వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భారతదేశం ముస్లిం పాలకుల బానిస’.. ఈ వాదనలో నిజమెంత?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారతదేశం బానిసత్వం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను సెప్టెంబరు 24న వైట్‌హౌస్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. ఆ సమయంలో భారత్‌లో బైడెన్ ఇంటిపేరుకు సంబంధించిన కొన్ని పత్రాలను బైడెన్‌కు మోదీ అందించారు.

వాటిని చూసిన తర్వాత, బైడెన్ నవ్వుతూ.. ''మనం చుట్టాలమా?''అని బైడెన్ ప్రశ్నించారు. దీనికి నవ్వుతూ అవునంటూ మోదీ సమాధానం ఇచ్చారు.

https://twitter.com/HamidMirPAK/status/1441763019269107716?

''ఈస్ట్ ఇండియా టీ కంపెనీలోని జార్జ్ బైడెన్ పేరుతో ఒక కెప్టెన్ ఉండేవారని నేను విన్నాను''అని మోదీ పర్యటనలో బైడెన్ అన్నారు. ఇదే కంపెనీ భారత్‌ను ఏళ్లపాటు పాలించింది.

''చుట్టాల మూలాలకు సంబంధించిన పత్రాలను బైడెన్‌కు అందించడమే బానే ఉంది. అరబ్ పాలకులకు కూడా ఇలానే వారి మూలాలతో సంబంధమున్న ముస్లింల చుట్టాలను వెతికిపట్టుకొని చూపిస్తే బావుంటుంది''అని పాకిస్తానీ ప్రముఖ జర్నలిస్టు హమిద్ మిర్ ట్వీట్‌చేశారు.

https://twitter.com/nailainayat/status/1228365407242850304?

పాకిస్తాన్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తమ దేశంలో పర్యటించినప్పుడు.. ''భారత్‌ను తుర్క్ పాలకులు 600ఏళ్లు పాలించారు''అని ఇమ్రాన్ ఖాన్ గర్వంగా చెప్పారు.

''మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే టర్కీతో మాకు శతాబ్దాలనాటి బంధాలు ఉన్నాయి. తుర్క్‌ పాలకులు భారత్‌ను 600ఏళ్లు పాలించారు''అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

మధ్య యుగంనాటి కాలంలో తుర్క్ పాలకుల గురించి చెబుతూ ఇమ్రాన్ ఖాన్.. ''వారి పాలన వల్లే దేశంలో సంతోషం వెల్లవిరిసింది''అని అన్నారు.

https://twitter.com/narendramodi/status/1441429367804993547?

ఎవరు గొప్ప..

''మధ్యయుగంనాటి ముస్లిం పాలకుల గురించి పాకిస్తాన్‌లోని కొన్ని ముస్లిం వర్గాలు గొప్పలు చెప్పడంతో.. భారత్‌లోనూ తెల్లజాతీయులపై బంధుప్రీతి మొదలైంది. ఇది నిజంగా ఆందోళనకర పరిణామం''అని పాకిస్తానీ చరిత్రకారుడు ముబారక్ అలీ బీబీసీతో చెప్పారు.

''మేం భారత్‌ను వందల ఏళ్లు పాలించామని ఒక ముస్లిం చెప్పినప్పుడు, అసలు ముస్లింలు ఇక్కడివారు కాదనే భావన హిందువుల్లో కలుగుతుంది. ఇలా ముస్లిం పాలకుల గురించి ముస్లింలు గొప్పలు చెప్పుకునేటప్పుడు, ముస్లింలు బయటవారని చెప్పడం హిందువులకు సులువవుతుంది''అని అలీ అన్నారు.

''మధ్యయుగంనాటి భారత ముస్లిం పాలకులు సాధారణ ముస్లింలు కాదనే విషయని ముస్లింలు గుర్తుపెట్టుకోవాలి. వారు పాలక వర్గానికి చెందినవారు. ముస్లింలు వందల ఏళ్లు పాలించారని గర్వంగా చెబితే, హిందువులను వారు అణచివేశారనే భావన కలిగే అవకాశముంది''అని ఆయన వివరించారు.

మొఘల్ రాజులు

''ముస్లిం పాలకుల గురించి గర్వంగా చెప్పుకోవడమనేది చాలా మంది హిందువులకు ఇబ్బంది కలగించొచ్చు. ఉదాహరణకు మీరు పాకిస్తాన్‌లోని పాఠ్య పుస్తకాలు తీసుకోండి. ఇందులో ముస్లిం పాలకులంతా చాలా ధైర్యవంతులుగా పేర్కొన్నారు. హిందూ రాజులంతా వారికి తలవంచారని రాశారు. కానీ, అది అంతా నిజం కాదు.''

''పాకిస్తానీ పుస్తకాలు హిందువులు, భారత్‌పై విద్వేషాన్ని చల్లుతున్నాయి. మధ్యయుగంనాటి ముస్లిం పాలకులు తమ వర్గానికే చెందినవారని ఇక్కడి పాలకులు భావిస్తున్నారు. ఉదాహరణకు ఇక్కడి క్షిపణులు, ఆయుధాల పేర్లు చూడండి. ఘజ్నీ, ఘోరీ, ఘజ్నావీ లాంటి పేర్లు కనిపిస్తాయి. ఇలాంటి ధోరణులు అతివాద హిందీ రాజకీయాలను మరింత ప్రేరేపిస్తాయి. దీంతో భారత్‌లోని ముస్లింలకు సమస్యలు తలెత్తుతాయి''అని అలీ అన్నారు.

భారతదేశం బానిసత్వం

1200ఏళ్ల బానిసత్వం నిజమేనా?

ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక, 2014 జూన్ 11న లోక్‌సభను ఉద్దేశించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ''1200 ఏళ్లపాటు మనం బానిసత్వాన్ని చూశాం. తలెత్తి మాట్లాడటానికి కూడా మనల్ని అనుమతించేవారు కాదు''అని ఆనాడు మోదీ అన్నారు.

ఆయన ప్రసంగం తర్వాత, చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. నిజంగానే భారత్ 1200ఏళ్లపాటు బానిసత్వంలో గడిపిందా? బ్రిటిష్ పాలనకు ముందు నుంచే భారత్ బానిసత్వంలో ఉందా? లాంటి ప్రశ్నలపై చర్చ జరిగింది.

1200ఏళ్లపాటు బానిసత్వం అని మోదీ చెప్పినప్పుడు.. ఎనిమిదో శతాబ్దంలో సింధ్‌లోని హిందూ రాజ్యంపై మిర్ ఖాసిం దాడి(క్రీ.శ. 712) నుంచి ఆయన మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

భారత్‌లో బ్రిటిష్ పాలన 1757 నుంచి 1947 వరకు కొనసాగింది. అంటే మొత్తంగా ఇది 190ఏళ్లు మాత్రమే ఉంది. అంతకుముందు వెయ్యి పైచిలుకు ఏళ్లు ముస్లింల పాలకుల ఆధీనంలో భారత్ ఉంది.

మరి భారత్ ఎంతకాలం బానిసత్వంలో ఉంది? సాధారణ ప్రజలు దీనికి ఏమని సమాధానం ఇస్తారు?

భారత్‌లోని పాఠ్య పుస్తకాల ప్రకారం, భారత్‌లో బానిసత్వం ప్లాసీ యుద్ధం-1757 నుంచి మొదలవుతోంది. ఈ యుద్ధం బెంగాల్ నవాబు, బ్రిటిష్ పాలకుల మధ్య జరిగింది. అయితే, ఈ యుద్ధానికి ముందు నుంచే భారత్ వలస పాలకుల ఆధీనంలో ఉందని కొందరు చెబుతున్నారు. ముస్లిం పాలకుల దాడులనూ బానిసత్వం కిందే చూడాలని అంటున్నారు.

భారతదేశం బానిసత్వం

ముస్లిం పాలకుల చేతిలో బానిసత్వం చూశామా?

''మధ్యంయుగంనాటి ముస్లింపాలనకు సంబంధించి చాలా రకాల విశ్లేషణలు ఉన్నాయి. 19వ శతాబ్దం నుంచే చరిత్రను మతపరమైన కోణంలో చూడటం మొదలైంది. బ్రిటిష్ పాలకులే కాదు.. హిందువులు, ముస్లింలు అందరూ ఈ కోణంలో చరిత్రను చూడటం మొదలైంది. భారత చరిత్రను మతాల ఆధారంగా విభజించడం ఇదేమీ కొత్తకాదు. స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ పాలనను బానిసత్వ పాలనగా చెప్పేవారు. మరోవైపు హిందూత్వ నాయకులు 13వ శతాబ్దం నుంచే భారత్ బానిసత్వంలో ఉందని చెబుతారు''అని చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ చెప్పారు.

''ముస్లిం చరిత్రకారుడు ఇస్తియాక్ హుస్సేన్ ఖురేషి.. మధ్యయుగాన్ని ముస్లిం పాలనా కాలంగా చెబుతారు. ముస్లిం లీగ్ నాయకులు కూడా అదే చెబుతారు. భారత్ మొత్తాన్ని తాము పాలించామని చెబుతారు. నిజమైన జాతీయవాదులు ఇలాంటి వాదనను వ్యతిరేకిస్తారు''అని హబీబ్ అన్నారు.

భారతదేశం బానిసత్వం

''చాలా మంది మధ్యయుగంనాటి ముస్లిం నాయకులు విదేశీ గడ్డలపై పుట్టారు. అయితే, వారు భారత్ భిన్నత్వాన్ని అర్థం చేసుకోగలిగారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన చాలా మంది... ముస్లిం పాలకులకు, బ్రిటిష్ పాలకులకు చాలా తేడా ఉందని చెబుతారు. భారత సంపదను బ్రిటిషర్లు కొల్లగొడితే, ముస్లిం పాలకులు సంపద భారత్ దాటకుండా చూసుకున్నారని చెబుతారు.''

''ఆర్‌సీ దత్, దాదాబాయ్ నౌరోజీ లాంటి వారి రచనల్లో ఈ వాదన స్పష్టంగా కనపడుతుంది. అయితే, మతపరమైన అతివాదులు రెండు వైపులా ఉన్నారు. వారు ముస్లిం, బ్రిటిష్ పాలకుల మధ్య తేడాను చూడలేరు.''

''భారత్‌లో ముస్లిం నాయకుల పాలనను నిరంకుశ పాలనగా ఆర్‌సీ మజుందార్ లాంటి చరిత్రకారులు అభివర్ణించారు. మజుందార్ ఆధారాల ప్రకారమే మాట్లాడతారు. ఇతర చరిత్రకారులు ఆయన వాదనను అంగీకరిస్తారు. అయితే, చరిత్ర అనేది మనం ఎంచుకునే కోణం బట్టి ఉంటుంది. 1950ల తర్వాత ఆరెస్సెస్ కొత్తగా చెబుతున్న చరిత్ర మాత్రం వీటన్నింటికంటే భిన్నమైనది.''

''వారు చారిత్రక ఆధారాల గురించి మాట్లాడరు. చరిత్ర అంటే ఏం జరిగిందో వారికి అనవసరం. ఏం జరిగుండాల్సిందో.. అదే వారు మాట్లాడతారు. భారత్‌లో రానున్న రోజుల్లో ఇలాంటి చరిత్ర కోణాలు ఇంకా ఎక్కువగా వస్తాయి. పాకిస్తాన్‌లోనూ అంతే.''

భారతదేశం బానిసత్వం

చరిత్రలో మూడు కాలాలు..

భారత చరిత్రను మూడు కాలాలుగా విభజించారు. వీటిలో మొదటిది ప్రాచీన చరిత్ర, రెండోది మధ్యయుగం, మూడోది ఆధునిక భారతం.

గుప్తుల కాలంతో ప్రాచీన భారత చరిత్ర ముగుస్తుంది. అక్కడి నుంచే మధ్యయుగం ప్రారంభం అవుతుంది.

హిందూ, బౌద్ధ, జైన మతాలు ప్రాచీన భారత్‌లోనే పుట్టాయి. ఇక మధ్యయుగానికి వస్తే, మొఘల్ పాలకుల కాలం, 1526 నుంచి ఔరంగజేబు మరణం (1707) వరకు చాలా ముఖ్యమైనది.

ఔరంగజేబు దాదాపు భారత్ మొత్తాన్నీ పరిపాలించాడు. అతడి తర్వాత మొఘల్ పాలన పతనం అవుతూ వచ్చింది. 1857లో చివరి మొఘల్ చక్రవర్తి బహదుర్ షా జఫర్‌ను బ్రిటిష్ పాలకులు ఖైదుచేసి బర్మాకు తరలించారు.

బహదూర్ షా జఫార్ తర్వాత, భారత్ బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పటినుంచీ ఆధునిక చరిత్ర మొదలవుతుంది. అయితే, బ్రిటిష్ పాలనతో ఆధునిక చరిత్ర మొదలుకావడాన్ని చాలామంది చరిత్రకారులు వ్యతిరేకిస్తుంటారు.

''బ్రిటిష్ పాలన.. అరాచకాలకు పెట్టింది పేరు. వారి పాలనతో ఆధునిక చరిత్ర మొదలవుతుందని చెప్పడంలో అర్థమేలేదు''అని ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.

''బ్రిటిష్ చరిత్రకారుడు జేమ్స్ మిల్ తన పుస్తకం హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియాలో భారత చరిత్రను మతపరమైన కోణంలో చూపించేందుకు ప్రయత్నించారు. ఈ కోణాన్ని రెండు వైపులా అతివాదులు తమకు అవసరమైనట్లుగా ఉపయోగించుకున్నారు. ప్రాచీన భారతాన్ని హిందూ పాలనగా, మధ్యయుగం చరిత్రను ముస్లిం పాలనగా మిల్ అభివర్ణించారు. రెండూ నిరంకుశ పాలనలేనని ఆయన చెప్పుకొచ్చారు''అని ప్రొఫెసర్ హరబంశ్ ముఖియా వివరించారు.

యోగీ ఆదిత్యనాథ్

అల్లామా ఇక్బాల్ వర్సెస్ సావర్కర్

ముస్లింలను బయటవారని, ముస్లిం పాలకులు కూడా వలస పాలకులేనని చెప్పడం ఇదేమీ కొత్త కాదు. బ్రిటిష్ పాలనలోనే ఇది మొదలైందని ముఖియా, హబీబ్ లాంటి చరిత్రకారులు చెబుతున్నారు. ఈ వాదనను ఇటు హిందు, అటు ముస్లిం.. రెండు వర్గాల్లోని అతివాదులూ తమకు అనుకూలంగా మార్చుకున్నారని వివరిస్తున్నారు.

స్వాతంత్ర్య పోరాటం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా.. అల్లామా ఇక్బాల్‌ ''ముస్లిం దేశం'' కోసం, సావర్కర్ హిందూ దేశం కోసం మాట్లాడేవారని చరిత్ర చెబుతోంది.

''పార్లమెంటు వేదికగా భారత్ 1200 ఏళ్లు బానిసత్వంలో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడమంటే, ఆయన ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లే. ముస్లింలు బయటవారని ఆయన చెప్పాలని అనుకున్నారు. ముస్లింల నిబద్ధతను ఆయన ప్రశ్నించారు''అని అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హేరబ్ చతుర్వేది అన్నారు.

ఇలా చెప్పినవారిలో మోదీ మొదటివారు కాదు. స్వాతంత్ర్యానికి ముందు నుంచీ ఈ వాదన ఉంది. స్వాతంత్ర్యం తర్వాత కూడా చాలా మంది మొఘల్ చక్రవర్తులు బయటివారని చాలాసార్లు చెప్పారు.

భారత్‌లో చాలా నగరాలు, రోడ్ల పేర్లను మారుస్తూ వస్తున్నారు. మొదటగా బ్రిటిష్ కాలంనాటి పేర్లను మార్చారు. బాంబేను ముంబయిగా, కలకత్తా నుంచి కోల్‌కతాగా, త్రివేండ్రంను తిరువనంతపురంగా, మద్రాస్‌ను చెన్నైగా మార్చారు.

ఆ తర్వాత మొఘల్ చక్రవర్తుల కాలంనాటి పేర్లను మారుస్తూ వస్తున్నారు. 1583లో అక్బర్ స్థాపించిన అలహాబాద్ నగరాన్ని నేడు ''ప్రయాగ్‌రాజ్''గా మార్చారు. 2018లో ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం ఈ పేరును మార్చింది. దీని ద్వారా మొఘల్ చక్రవర్తులు కూడా బ్రిటిష్ పాలకుల్లానే బయటివారనే సందేశం ఇచ్చారు.

భారతదేశం బానిసత్వం

అయితే, ఇలాంటి పేరు మార్పులు కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. హిందు, సిక్కు, బెంగాలీల గుర్తులు చెరిపేందుకు పాకిస్తాన్‌లోనూ ప్రయత్నాలు జరిగాయి.

పాకిస్తాన్ చరిత్ర పుస్తకాల నుంచి తూర్పు పాకిస్తాన్ చరిత్రను తొలగించారు. బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు పాకిస్తాన్‌లో భాగమని, 1970లో హింస నడుమ బంగ్లాదేశ్ అవతరించిందని నేడు చాలా మంది మరచిపోతున్నారు.

భారత్‌లో అధిక సంఖ్యాక వర్గాల ప్రాబల్యం ఎలా పెరుగుతోందో చెబుతూ ''ద లాస్ ఆఫ్ హిందుస్తాన్'' పేరుతో కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మనన్ అహ్మద్ ఆసిఫ్ ఓ పుస్తకం రాశారు. 1904లో లాహోర్‌లోని ఫోర్‌మ్యాన్ క్రిస్టియన్ కాలేజీ ముందు యువ విప్లవకారుడైన హర్‌దయాల్ నిరసనను ఆయన ఆ పుస్తకంలో ఉదహరించారు. నిరసన తెలిపేందుకు తన మిత్రుడు, రచయిత మహమ్మద్ ఇక్బాల్‌ను ఆయన ఆహ్వానించారు.

ఆనాడు ఇక్బాల్ ఒక ప్రభుత్వ కాలేజీలో పనిచేసేవారు. తను రచించిన ''సారే జాహాసే అచ్చా హిందుస్తాన్ హమారా'' పాటను ఆయన కాలేజీ బయట నిర్వహించిన సమావేశంలో పాడారు. అక్కడకు వచ్చిన వారంతా చాలా ఉత్సాహంతో ఆ పాటను ఆయనతోపాటే పాడారు.

అక్కడున్న వారిలో ఓ వ్యక్తి ఈ పాటను రాసుకొని, ఆనాటి ఉర్దూ మ్యాగజైన్ ''ఇత్తెహాద్''కు పంపారు. 1904 ఆగస్టు మ్యాగజైన్‌లో ఈ పాట ఇత్తెహాద్‌లో ప్రచురితమైంది.

1924లో ఇక్బాల్ రాసిన ఇతర పాటలతోపాటు కలిపి దీన్ని ప్రచురించారు. ''భారత్ మన అందరిదీ''అంటూ సాగిన ప్రచారంలో ఇక్బాల్ కూడా ప్రధానపాత్ర పోషించారు. ఈ పాటలో గంగ, హిమాలయాలను ఆయన ప్రస్తావించారు. హిందువులకు వీటిపై ఎంతో విశ్వాసమున్న సంగతి తెలిసిందే.

''మనమంతా హిందుస్తానీలం''ఇదే అన్నింటికంటే ముఖ్యం. ఆ తర్వాతే హిందూ లేదా ముస్లిం''అనే భావన ఇక్బాల్ పాటలో కనిపిస్తుంది. ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది. ఇది భారతీయుల పాటలా మారింది.

కాంగ్రెస్ సమావేశాలు ఈ పాటతోనే ప్రారంభమయ్యేవి. స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా మంది ఈ పాటను ఆలపించేవారు. మహాత్మా గాంధీ కూడా ఈ పాటను చాలా మెచ్చుకునేవారు.

పాకిస్తాన్ జెండా

అయితే, 20వ శతాబ్దం మొదట్లో ఇక్బాల్ ''హిందుస్తాన్'' భావనలో చాలా మార్పులు వచ్చాయి. ''తరానా-ఎ-మిల్లీ''పాట ఆయన పాటల్లో చేరింది. ముస్లిం దేశం కోసం ఇక్బాల్ ఈ పాటను రచించారు.

ముస్లింలంతా ఏకం కావాలని ఈ పాటతో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ''చైనా, అరబ్ మనదే. హిందుస్తాన్ కూడా మనదే. మనం ముస్లింలం. సారా జహాన్ మనదే''అంటూ ఈ పాట సాగుతుంది.

1930నాటికి ఇక్బాల్ ఆలోచనలు మరింత మారాయి. ఆయన ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌లోనూ సమావేశాల్లోనూ ప్రసంగించారు. భారత్‌లో ముస్లిం ఇండియాను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే గొప్ప ముస్లిం దేశంగా ఆయన అభివర్ణించారు.

''ఇస్లాం సంస్కృతి అనేది ఆ ప్రాంతంలో నివసించే ముస్లింల జనాభాపై ఆధారపడి ఉంటుంది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఒకటిగా చేయాలి. ముస్లింలు సైన్యం, పోలీసు విభాగాల్లోనూ ఉన్నారు. వీరి వల్లే బ్రిటిష్ పాలన సాఫీగా సాగుతోంది. ముస్లింలంతా ఏకమైతే, భారత్‌తోపాటు ఆసియాలోని సమస్యలు కూడా పరిష్కృతం అవుతాయి''అని ఆయన అన్నారు.

తాజమహల్

ప్రపంచంలోని ముస్లింలంతా ఏకం కావాలని ఇక్బాల్ పిలుపునిచ్చేవారు. 1947లో విభజన అనంతరం, ఇస్లామిక్ రిపబ్లిక్‌గా పాకిస్తాన్ అవతరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్‌ను చూడాలనే కల నెరవేరకముందే, 1938లో ఇక్బాల్ మరణించారు. 1970ల్లో పాకిస్తాన్ సైనిక పాలకుడు జియావుల్ హక్.. ఇక్బాల్‌కు ''నేషనల్ ఫిలాసఫర్ ఆఫ్ పాకిస్తాన్'' బిరుదును ప్రదానం చేశారు.

''జర్మనీకి వెళ్లిన తర్వాత, ఇక్బాల్ పూర్తిగా మారిపోయారు. అక్కడ ఆయన తత్వశాస్త్రాన్ని చదువుకున్నారు. అక్కడి జాతీయవాదాన్ని చూసిన తర్వాత, ఇస్లామిక్ జాతీయవాదానికి ఆయన మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. సారే జహాసే అచ్చే నినాదాన్ని పూర్తిగా ఆయన విడిచిపెట్టేశారు''అని ప్రొఫెసర్ హరబంశ్ ముఖియా అన్నారు.

ఐరోపాకు వెళ్లిన తర్వాత, ఇక్బాల్ అతివాద ముస్లింగా మారారనే వాదనతో ముబారక్ అలీ కూడా ఏకీభవిస్తున్నారు.

ఎర్రకోట

ముస్లింల విధేయతపై సందేహం

కానీ, వినాయక్ దామోదర్ సావర్కర్ హిందూ దేశం గురించి అల్లామా ఇక్బాల్‌ కంటే స్పష్టమైన మాటలతో చెప్పేవారు. భారత్‌ అంటే హిందువులకు మాత్రమే అసలైన ప్రేమ ఉంటుంది అని సావర్కర్ ఓపెన్‌గా అనేవారు.

భారత్‌లో హిందూ ఆధిపత్య, రాజకీయాలకు సావర్కర్ ఆరంభంగా నిలిచారు. నిజానికి హిందుత్వ అనే మాటను మొదటిసారి ఆయనే ఉపయోగించారు.

సావర్కర్‌ను లండన్‌లో దేశద్రోహం కేసులో అరెస్ట్ చేశారు. ఆయన్ను 1911లో జీవిత ఖైదు విధించి అండమాన్‌ జైల్లో పెట్టారు. 1924లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయనని మాటిస్తూ క్షమాపణ లేఖ ఇచ్చిన తర్వాత విడుదలైన ఆయన 1937 వరకూ మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో సావర్కర్‌ను కూడా సహ నిందితుడుగా పేర్కొన్నారు. కానీ సాక్ష్యాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు. గాంధీ హత్య చేసిన నాథూరామ్ గాడ్సే కూడా సావర్కర్ హిందుత్వ భావజాలానికి ప్రేరేపితులయ్యారు.

ఒక గౌరవప్రదమైన హిందూ దేశంగా సావర్కర్ భారత్ గురించి కలలు కనేవారు. 1908లో సావర్కర్ మరాఠీలో రాసిన ఒక కవితలో ఆయన 'అమూచే ప్రియకర్ హిందుస్థాన్'(మా ప్రియమైన హిందుస్థాన్) అని రాశారు.

సావర్కర్ ఈ కవిత లండన్‌లో రాశారు. సావర్కర్ కూడా అల్లామా ఇక్బాల్ లాగే భారత్‌ను మిగతా అన్ని దేశాల కంటే మంచిదని చెప్పినట్లు అనిపిస్తుంది. ఆయన కూడా తన కవితలో హిమాలయాలు, గంగా నది గురించి ప్రస్తావించారు. కానీ సావర్కర్ తన కవితలో ముస్లింలు, బ్రిటిష్ వారినిద్దరినీ వలస శక్తులుగా చెప్పారు.

ఎర్రకోట

సావర్కర్ తన కవితలో మొదటి శతాబ్దంలో విక్రమాదిత్యుడి చేతిలో ఓటమి పాలైన గ్రీకులకు 'మ్లేచ్ఛులు' అనే మాట ఉపయోగించారు. మ్లేచ్చులు అనే మాటను అపరిశుభ్రమైన, చెడుకు పర్యాయ పదంగా ఉపయోగించారు. ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యక్తం చేయడానికి తర్వాత కూడా ఇదే పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు.

1923లో సావర్కర్ మొదటి వ్యాసం 'ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ' ప్రచురితమైంది. ఆయన ఆ వ్యాసంలో ముస్లింలు బయటి నుంచి వచ్చిన ఆక్రమణదారులు అనే తన అభిప్రాయాన్నివివరించారు. సావర్కర్ ఇదే వ్యాసంలో మొదటిసారి 'హిందుత్వ' అనే మాటను ఉపయోగించారు.

అందులో ఆయన హిందుస్థాన్‌ను ఊహించుకున్నారు. 'హిందుస్తాన్‌'కు బదులు 'హిందుస్థాన్' అనే మాటను సమర్థించారు. సావర్కర్ హిందూ పక్కనే పారశీ మాట 'స్తాన్' బదులు సంస్కృత పదం 'స్థాన్' జోడించారు. హిందుస్తాన్ అనే పేరు విదేశీయుల వల్లే వచ్చిందనే మాటను సావర్కర్ ఒప్పుకోలేదు.

సావర్కర్ తన 'హిందుత్వ: హూ ఈజ్ ఏ హిందూ' అనే పుస్తకంలో "మొహమ్మద్ పుట్టక ముందే, అరబ్బుల గురించి ప్రపంచానికి తెలియని సమయంలో, చాలా కాలం ముందే ఈ ప్రాచీన దేశం బయటి వారికి 'హిందూ' లేదా 'సింధూ'గా తెలుసు. దీనికి ఆ పేరు పెట్టింది అరబ్బులు కాదు" అన్నారు.

"హిందుస్థాన్ అంటే హిందువుల భూమి అని అర్థం. హిందుత్వ కోసం భౌగోళిక ఐకమత్యం చాలా అవసరం. ఒక హిందూ ప్రధానంగా ఇక్కడి పౌరుడు లేదంటే తన పూర్వీకుల వల్ల హిందుస్థాన్ పౌరుడు అయ్యుంటాడు" అని ఆయన అదే పుస్తకంలో రాశారు.

సావర్కర్ హిందుత్వను నిర్వచించడానికి ముందే హిందుస్థాన్‌ను నిర్వచించేవారు. దానిని భౌగోళిక రూపంతో ప్రారంభించేవారు. ప్రాదేశిక సమగ్రత తర్వాత మతపరమైన, సాంస్కృతిక అంశాలపై ఆయన మాట్లాడేవారు.

ఎర్రకోట

సావర్కర్ ఐదు వేల ఏళ్ల పురాతన హిందుస్థాన్ గురించి మాట్లాడేవారు. గజినీ దాడులకు ముందు వరకూ ఇక్కడ సౌందర్యంతోపాటూ శాంతి కూడా ఉందని చెప్పారు. తర్వాత ప్రతి ఏటా, ప్రతి దశాబ్దం, ప్రతి శతాబ్దం ముస్లిం ఆక్రమణదారులు, హిందూ పాలకుల మధ్య సంఘర్షణలు కొనసాగాయని చెప్పారు.

ఆ దాడులు, ప్రతిదాడుల నుంచే హిందుత్వం జనించిందని సావర్కర్ చెప్పారు. ముస్లిం పాలకులతో ఏ పోరాటాలు జరిగాయో, వాటి నుంచే హిందూ దేశం అనే నిర్వచనం ఏర్పడిందని తెలిపారు.

సావర్కర్ ముస్లింలను ఎప్పుడూ బయటివారుగానే భావించేవారు. 'హిందుత్వ: హు ఈజ్ ఎ హిందూ' పుస్తకంలో "మన ముస్లింలు, క్రిస్టియన్లు కొన్ని సందర్భాల్లో వారు బలవంతంగా హిందూయేతర మతంలోకి మార్పించారు. వారి మాతృభూమి కూడా ఇదే. సంస్కృతిలో చాలా వరకూ ఒకేలా ఉంటుంది. అయినా, వారిని హిందువులుగా భావించలేం. అయితే హిందువుల్లా, హిందుస్థాన్ వారి మాతృభూమి, కానీ పుణ్యభూమి కాదు. సుదూరంగా ఉన్న అరేబియా వారి పుణ్యభూమి. వారి గుర్తింపు, మతపెద్దలు, ఆలోచనలు, నాయకులు ఈ నేలలో పుట్టలేదు. అందుకే, వారి పేర్లు, వారి వైఖరికి మూలాలు విదేశంలో ఉన్నాయి. వారి ప్రేమ విభజనకు గురైంది" అన్నారు.

సావర్కర్ ఈ వాదనపై మాట్లాడిన చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్ "భగత్ సింగ్ నాస్తికుడు. ఆయనకు ఎక్కడా ఎలాంటి పుణ్య భూమీ లేదు. జాతీయత, మతాలను కలపలేం. అవి రెండూ పూర్తిగా వేరు వేరు. మతంతో ఎవరి జాతీయతావాదాన్ని ప్రభావితం చేయలేరు" అన్నారు.

ముస్లింల గురించి ఇది సావర్కర్ అభిప్రాయం మాత్రమే కాదు, బ్రిటిష్ పాలనను ప్రశంసించిన సర్ జదునాథ్ సర్కార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

జదునాథ్ సర్కార్ మొఘలుల కాలం గురించి రాసినవి, ఇప్పటి బీజేపీ పాలనకు సరిగ్గా సరిపోతుంది అంటారు హర్‌బంశ్ ముఖియా.

జదునాథ్ సర్కార్ మద్రాసులో 1928లో ఒక లెక్చర్ ఇచ్చారు. ఆయన ప్రసంగం 'ఇండియా త్రూ ద ఏజ్' శీర్షికతో ప్రచురితమైంది. అందులో ముస్లిం పాలకులను విదేశీయులుగా, భిన్న సంస్కృతి పాలకులుగా చెప్పారు.

భారత్‌పై ముస్లింలు సాధించిన విజయం అంతకు ముందు జరిగిన దాడులకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భారత ప్రజలకు ముస్లింలు పూర్తిగా వేరేవారు. ఇక్కడ ఉన్న భారతీయులు వారిని ఎప్పుడూ తమవారుగా భావించలేకపోయారు. హిందూ-ముస్లిం, తర్వాత హిందూ-క్రిస్టియన్లు కూడా ఒకేచోట ఉన్నప్పటికీ పరస్పరం కలవలేకపోయారు. ముస్లింలు ఇప్పుడు కూడా ముఖం మక్కావైపు పెట్టి నమాజు చేస్తారు" అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.

"1200 నుంచి 1580 వరకూ(అక్బర్ పాలనకు ముందు) ముస్లిం పాలకులు భారత భూమిపై ఒక సైనికుల క్యాంప్‌"లా ఉన్నారు అని ఇండియా త్రూ ద ఏజ్ పుస్తకంలో సర్కార్ చెప్పారు.

సర్ జదునాద్ సర్కార్ మాటల్లో అసలు లాజిక్ లేదని ప్రొఫెసర్ హరబంశ్ ముఖియా, ప్రొఫెసర్ హేరంబ్ చతుర్వేది చెబుతున్నారు.

"బాబర్, హుమయూన్ మధ్య ఆసియా నుంచి వచ్చారు. అక్బర్ ఉమర్‌కోట్‌లోని ఒక రాజపుత్ర రాజు ఇంట్లో పుట్టారు. అక్బర్ భారత్ బయటకు ఎప్పుడూ వెళ్లలేదు. అక్బర్ తర్వాత ఎంతమంది మొఘల్ పాలకులు ఉన్నారో, వారందరూ భారత్‌లోనే పుట్టారు. వారు భారత్ దాటి అడుగు కూడా పెట్టలేదు అని హరబంశ్ చెప్పారు.

"భక్తి, సూఫీ ఉద్యమం వల్ల మతాల గోడలు కూలిపోయాయి. ముస్లిం కవి కృష్ణుడిపై భక్తితో కవితలు రాసేవారు. రాజపుత్రుల ఇళ్లల్లో ముస్లింల వివాహాలు జరిగేవి. కలిసిపోవడం అంటే ఇంతకు మించినది వేరే ఏముంటుంది" హేరంబ్ చతుర్వేది.

ఎర్రకోట

ముస్లిం పాలకులు హిందువులను అణచివేశారా

మధ్యయుగంలో ముస్లిం పాలకులను చాలా మంది ఆక్రమణదారులుగా చెబుతారు. అధికారం కోసం ఒక రాజ్యం మరో రాజ్యంపై దాడులు చేయడం కొత్త విషయమేమీ కాదని చరిత్ర నిపుణులు, జహంగీర్ గురించి 'ఇంటిమేట్ పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ గ్రేట్ మొఘల్' పుస్తకం రాసిన పార్వతి శర్మ చెప్పారు.

"మౌర్యుల పాలన అఫ్గానిస్తాన్ వరకూ ఉండేది. అలా వాళ్లు కూడా ఆక్రమణదారులే అయ్యారు. అధికార విస్తరణ, అధికారం సొంతం చేసుకోవాలనే కోరికలను మనం ఎలాంటి రూపంలో అయినా చూడవచ్చు. ఆ కోరికలకు ప్రత్యేకంగా ఒక మతంతో ఎలాంటి సంబంధం ఉండదు" అని ఆమె అన్నారు.

ముస్లిం పాలకులు దారుణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినపుడు మొదట జిజియా విషయం చర్చకు వస్తుంది. జిజియాను అక్బర్ రద్దు చేశారు. ఔరంగజేబు 1679లో దాన్ని మళ్లీ అమలు చేశారు. జిజియా అంటే ఒక పన్ను. ముస్లిమేతరులపై దీనిని విధించేవారు.

ఔరంగజేబు ఈ చర్యను ఆయన మత ఛాందసవాదానికి రుజువుగా చూస్తారు. ఆయన ఈ నిర్ణయం రాజపుత్రులు, మరాఠాలను కూడా ఇబ్బంది పెట్టింది. కానీ, మొఘల్ పాలనపై హిందువుల్లో వ్యతిరేకత పెరగుతుండడం వల్లే, ఔరంగజేబు జిజియా పన్ను విధించారని, అది ఒక రాజకీయ చర్య అని కూడా కొందరు చరిత్రకారులు చెబుతారు.

జిజియా పన్నును మళ్లీ విధించడం వెనుక, ముఖ్యంగా అప్పటి రాజకీయ, ఆర్థిక కోణం కూడా ఉందని చరిత్రకారులు సతీష్ చంద్ర రాశారు.

ఔరంగజేబు జిజియా పన్ను మళ్లీ విధించడం వెనుక సమకాలీనులైన చరిత్రకారులు రకరకాల అభిప్రాయాలు వెల్లడించారు.

"ఔరంగజేబు పాలనాకాలంలో అధికారిక చరిత్రకారుడుగా భావించే మొహమ్మద్ సాకీ ముస్తైద్ ఖాన్ వివరాల ప్రకారం ఇస్లామిక్ పాలకులు ఇస్లాం చట్టాలను వ్యాపింప జేయాలని, వాటిని పాటించని వారితో కఠినంగా ప్రవర్తించాలని ఆదేశాలు ఇచారు. అదే ఆదేశాల కింద ఖురాన్‌ను విశ్వసించని వారి నుంచి జిజియా పన్ను వసూలు చేయాలని ఔరంగజేబు 1679 ఏప్రిల్ 2న దివాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయించారు" అని సతీష్ చంద్ర రాశారు.

షరియా చట్టాల గురించి తెలిసిన ఔరంగజేబు అధికారంలోకి వచ్చిన 22 ఏళ్ల తర్వాత జిజియా పన్ను ఎందుకు విధించారు అనే ప్రశ్నకు సమాధానం లేదు.

భారతదేశం బానిసత్వం

అదే సమయంలో భారత్ వచ్చిన యూరోపియన్ యాత్రికుకులు, వాణిజ్య సంస్థల ఏజెంట్లు జిజియా పన్ను గురించి పూర్తిగా మరోరకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

సూరత్‌లోని ఇంగ్లిష్ ఫ్యాక్టరీ చీఫ్ థామస్ రోల్ "1679లో ఔరంగజేబు విధించిన జిజియా పన్ను ఖాళీ ఖజానాను నింపడానికి మాత్రమే కాదు, పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ముస్లింలుగా మారేలా కూడా దాన్ని అమలు చేశారు" అన్నారు.

కానీ, పేద హిందువులను ముస్లింలుగా మార్చడానికే ఔరంగజేబు జిజియా పన్ను అమలు చేశారనే వాదనతో సతీశ్ చంద్ర ఏకీభవించడం లేదు.

"దేశంలోని పెద్ద పెద్ద ప్రాంతాల్లో 400 ఏళ్ల వరకూ ముస్లిం పాలకులు ఉన్నప్పటికీ హిందువులు తమ మతంలో కొనసాగారు. ఆ సమయంలో ఎంతో మంది ముస్లిం పాలకులు జిజియా వసూలు చేశారు. కొత్తగా జిజియాను మళ్లీ విధించడం వల్ల ఫలితాలు మరోలా ఉండవని, పేద హిందువులు ముస్లిం మతం స్వీకరించరని ఔరంగజేబుకు తెలిసే ఉంటుంది" అన్నారు.

"ఈ పన్నుతో పేద హిందువులు ఇబ్బందులు పడ్డారనేది నిజమే. కానీ, దానికి ఎలాంటి ఆధారాలూ లేవు. జిజియా పన్ను వల్ల వారు భారీ సంఖ్యలో మతం మారారు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అలా ఏదైనా జరిగుంటే ముస్లిం పాలకుల దర్బారుల్లో ఉన్న వారు వాటిని ఒక పెద్ద విజయంగా నమోదు చేసుండేవారు" అంటారు సతీశ్ చంద్ర.

దీనినే ఆర్థిక దృష్టితో చూస్తే ఔరంగజేబు తన పాలనలో 13వ ఏట ఆర్థిక సమీక్ష చేసినపుడు, గత 12 ఏళ్లుగా ఆదాయం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టినట్లు ఆయనకు తెలిసింది. దాంతో సుల్తానులు, బేగంలు, యువరాజుల ఖర్చుల్లో ఔరంగజేబు కోతలు విధించారు. 1676 తర్వాత దక్షిణాదిన వరుస యుద్ధాలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. దాంతోపాటూ ఈశాన్యంలో ఫ్రంటియర్ వార్‌తో సిసోడియా, రాథోర్లతో కూడా ఘర్షణ కొనసాగుతోంది. ఈ యుద్ధాలతో ఔరంగజేబు సామ్రాజ్యాన్ని విస్తరించలేకపోవడమే కాదు, ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందలేకపోయారు" అన్నారు.

అంత కాదు, ఔరంగజేబు ఖజానాపై చాలా రకాల పన్నుల మినహాయింపు ప్రభావం కూడా పడింది. ఏయే పన్నులు విధించడానికి ఇస్లామిక్ చట్టం అనుమతించదో, వాటిని ఆయన తొలగించారని, అందుకే షరియా కింద జిజియా పన్ను విధించే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారని చాలా మంది భావిస్తున్నారు.

భారతదేశం బానిసత్వం

మనం మొత్తం మధ్యయుగాన్ని కేవలం ఔరంగజేబు కోణం నుంచే చూడలేం. హిందువుల నుంచి జిజియా పన్ను వసూలు చేసిన ఆయన ముస్లింల నుంచి జకాత్ కూడా తీసుకునేవాడు. జిజియా 1.5 శాతమే ఉంటే, జకాత్ దానికంటే ఎక్కువ ఉండేది. జిజియా వ్యక్తిగత పన్ను. అందులో పిల్లలు, మహిళలు, వృద్ధులను మినహాయించారు. అంతకు ముందు అక్బర్ జిజియా పన్ను పూర్తిగా రద్దు చేశారు" అని చరిత్రకారులు, మత జాతీయవాదంపై పుస్తకం రాసిన రామ్ పున్యానీ

మధ్యయుగంలో హిందువులపై ముస్లిం పాలకుల అణచివేత ఉండేది. ఆ వివక్షాపూరిత పాలనకు జిజియా ఒక ఉదాహరణ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారిక్ రీసెర్చ్(ఐసీహెచ్ఆర్)తో అనుబంధంగా ఉన్న జేఎన్‌యూ చరిత్ర ప్రొఫెసర్ అయిన ఉమేష్ అశోక్ కదమ్ అభిప్రాయపడ్డారు.

"భారత్‌లోకి ఇస్లాం, క్రైస్తవ మతాలు రావడం ఒక సాంస్కృతిక కుదుపు లాంటిది. మధ్యయుగంలో కేవలం దిల్లీ సామ్రాజ్యం, మొఘలుల చరిత్ర మాత్రమే లేదు. 8వ శతాబ్దం- 18వ శతాబ్దం మధ్యలో హిందూ రాజ్యాలు కూడా ఉండేవి. అవి మంచి పాలనను అందించాయి. ముస్లిం పాలకులు భారతీయ భాషలను పూర్తిగా దూరం పెట్టేశారు. అందరిమీదా పారశీ రుద్దారు. ఆ పాలకులు ముస్లిమేతరుల పూజా స్థలాలను కూడా వదల్లేదు. హిందూ రాజ్యాలను ఆక్రమించుకోవడం ముస్లిం పాలకులకు జిహాద్ లాంటిది" అంటారు అశోక్ కదమ్.

"అయితే, స్వతంత్ర భారతదేశంలో కూడా ఆంగ్లేయులు భాషను చాలా మంది వలస భాష అన్నారు. దేశంలోని ఎక్కువ జనాభాకు ఇది అర్థం కాకపోయినప్పటికీ, ఇప్పుడు అన్ని పనులూ ఆ భాషలోనే జరుగుతున్నాయి. అధికారానికి ఎప్పుడూ ఒక భాష ఉంటుంది. మధ్యయుగంలో ముస్లిం పాలకులు ముస్లింలు అయ్యేలా హిందువులపై బలవంతం చేశారు" అన్నారు.

మతమార్పిడులు

ముస్లిం పాలకులు హిందువులను బలవంతంగా ముస్లింలుగా మార్చడం నిజమేనా?

ఈ ప్రశ్నకు సమాధానంగా "మతమార్పిడులు జరిగాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మతం మారడం అశోకుడి కాలంలో కూడా జరిగింది. అప్పుడు హిందువులు పెద్ద సంఖ్యలో బౌద్ధులుగా మారారు" అంటారు హేరంబ్ చతుర్వేది.

"మధ్యయుగంలో మతమార్పిడులు మూడు పద్ధతుల్లో జరిగాయి. ఒకటి జనం తమ భూములు కాపాడుకోడానికి మతం మారడం, రెండోది సూఫీల ప్రభావంతో స్వయంగా ముస్లింలు కావడం, మూడోది యుద్ధంలో ఓడిపోవడం వల్ల ప్రాణాలు కాపాడుకోడానికి ముస్లింలుగా మారడం. భారత్‌లో ముస్లిం పాలకులు వచ్చినపుడు వాళ్లతోపాటూ మతం కూడా వచ్చింది. వాళ్ల రాజకీయాల్లో మతం విస్తరణ అంశం కూడా ఉంది. పాలకులది ఏ మతమో దాని ప్రభావం నుంచి అక్కడి ప్రజలు తప్పించుకోవడం కష్టం" అంటారు చతుర్వేది.

"బ్రిటిష్ పాలనలో కూడా క్రైస్తవ మిషనరీలు వచ్చాయి. మతమార్పిడులు జరిగాయి. వారు కూడా ఇక్కడ వెయ్యేళ్లకు పైగా ఉండుంటే భారత జనాభాలో వారు కూడా 15 శాతం ఉండేవారు" అని ప్రొఫెసర్ చతుర్వేది చెప్పారు.

చరిత్రకారుల ఒక వర్గం మొఘలుల్లో ఔరంగజేబును అత్యంత నిరంకుశ పాలకుడుగా భావిస్తుంది.

ఆర్సీ మజుందార్‌ జాతీయవాద చరిత్రకారులుగా ప్రసిద్ధి చెందారు. భారతీయ విద్యాభవన్ 'ద మొఘల్ ఎంపైర్' పేరుతో ఒక పుస్తకం ప్రచురించింది. అందులో మొత్తం మొఘలుల కాలం గురించి వివిధ రచయితలు రాసిన వ్యాసాలున్నాయి. దీని రచయిత ఆర్సీ మజుందార్.

ఆ పుస్తకంలో ఆయన "అక్బర్ మినహా, మొఘల్ పాలకులందరూ మతోన్మాదులుగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అక్బర్ హిందువులతో సత్సంబంధాలు పెంచుకున్నారు. హిందువులకు వ్యతిరేకమైన ఎన్నో రద్దు చేశారు. హిందువులపై ఇస్లాం చట్టాలను విధించేవారు. ముస్లింలతో పోలిస్తే వారికి సామాజిక, రాజకీయ హోదా చాలా తక్కువగా ఉండేది. హిందువులను దిల్లీ మొఘల్ సామ్రాజ్యం అన్యాయం కొనసాగింది. కానీ, ఔరంగజేబు పాలనలో అది భరించలేని విధంగా మారింది. ఔరంగజేబు కావాలనే హిందువుల ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం చేయించారు. అలాంటి వాస్తవాలు మన కొందరు నేతలకు సరిగా అనిపించదు. కానీ, నచ్చినా నచ్చకపోయినా, వాస్తవాలు చెప్పడమే చరిత్రకారుల ఏకైక లక్ష్యం కావాలి" అని మజుందార్ చెప్పారు.

"భారత జాతీయ కాంగ్రెస్ నీడలో ఒక చరిత్రను రాశారు. ముస్లిం పాలకులు ఆలయాలు కూలగొట్టారని అందులో ఒప్పుకోడానికి వారు సిద్ధంగా లేరు. ముస్లిం పాలకులకు ఎంతో పరమత సహనం ఉండేదని వారు ఆ చరిత్రలో చెప్పడానికి ప్రయత్నించారు. కొంతమంది జదునాథ్ సర్కార్ ఔరంగజేబు గురించి చేసిన పరిశోధనను కొట్టిపారేశారు. ఔరంగజేబునే వెనకేసుకొచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సవరించిన ఇస్లాం ఎన్‌సైక్లోపీడియాలో సర్ విలియం ఇర్విన్ మరోసారి వ్యాసం రాశారు. ఔరంగజేబుపై ఆలయాలు కూల్చిన ఆరోపణలు వివాదాస్పదమని అందులో చెప్పారు" అన్నారు.

న్యూజెర్సీ రకర్స్ యూనివర్సిటీలో దక్షిణాసియా చరిత్ర ప్రొఫెసర్ ఆండీ ట్రష్కేకూడా 'ఔరంగజేబ్-ద మెన్ అండ్ ద మిథ్' పేరుతో ఒక పుస్తకం రాశారు.

ఔరంగజేబులో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉండేవని, కానీ జనం తరచూ ఉత్సాహంతో ఆయన్ను చెడుగానో, మంచిగానో చెప్పేవారని, ఆ అంశాలన్నీ దూరంగా ఉంచారని చెప్పారు.

"మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం, మనం ప్రస్తుత పరిస్థితులను బట్టి చరిత్రను చూస్తున్నామనేది సుస్పష్టం. అది మంచికి కాదు. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు మనం చరిత్రను చూస్తే దాన్ని తప్పుగా అంచనా వేసేస్తాం. ఔరంగజేబును ఇప్పటి హిందూ-ముస్లి ఘర్షణల కోణంలో చూడడం సరికాదు. కొంతమంది ఔరంగజేబును తమ ప్రయోజనాల కోసం ఫుట్‌బాల్‌లా వాడుకుంటున్నారు. అది భారత్‌లో ముస్లిం వ్యతిరేక ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి సాయం చేస్తోంది" అని ఆమె అన్నారు.

"ప్రస్తుతం ఔరంగజేబును హిందువులను ద్వేషించిన మతోన్మాద ఇస్లాం పాలకుడుగా చూస్తున్నారు. కానీ చరిత్రలో ఔరంగజేబు పాత్ర ఆ ఇమేజ్‌కు అనుగుణంగా లేదు. ఔరంగజేబు ఏయే చర్యలు తీసుకున్నారో, అంటే హిందువులు, జైనుల ఆలయాలు ధ్వంసం చేయడం, ముస్లిమేతరులపై జిజియా పన్ను విధించడం లాంటి అంశాలను ఇప్పటివారు తీవ్రమైనవిగా భావిస్తున్నారు" అంటారు ట్రష్కే.

" అంతేకాదు, ఔరంగజేబు చాలా హిందూ, జైన ఆలయాలకు భద్రత కల్పించారు. మొఘల్ దర్బారులో హిందువుల సంఖ్య కూడా పెరిగింది. ఔరంగజేబును ఇస్లాం మతోన్మాదిగా చూస్తున్నవారు ఆయన హిందూ, జైన ఆలయాలు ఎందుకు రక్షించారో కూడా చెప్పాలి. ఔరంగజేబు విధానాలను అర్థం చేసుకోడానికి మతపరమైన దృక్పథం పనికిరాదు. ఔరంగజేబు ఆచరణాత్మక పాలకుడని, ఆయనలో అధికార దాహం ఉండేదనేది తెలిసిందే. పాలకులు అందరూ దానికోసమే పనిచేసేవారు, పాలకులు హిందువులను ద్వేషించడమే పనిగా పెట్టుకోలేదు అని నాకు అనిపిస్తోంది" అని ట్రష్కే చెప్పారు.

మధ్యయుగంలో హిందువుల చాలా నిరాశలో కూరుకుపోయారని, దానికి స్పందనగా భక్తి ఉద్యమం మొదలైందని హిందీ సాహిత్య చరిత్రకారులు ఆచార్య రామచంద్ర శుక్లా చెప్పారు. ఆయన తన పుస్తకం 'గోస్వామి తులసీదాస్‌'లో దాని గురించి వివరించారు.

