. దాంతో, ఆ సంచిలో ఉన్న వినీత్ సింగ్ చికిత్సకు సంబంధించిన పేపర్లు, అతడి మొబైల్ ఫోన్ పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The story of a mother who begs for help with the body of her son who died before her in Varanasi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X