Bypoll Results: ఉపఎన్నికల్లో ఇండియా కూటమి జోరు-ఏకంగా 11 సీట్లలో లీడ్..!
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 13 సీట్లకు ఈ నెలలో జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి పోరుగా మారిన ఈ ఉపఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల జోరు కొనసాగుతోంది. ఏడింట ఐదు రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. సీట్ల పరంగా చూస్తే 13లో ఏకంగా 11 సీట్లలో కూటమి లీడ్ లో ఉంది. దీంతో ఉపఎన్నికలను ఇండియా కూటమి స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..
ఈ నెల 10న పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఒక్కొక్క సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం ప్రారంభమైంది.ఇందులో కాంగ్రెస్ 5 సీట్లలో, తృణమూల్ 4 సీట్లలో, బీజేపీ, జేడీయూ, ఆప్, డీఎంకే తలో సీటులో ఆధిక్యంలో ఉన్నాయి.పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్తలా అసెంబ్లీ సీట్లలో తృణమూల్ ఆధిక్యంలో కొనసాగుతోంది.హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, హమీర్‌పూర్, నలాగర్, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూర్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లో మంగ్లౌర్, బద్రీనాత్ రెండు సీట్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. పంజాబ్ లోని జలంధర్ సీటులోనూ ఇండియా కూటమి పార్టీ ఆప్ గెల్చుకుంది. బీహార్ లోని ఒక్క సీటులో జేడీయూ ఆధిక్యంలో ఉంది. తమిళనాడులోని విక్రవండీ సీటులో డీఎంకే ఆధిక్యం కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్ లోని అమర్వారా సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇదే ఊపు కొనసాగితే ఉపఎన్నికల్లో ఇండియా కూటమి విజయం ఖాయమైనట్లే భావిస్తున్నారు. ఎన్డీయే కేవలం 2 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉంది.












Click it and Unblock the Notifications