సరిహద్దులో 26 గస్తీ పాయింట్లు కోల్పోయిన భారత్
భారత్ తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 గస్తీ పాయింట్లను కోల్పోయిందని అక్కడి సీనియర్ పోలీసు అధికారి ఒకరు ప్రభుత్వానికి గత వారం నివేదిక అందజేశారు
భారత్ తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 గస్తీ పాయింట్లను కోల్పోయిందని అక్కడి సీనియర్ పోలీసు అధికారి ఒకరు ప్రభుత్వానికి గత వారం నివేదిక అందజేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్ కారాకోరం పాస్ నుంచి చుమూర్ వరకు మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది.
కానీ 65 పెట్రోలింగ్ పాయింట్లకు 26 పాయింట్ల వద్దకు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన పోలీసుల సదస్సులో లేహ్ ఎస్పీ పి.డి.నిత్య ఈ నివేదికను కేంద్రానికి అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ప్రాంతాల్లో భారత్ గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని చైనా సాకుగా చూపిస్తోంది. తర్వాత ఆ భూభాగాలను కలిపేసుకుంటోందని నివేదికలో హెచ్చరించారు. అటువంటి ప్రాంతాల్లో బఫర్‌జోన్లను సృష్టించి సరిహద్దును వెనక్కి నెడుతోందని పి.డి.నిత్య తన నివేదికలో పేర్కొన్నారు. అంగుళం తర్వాత అంగుళం భూమిని చైనా ఆక్రమించుకొనే ఈ వ్యూహాన్ని సలామీ స్లైసింగ్ అంటారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చేపట్టిన చర్చల్లో ఏర్పాటు చేసే బఫర్ జోన్లను అవకాశంగా మలచుకుంటోంది.
ఇక్కడ ఎత్తయిన శిఖరాలపై కెమెరాలు పెట్టి భారత్ దళాల కదలికలను పసిగడుతోంది. బఫర్ జోన్ లోకి మన బలగాలు ప్రవేశించిన వెంటనే అభ్యంతరం చెబుతోంది. ఆ ప్రదేశం తమ భూభాగమంటూ వాదిస్తోందని, మరింత బఫర్ జోన్ ఏర్పాటు పేరిట భారత్ ను వెనక్కి నెడుతోందని నివేదికలో తెలిపారు. ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు చైనా యత్నిస్తోందని భారత్ ఆరోపించిన నెలరోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం విశేషం. భారత్-చైనా దళాలు అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో డిసెంబర్ 9న ఘర్షణపడ్డాయి. గల్వాన్ ఘటన తర్వాత జరిగిన అతి పెద్ద ఘర్షణ ఇదే.












Click it and Unblock the Notifications