పండగల సీజన్‌లోనూ ఫర్వాలేదనిపించేలా: కరోనా కట్టడిలో సక్సెస్..అయినా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్దిరోజులుగా ఈ తగ్గుదల కొనసాగుతూ వస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. థర్డ్‌వేవ్ ముప్పు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ నిపుణులు సూచిస్తోన్న నేపథ్యంలో- కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. పండగల సీజన్‌లోనూ కరోనా అదుపులోనే ఉండటం.. ప్రజల్లో కరోనా వైరస్ ప్రొటోకాల్స్‌పై ఉన్న అవగాహనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ- ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 18,166 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 214 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 23,624 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు చేరింది. ఇందులో 3,32,71,915 మంది కోలుకున్నారు. 4,50,589 మంది వరకు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,30,971గా నమోదైంది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ వాటా సగానికి పైగా ఉంది. కేరళలో గత 24 గంటల వ్యవధిలో 9,470 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. 101 మంది మరణించారు. ఇదివరకు కేరళలో నమోదైన రోజువారీ పాజిటివ్ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువే. మరోవంక- వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 94,70,10,175 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. శనివారం ఒక్కరోజే 66,85,415 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇప్పటిదాకా 450,621 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. ఈ ఏడాది సంభవించిన కరోనా సెకెండ్ వేవ్ సమయంలోనే అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయనే అంచనా ఉన్నాయి. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-7,33,058, బ్రెజిల్-6,00,880 మంది మరణించారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది.
కరోనా వైరస్ తీవ్రత తగ్గుతున్నప్పటికీ.. మాస్కులను మాత్రం ధరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, కనీసం ఇంకో ఏడాది పాటు ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుందని సూచిస్తోంది. దసరా, దీపావళి పండుగల సీజన్ రానున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంటోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్లే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, మరి కొంతకాలం పాటు ఈ ప్రొటోకాల్స్ పాటించాలని సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.












Click it and Unblock the Notifications