పాకిస్తాన్ కు బిగ్ చెక్ పెట్టిన కేంద్రం..!!
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జిల్లా సెషన్స్ కోర్టు భవనం ఆవరణలో ఈ మధ్యాహ్నం చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో ఇస్లామాబాద్‌లో పలు అంతర్జాతీయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇంటర్-పార్లమెంటరీ స్పీకర్స్ కాన్ఫరెన్స్, మర్గల్లా డైలాగ్ వంటివి ఇందులో ఉన్నాయి. రావల్పిండిలో శ్రీలంక- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా జరుగుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది.
ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ ఘటనకు భారత్ కారణమని ఆరోపించారు. సోమవారం వానాలోని క్యాడెట్ కళాశాలపై జరిగిన దాడిలో కూడా భారత్ పాత్ర ఉందని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వ భారత్ కు ప్రాక్సీగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్, వానాల్లో చోటు చేసుకున్న ఈ ఈ రెండు దాడులకు కూడా భారత్- దాని అనుబంధ ఉగ్రవాద ప్రాక్సీలు కారణమని షరీఫ్ అన్నారు.

ఈ దాడులతో పాకిస్తాన్ ను భయపెట్టలేరని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని ఎవరూ అస్థిరపరచలేరని చెప్పారు. ఇక్కడి ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురి చేయడం, అస్థిర పరచడానికి భారత్ సాగిస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించబోవని అన్నారు. భారత్- ఆ దేశం స్పాన్సర్ చేస్తోన్న ఉగ్రవాదానికి ఇస్లామాబాద్, వానా దాడులు కొనసాగింపుగా భావిస్తోన్నామని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ఈ దాడులను ఎంత ఖండించినా తక్కువేనని చెప్పారు.
ఈ ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది. దీన్ని తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టి పారేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశార. పొరుగు దేశంలో జరిగిన ఏ ఉగ్రవాద దాడి వెనుక ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని నిరాధారమైన ఆరోపణలను తిరస్కరిస్తోన్నామని అన్నారు. బాంబు పేలుడు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ పై వ్యూహాత్మకంగా ఆరోపణలు చేశారని చెప్పారు.
పాకిస్తాన్ లో సైనిక రాజ్యాంగం విధ్వంసం సృష్టిస్తోందని, అధికార దుర్వినియోగం యథేచ్ఛగా అమలవుతోందని రణధీర్ జైస్వాల్ విమర్శించారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఇస్లామాబాద్ లో సంభవించిన బాంబు దాడుల వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ పాకిస్తాన్ ప్రధాని చేసిన ఈ ఆరోపణలను నిర్ద్వంద్వందంగా తోసిపుచ్చుతున్నామని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications