26/11 ముంబై తరహా దాడులకు భారీ కుట్ర..? సముద్రంలో స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ ట్రైనింగ్..!!
పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఎప్పుడూ భారత్ లక్ష్యంగానే ఉంటుంది. ఏదోరకంగా భారత్ ను బలహీన పరచాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది పాకిస్థాన్. అలా 2001 లో పార్లమెంట్ పై దాడులు, 2008 ముంబై దాడులు, 2016 లో ఉరి, 2019 లో పుల్వామా దాడి, గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడులే నిదర్శనం. గతేడాది ఇదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 26 మంది టూరిస్టులను ఉగ్రమూకలు కాల్చేశారు. దానికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టి వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయినా పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు.
ఇక 2008లో ముంబై దాడులు గుర్తొస్తేనే భయబ్రాంతులకు లోనయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దాడి జరిగి 18 ఏళ్లు కావస్తోంది. పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై ఏకధాటిగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది ఉగ్రవాదులు ఉన్నారు. అయితే ఒకే ఒక ఉగ్రవాది కసబ్ మాత్రం ప్రాణాలతో పట్టుబడ్డాడు. అలాగే ఈ దాడుల్లో 20 మంది భారత బలగాలు, 26 మంది విదేశీయులు మరణించారు. దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారు. టెర్రరిస్టులు సముద్ర మార్గం గుండా వచ్చి ఈ దాడులకు పాల్పడ్డారు.
అయితే తాజాగా భారత్ లో మరో ముంబై దాడుల తరహాలో పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ బిగ్ స్కెచ్ వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో ఈ ఉగ్రవాద సంస్థ వేగంగా విస్తరిస్తోంది. ఈమేరకు కరాచీ- బలూచిస్థాన్ సరిహద్దులో కొత్తగా లాంచ్ పాడ్స్ ను ఏర్పాటు చేసుకుంటోంది. తీర ప్రాంతానికి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ లాంచ్ పాడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. సముద్రం ఆధారంగా దాడులకు వీరిని ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో మరోసారి దేశంలో ముంబై తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో ఉగ్రమూకల కొత్త కుట్రలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత సైన్యం అటు జమ్మూ కాశ్మీర్, పీఓకే వద్ద పూర్తి స్థాయిలో నిఘా పెంచింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.












Click it and Unblock the Notifications