దేశంలో తొలి ఓటరు శరణ్ నేగి: హిమాచల్‌లో మరోసారి ఓటేయడానికి సిద్దం..
హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది.
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది.ఈ సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన హిమాచల్ వాసి శ్యాం శరణ్ నేగి.. ఇప్పటి ఎన్నికల్లోను తన ఓటు హక్కు వినియోగించబోతుండటం విశేషం.
2014 ఎన్నికల సందర్భంగా గూగుల్ రూపొందించిన 'ప్లెడ్జ్ టు ఓట్' వీడియో ప్రచార కార్యక్రమంలో శరణ్ నేగి.. తన తొలి ఓటు సమయంలోని పరిస్థితుల గురించి వివరించాడు. ఇప్పటికీ తాను ఓటు వేయడమే కాకుండా.. ఇతరులకూ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూనే ఉన్నాడు.
కాగా, హిమాచల్‌ప్రదేశ్ లోని మండి మహాసు పార్లమెంట్ నియోజకవర్గానికి అక్టోబర్ 25, 1951న జరిగిన ఎన్నికల్లో నేగి తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ పూర్తి స్థాయి ఎన్నికలు మాత్రం 1952లో జరిగాయి. ఐదు నెలలు ముందుగానే హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న మంచు కారణంగా అక్కడ ముందస్తు ఎన్నికలు నిర్వహించారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న సమయంలో నేగి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 1975లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం 100ఏళ్ల వయసున్న ఆయన.. నవంబర్ 9న హిమాచల్ ప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో మరోసారి తన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
శరణ్ నేగి కోసం కిన్నౌర్ జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఆయన్ను పోలింగ్ స్టేషన్‌కు తీసుకొచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. నేగి కోడలు మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంటూనే ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications