ఇండియా నేతల భవిష్యత్ ఎలా ఉండబోతోందో స్పష్టం చేసిన ఖర్గే
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా నేతలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే కీలక సూచనలు చేశారు. ముంబైలో ఏర్పాటైన ఈ కూటమి భేటీలో పాల్గొన్న ఆయన నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వారిని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలపై కేంద్ర ప్రభుత్వం మున్ముందు భారీ ఎత్తున దాడులకు పాల్పడొచ్చని ఖర్గే అన్నారు. ఆదాయపు పన్ను, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల తనిఖీలు, సోదాలు ముమ్మరమౌతాయని చెప్పారు. అరెస్టులకూ దిగొచ్చని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి ఇండియా కూటమి నేతలు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. తమకు అలవాటైన రీతిలో ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతారని, వారిని అన్ని రకాలుగా భయభ్రాంతులను గురి చేస్తారని ఖర్గే చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీల వైపు చూపులు సారించారని, ఇలాంటి పరిస్థితుల్లో నాయకులను అణగదొక్కడానికి కేంద్రం.. దాడులు, సోదాలకు దిగుతుందని స్పష్టం చేశారు.
దేశ ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కోరుకోవడం, దీని కోసం ఇండియా కూటమి వైపు మొగ్గు చూపడాన్ని మోదీ- అమిత్ షా ఏ మాత్రం సహించబోరని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అందుకే దాడులు, అరెస్టులకు సిద్ధంగా ఉండాలని కోరారు. తమ కూటమి ఎంత ఎక్కువ ప్రజాబలాన్ని సాధిస్తే, మోదీ ప్రభుత్వం అంతగా తమపై దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తుందని అన్నారు.

గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లల్లో ఇలాంటి పరిస్థితులే సంభవించాయని ఖర్గే గుర్తు చేశారు. రైతులు, యువత, మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి, మేథావులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు మార్పును కోరుకుంటోన్నారని, తమ కష్టాల బారి నుంచి ఉపశమనం పొందడానికి తమ వైపు చూస్తోన్నారని అన్నారు.
అట్టడుగు వర్గాలకు చెందిన వారి పట్ల బీజేపీ ప్రభుత్వ ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందనేది అందరికీ తెలిసిన విషయమేనని ఖర్గే అన్నారు. పేదలు, గిరిజనులు, దళితులు తీవ్ర వివక్షణు ఎదుర్కొంటోన్నారని, వారిపై మూత్ర విసర్జన చేసే దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దోషులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications