మోదీ టిట్ ఫర్ టాట్: కెనడా రాయబారుల బహిష్కరణ
India-Canada Standoff: భారత్- కెనడా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పతాకస్థాయికి చేరుకున్నాయి. ఖలిస్తానీ వేర్పాటువాదుల అంశం దీనికి ప్రధాన కారణం. తొలుత తమ దేశంలో ఉన్న భారత రాయబారులపై కెనడా బహిష్కరణ వేటు వేయగా.. భారత్ కూడా అలాంటి చర్యే తీసుకుంది. భారత్‌లో కెనడా రాయబారులను బహిష్కరించింది.
దీనికి కారణం లేకపోలేదు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని, ఈ కేసు దర్యాప్తులో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రకటించారు. ఈ మేరకు తమ దేశ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పక్కా సమాచారం అందిందని అన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపిస్తోన్నామని చెప్పారు.

ఈ ప్రకటన ఈ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగడానికి కారణమైంది. ఆయన చేసిన ప్రకటనను తోసిపుచ్చింది. అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ట్రూడో చేసిన ప్రకటనతో తాము విభేదిస్తోన్నామని స్పష్టం చేసింది. ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటో తమకు తెలియదని, ఏదేమైనప్పటికీ- ట్రూడో చేసిన ప్రకటన అవాస్తవమని పేర్కొంది.
గత ఏడాది జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్ కెనడాలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గల గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. కెనడాలో ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
ఈ పరిస్థితుల్లో ఈ దర్యాప్తులో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ జోక్యం చేసుకుంటోన్నారంటూ తాజాగా ఆరోపణలు గుప్పించింది కెనడా. ఈ మేరకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కమిషనర్ మైక్ దుహెమె ఓ ప్రకటన చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
దీన్ని భారత్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. తొలుత భారత్‌లో గల కెనడా దౌత్యవేత్తలకు సమన్లను జారీ చేసింది. వారిని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించుకుంది. తన అభ్యంతారాన్ని తెలియజేసింది. సమగ్ర వివరణ కోరింది. వారి నుంచి సంతృప్తికరమైన వివరణ అందకపోవడంతో బహిష్కరించాలని నిర్ణయించింది.
తాత్కాలిక హైకమిషనర్ స్టివర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హైకమిషనర్ ప్యాట్రిక్ హెబెర్ట్, ఫస్ట్ సెక్రెటరీలు మేరీ కేథరిన్ జోలి, ఇయాన్ రాస్ డేవిడ్ ట్రైట్స్, ఆడమ్ జేమ్స్ చుయిప్కా, పౌలా ఒర్జులాను బహిష్కరించింది భారత్. అయిదు రోజుల్లోగా అంటే ఈ నెల 19వ తేదీ నాటికి దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
భారతీయ దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. వారిపై మెపిన ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని కుండబద్దలు కొట్టింది. తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు వివరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications