Chandrayaan 3 Success : చంద్రయాన్ 3 సక్సెస్ పై హర్షాతిరేకాలు-ఇస్రోకు అభినందనల వెల్లువ..
చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధృవంపై ఇవాళ సాయంత్రం అనుకున్న విధంగా అడుగుపెట్టడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇస్రో సాధించిన విజయంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో జనం రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా కోట్లాది సందేశాలు పంపుతున్నారు. భారత్ తొలిసారి విజయవంతంగా చంద్రుడి దక్షిణధృవంపై అడుగుపెట్టడంతో ప్రతీ ఒక్కరూ గర్వంగా ఫీలవుతున్నారు.

చంద్రయాన్ 3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం 40 రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ప్రజలు ఇవాళ ఆ క్షణం వచ్చేసరికి ఉద్వేగంతో టీవీలకు అతుక్కుపోయారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉదయం నుంచే చంద్రయాన్ సక్సెస్ కావాలని కోరుతూ ప్రజలు పూజలు, ప్రార్ధనలు చేశారు. ఇవాళ సాయంత్రం 5.44 నిమిషాలకు ఇస్రో లైవ్ ప్రారంభించడంతో ఇక విక్రమ్ ల్యాండర్ శుభవార్త చెప్పే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు.
చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ ఒక్కో మైలురాయి దాటుకుంటూ ప్రతీ 100 మీటర్లు కిందకి దిగుతున్న కొద్దీ ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోయింది. బెంగళూరు ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠతో ఊపిరి బిగదీసుకుని చూస్తుండగా.. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా చంద్రుడిపై దిగింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ప్రయోగాన్ని వర్చువల్ గా చూస్తున్న ప్రధాని మోడీ దీనిపై మాట్లాడతారని ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోడీ ఇస్రోకు అభినందనలు తెలిపారు.
అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో జనం చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ కావడంతో మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసి విద్యార్ధులకు ఈ లైవ్ చూపించడంతో వారంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. చందమామపై నిజంగా అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రయాన్ సక్సెస్ తో చరిత్ర సృష్టించిన ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications