కరోనా పడగనీడ: మరోసారి 50 వేలకు చేరువగా: 32 వేలను దాటిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వారంరోజుల్లో కరోనా కేసులు ఓ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. అదే ఉధృతి మరికొన్ని రోజులు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేల సంఖ్యల్లో నమోదు అవుతున్నాయి. దాని ప్రభావం జాతీయ సగటుపై పడుతోంది.
దేశంలో కొత్తగా 48,661 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 705 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,85,522కు నమోదైంది. మరణాల సంఖ్య 32 వేలను దాటుకుంది. మొత్తం కరోనా మరణాలు 32,063కు చేరుకున్నాయి. ఇప్పటిదాకా 8,85,577 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ఇళ్లకు వెళ్లిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,67,882గా నమోదైంది.
కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు కారణమౌతున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఇదివరకు లేనివిధంగా ఏపీలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా వేల సంఖ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా. ఇదే పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లోనూ నెలకొంది. తమిళనాడు, కర్ణాటకల్లోనూ గతంలో కంటే అధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

మహారాష్ట్రలోనూ కరోనా వైరస్ రోజువారీ కేసుల్లో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. మహారాష్ట్ర పోలీసు శాఖలో ఇప్పటిదాకా 8,483 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1919 యాక్టివ్ కేసులు ఉండగా.. 93 మంది మరణించారు. 6471 మంది డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 3,66,368 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 13,389 మంది మృత్యువాత పడ్డారు. 2,07,194 మంది డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,481గా నమోదైంది.
Recommended Video
దేశంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన రాష్ట్రంలో మహారాష్ట్ర టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, హర్యానా, పంజాబ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులను నమోదు చేస్తున్నాయి. దీనిప్రభావం వల్ల జాతీయ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రికవరీ రేటు కూడా అదే స్థాయిలో నమోదు కావడం ఊరట కలిగించే అంశమని అంటున్నారు.












Click it and Unblock the Notifications