"దేశంలో ముస్లిం సామ్రాజ్య స్థాపన పూర్తిగా జరిగిన తర్వాత దేశంలోవారికి తమ వీరత్వాన్ని ప్రదర్శించడానికి తగిన స్వేచ్ఛ కగిలిన ప్రాంతమే లేకుండా పోయింది. దేశంలో దృష్టి తమ పురుషార్థం, బల పరాక్రమాల వైపు నుంచి భగవంతుడు, భక్తి వైపు మళ్లింది. దేశంలో అది నైరాశ్యంలో ఉన్న సమయం. ఆ కాలంలో భగవంతుడు తప్ప వేరే ఎవరి సాయం వారికి కనిపించలేదు" అన్నారు.

అయితే ప్రముఖ హిందీ సాహిత్య విమర్శకులు హజారీ ప్రసాద్ ద్వివేదీ ఆచార్య శుక్లా ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.

"అలాంటప్పుడు భక్తి ప్రారంభం దక్షిణాదిన కాకుండా ఉత్తరాది నుంచి మొదలయ్యుండాలి. ఎందుకంటే ముస్లిం పాలకులు మొదట ఉత్తరాదికి వచ్చారు. కానీ, భక్తి ఉద్యమం దక్షిణాదిన ప్రారంభమయ్యింది" అన్నారు.

భారతదేశం బానిసత్వం

మోదీ ప్రభుత్వం చరిత్రను చెరిపేసే పనిలో ఉందా

అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్ చేసేశారు. దిల్లీ ఔరంగజేబు రోడ్ పేరును కూడా మార్చేశారు. ముఘల్‌సరాయ్ పేరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌గా మారింది. హైదరాబాద్ పేరును కూడా భాగ్యనగరంగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్ మాట్లాడుతున్నారు. హల్దీఘాటీ యుద్ధంలో రాణా ప్రతాప్‌ను విజేతగా ప్రకటించారు.

ఈ పేర్లన్నీ ముస్లిం ఆక్రమణదారులు పెట్టారని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. చరిత్ర పుస్తకాలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం భారత్‌లో బహుళత్వాన్ని నాశనం చేయడంలో నిమగ్నమైందనే ఆరోపణలు వస్తున్నాయి. మొఘలులు భారత రాజులు కారని, వారు నిర్మించిన భవనాలు మన వారసత్వం కాదని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.

సరైన చరిత్రను తిరగరాయాల్సిందేనని అని ప్రొఫెసర్ ఉమేష్ అశోక్ కదమ్ కూడా అంటున్నారు.

"మధ్యయుగం చరిత్రను సరిగా రాయలేదు. మధ్యయుగాన్ని కేవలం దిల్లీ సామ్రాజ్యం, మొఘలుల పాలనగానే చూస్తున్నారు. కానీ అది నిజం కాదు. మధ్యయుగం రాసిన ఆ చరిత్రకు పారశీ, అరబ్‌ సాహిత్యమే ఆధారం. కానీ, ఆ కాలంలోనే భారతీయ భాషల్లో ఏమేం రాశారో, అవన్నీ పక్కన పెట్టారు. మోదీ ప్రభుత్వం చరిత్రను సవరిస్తోంది. నగరాలు, రోడ్ల పేర్లు మారుస్తున్నారంటే దానికి ప్రజలు అలా కోరుకోవడమే కారణం. జనాదరణ ఉన్న ఒక నేత ప్రజల ఆకాంక్షల కోసమే పనిచేస్తారు" అన్నారు.

"మనం బానిసత్వం చిహ్నాలను తుడిచేయాలి. భారత త్రివర్ణ పతాకం ఎర్ర కోటమీదే ఎందుకు ఎగరేయాలి అని నేను చిన్నప్పటి నుంచీ ఆలోచించేవాడిని. నాకు అది కూడా సరిగా అనిపించదు" అంటారు ప్రొఫెసర్ ఉమేష్ కదమ్.

ప్రొఫెసర్ ఉమేష్ కదమ్ ఐసీహెచ్ఆర్ సభ్యులుగా కూడా పనిచేస్తున్నారు. కౌన్సిల్ మధ్యయుగం నాటి చరిత్రను సవరించే ప్రయత్నాల్లో ఉందని ఆయన చెప్పారు.

ఎర్ర కోటను మొఘల్ పాలకుడు షాజహాన్ నిర్మించారు. ప్రొఫెసర్ ఉమేష్‌కు ఆ భవనం కూడా భారత బానిసత్వానికి చిహ్నంగానే అనిపిస్తుంది.

భారత చరిత్రలోని వాస్తవాలను కొందరు పక్కన పెట్టేశారు. అదంతా సరి చేయాల్సిన అవసరం ఉంది అని ఉమేష్ కదమ్ అంటున్నారు.

భారతదేశం బానిసత్వం

అయితే, చరిత్రను సరిదిద్దడం లేదా మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చా.

"వర్తమానంపై ఎవరి నియంత్రణ ఉంటుందో గతంపై కూడా వారి నియంత్రణ ఉంటుంది" అని జార్జ్ ఆర్‌వెల్ తన నవల '1984'లో రాశారు.

అంటే గతాన్ని మనం ఎలా కావాలంటే అలా నచ్చినట్టు ఎలాగైనా తిప్పి రాసుకోవచ్చు. ఎందుకంటే వర్తమానంలో మనకు దాని అవసరం పడింది.

అదే విధంగా "చరిత్ర నుంచి ఏదీ నేర్చుకోం అనే విషయాన్ని మనం చరిత్ర నుంచి నేర్చుకుంటాం" అని జర్మన్ దార్శనికుడు జార్జ్ హెగల్ కూడా అంటారు.

మోదీ ప్రభుత్వం మధ్యయుగం చరిత్ర గురించి ఎందుకు అంత ఇబ్బంది పడుతోంది. దానిని సవరించడం గురించి ఎందుకు మాట్లాడుతోంది.

"చరిత్ర అనేది ప్రతీకారం తీర్చుకునే అంశం కాదు. కానీ, పాలకులు చరిత్రను తమదైన రీతిలో అర్థం చేసుకుంటారు. తద్వారా మెజారిటీవాదాన్ని పెంచి పోషిస్తుంటారు. పోలరైజేషన్ రాజకీయాల్లో వాస్తవాలన్నింటినీ దాచి, కల్పిత కథలు చెప్పాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది.

మధ్యయుగం మొత్తంలో జలియన్‌వాలాబాగ్ లాంటి దారుణం ఎక్కడా కనిపించదు. కానీ భారత నేతలు, ప్రజల మనసులో ఆంగ్లేయుల పట్ల పెద్దగా ద్వేషం లేదు. ఆ ద్వేషమంతా ముస్లింలపైనే ఉంటుంది" అంటారు పార్వతీ శర్మ.

"ఆంగ్లేయులు ఇక్కడే ఉండిపోలేదు. అందుకే వారిపై ద్వేషం నూరిపోయడం మన రాజకీయాలకు పనికిరాదు. ఇక్కడ ముస్లింలు ఉన్నారు. పోలరైజేషన్ కోసం వారినే లక్ష్యంగా చేసుకున్నారు. బ్రిటిష్ కాలం నుంచే కాదు, మధ్యయుగం నుంచీ ఉన్న ఆ చరిత్ర మెజారిటీ రాజకీయాలకు ఇంధనంగా మారింది. బాబ్రీ మసీదు ప్రాంతంలో రామ మందిరం నిర్మించి, చరిత్ర సరిదిద్దవచ్చని వారికి అనిపిస్తే, అలా వారి రాజకీయాలు కొనసాగవచ్చు, కానీ అది తప్పు" అన్నారు పార్వతీ శర్మ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
‘India is a slave to Muslim rulers,Is this argument true
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X