ట్రంప్ కు భారత్ తొలి కౌంటర్..! 40 దేశాల టార్గెట్ గా బిగ్ ప్లాన్ ..!
అమెరికా సుంకాల మోత రెట్టింపైంది. ఇవాళ్టి నుంచి భారత్ నుంచి అమెరికా వెళ్లే ప్రతీ వస్తువుపైనా 50 శాతం సుంకం తప్పనిసరి. ఇందులో 25 శాతం సుంకం కాగా.. మరో 25 శాతం జరిమానాగా అమెరికా ప్రభుత్వం వసూలు చేయబోతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బిజీగా ఉంది. అమెరికాకు భారీ కౌంటర్ ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికా ఎగుమతులపై సుంకాల మోత నేపథ్యంలో భారత్ లో తయారయ్యే వస్త్రాలను మరో 40 దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాతో పాటు పలు మార్కెట్లు ఉన్నాయి. వీటికి పెద్ద ఎత్తున వస్త్రాలను ఎగుమతి చేయడం ద్వారా అమెరికా సంగాల ప్రభావం తమ వాణిజ్యంపై పడకుండా ఉండేందుకు కేంద్రం వ్యూహం సిద్దం చేస్తోంది. దీంతో అమెరికాకు భారత్ ఇస్తున్న తొలి కౌంటర్ ఇదేనన్న చర్చ జరుగుతోంది.

భారత్ ఇకపై ఫోకస్ చేయబోతున్న మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ , స్పెయిన్, నెదర్లాండ్స్, పోలండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యూఏఈ, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. భారత్ నుంచి నాణ్యమైన, మన్నికైన వస్త్రాలను ఆయా దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా వస్త్రాల ఎగుమతిలో నమ్మకమైన వ్యాపారిగా మారేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల ప్రభావం పడే అతి పెద్ద పరిశ్రమల్లో వస్త్ర పరిశ్రమ కూడా ఒకటి. దీంతో పాటు అభరణాలు, రొయ్యలు, చర్మ, ఫుట్ వేర్, రసాయన రంగాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారత్ 220 దేశాలకు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అయితే ఇప్పుడు ఇందులో 40 మార్కెట్లను టార్గెట్ చేసుకుని ప్రత్యేకంగా వస్త్రాలను ఎగుమతి చేయబోతోంది. ఈ 40 దేశాలకు విజయవంతంగా వస్త్రాల ఎగుమతి చేయగలిగితే ఏకంగా 590 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇందుకోసం ఎగుమతుల ప్రోత్సాహక మండళ్ల సాయం తీసుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం చేస్తారు.












Click it and Unblock the Notifications