పండగపై నిషేధం ఎఫెక్ట్: కంట్రోల్‌లో కరోనా: 30 వేల కంటే దిగువకు కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. చాలాకాలం తరువాత 30 వేలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు ఒకేచోట గుమికూడటానికి అవకాశం ఉన్న వినాయక చవితి పండగ తరువాత కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింత తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చవితి పండుగను బహిరంగంగా జరుపుకోవడానికి ఏపీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు నిషేధించిన నేపథ్యంలో- కరోనా అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది.

అక్కడ మాత్రం అదే రేంజ్‌లో
దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ సంఖ్యలో కేసులు నమోదవుతోన్నప్పటికీ- రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రం అసాధారణంగా ఉంటోంది కరోనా తీవ్రత. కేరళ, మహారాష్ట్రల్లో రోజువారీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకించి కేరళలో కరోనా విజృంభణ అధికంగా ఉంటోంది. ఇప్పుడు అక్కడ కూడా తీవ్రత తగ్గినట్టే. సుదీర్ఘకాలం తరువాత 20 వేల వరకు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదివరకటి కేసులతో పోల్చుకుంటే- ఈ సంఖ్య తక్కువే

28 వేలకు వేలకు పైగా..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 28,591 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 338 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 34,848 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కి చేరింది. ఇందులో 3,24,09,345 మంది కోలుకున్నారు. 4,42,655 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,84,921గా నమోదైంది.

మరణాల్లో మూడో స్థానంలో..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇప్పటిదాకా 4,42,655 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-6,77,737, బ్రెజిల్-586,590 మంది మరణించారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్లను వేసుకున్న వారి సంఖ్య 70 కోట్లను దాటేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది.

కేరళలో కూడా ఒకింత తగ్గుముఖం..
కేరళలో కూడా కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఒకింత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొత్తగా 20,487 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. ఇదివరకు ఈ సంఖ్య భారీగా నమోదవుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 20 వేలకు పైగా ఒక్క కేరళకు చెందినవే. ఆ తరువాత మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది దీని తీవ్రత. మున్ముందు మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు.

పండగలపై నిషేధం ఎఫెక్ట్..
వినాయక చవితిని ఏ రకంగా జరుపుకొంటారో తెలిసిన విషయమే. కోట్లాది మంది ఒకే చోట గుమికూడే పండుగ అది. తొమ్మిది రోజుల పాటు వైభవంగా గణేషుడి మండపాలను నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్రాలు కూడా ఈ పండుగపై నిషేధం విధించాయి. బహిరంగంగా జరుపుకోకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేశాయి. ఈ వ్యూహం ఫలించినట్టే. పండగ తరువాత కూడా కొత్త కేసులు ఏవీ భారీగా నమోదు కాకపోవడం.. దీన్ని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications