లక్ష దిగువకు కరోనా కేసులు - 7.25 పాజిటివిటీ రేటు : 895 మరణాలు..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లక్ష దిగువకు కేసులు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన 11,56,363 పరీక్షల్లో 83,876 కొత్త కేసులు నమోదయ్యాయి. 895 మంది మరణించారు. 1,99,054 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం మరణాలు 5,02,874 కాగా, యాక్టివ్ కేసులు 11,08,938 గా నిర్దారించారు.

వ్యాక్సినేషన్ వేగవంతం
ఇక, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,06,60,202 గా నమోదైంది. దేశంలో కొత్తగా 14,70,053 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,63,80,755 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి కాస్తా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 18 లక్షల మందికి కరోనా సోకింది. 6 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.58 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,58,393 కు పెరిగింది. రష్యాలో కొత్తగా 1.80 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 661 మంది మరణించారు.

ప్రపంచ దేశాల్లోనూ తగ్గుముఖం
ఫ్రాన్స్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 1.55 లక్షలకు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. మరో 129 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,598 శాంపిల్స్ పరీక్షించగా.. 2,690 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు.. ఇక, ఇదే సమయంలో 11,855 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

ఏపీలో కొనసాగుతున్న ఆంక్షలు
ఏపీలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 3,26,60,687కు చేరుకోగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,03,455కి, రికవరీ కేసులు 22,19,219కి, మృతుల సంఖ్య 14,664కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 69,572 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలోనూ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, ఏపీలో ఇంకా రాత్రి కర్ఫ్యూ తో పాటుగా కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేసులు పూర్తిగా తగ్గేవరకూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications