దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు: ఈ రాష్ట్రాల్లో మరణాలు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 841 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 227 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4309కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత 24 గంటల వ్యవధిలో మొత్తం ముగ్గురు మరణించారు. వీరిలో కేరళ, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 2023 డిసెంబర్ 5 వరకు దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య రెండంకెలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే, కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి చెందుతుండటం, పైగా శీతాకాలం కావడం వల్ల ప్రస్తుతం ఈ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ప్రజలు అందరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

మరోవైపు, దేశంలో కరోనా మహమ్మారి అడుగుపెట్టి నుంచి ఇప్పటి దాకా 4.5 కోట్ల మంది ప్రజలు వైరస్ బారినపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 5.3 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4.4 కోట్లకు చేరింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉంది. దేశంలో ఇప్పటి వరకు 220.67 కోట్ల కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ కు సంబంధించి ఇప్పటికే పలు కీలక మార్గదర్శకాలను విడదుల చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. పరిశుభద్రత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల సలహాలు పాటించాలని సూచించింది.












Click it and Unblock the Notifications