ఇస్రో అరుదైన ప్రయోగం- తొలి ఆత్మనిర్భర్ ప్రైవేట్ శాటిలైట్ ప్రయోగం- భగవద్గీత, మోడీ ఫొటోతో
భారత అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా అంతరిక్షంలోకి ప్రయోగించే ఓ ఉపగ్రహం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తీసుకెళ్లబోతోంది. త్వరలో ఇస్రో చేపట్టే ఓ అంతరిక్ష ఉపగ్రహంలో భగవద్గీతతో పాటు ప్రధాని మోడీ ఫొటోనూ, మరో 25 వేల మంది వ్యక్తుల పేర్లను కూడా పంపనున్నారు. భారత అంతరిక్ష పితామహుడు సతీష్ ధావన్ పేరుతో ఇస్రో ప్రయోగించే ఈ నానో శాటిలైట్ ప్రయోగమే ఓ చరిత్ర అనుకుంటే ఇందులో అరుదైన వస్తువులను పెట్టి పంపడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ ప్రయోగం కూడా చరిత్రలో నిలిచిపోనుంది.

ఇస్రో నానో శాటిలైట్ ప్రయోగం
మన దేశంలో విద్యార్ధుల్లో అంతరిక్ష శాస్త్రసాంకేతికతపై అవగాహన పెంచేందుకు పనిచేస్తున్న స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్ధ మూడు అంశాలపై పరిశోధన కోసం ఇస్రో సాయంతో ఓ నానో శాటిలైట్‌ను తయారు చేసింది. దీనికి భారత అంతరిక్ష పితామహుడు సతీష్ ధావన్ పేరు పెట్టారు. ఆయన పేరుతో ఎస్‌డీ శాట్‌గా పిలుస్తున్న ఈ నానో శాటిలైట్‌ను ఈ నెలాఖరులో ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.
భారత్‌లో ప్రైవేటు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద కేంద్రం అనుమతిచ్చాక అభివృద్ధి చేసిన తొలి శాటిలైట్ కూడా ఇదే. భారత్‌లో రెండు స్టార్లప్ సంస్ధలు శాటిలైట్లను తయారు చేయగా... ఇందులో తొలి శాటిలైట్ ప్రయోగం ఇదే.
ఫోటోలు: ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు

ఎస్‌డీ శాట్ ప్రయోగం లక్ష్యమిదే
సతీష్ ధావన్ శాటిలైట్‌ను ఈ నెల చివరి ఆదివారం ఇస్రోలోని పీఎస్ఎల్వీ వాహననౌక నుంచి ప్రయోగించబోతున్నారు. అయితే ఈ ప్రయోగం వెనుక మూడు ప్రధాన లక్ష్యాలున్నాయి. వాటిలో స్పేస్ రేడియేషన్, మ్యాగ్నటోస్పియర్ పరిశోధన, స్వల్ప స్ధాయి వైడ్ ఏరియా నెట్‌వర్క్‌పై పరిశోధన ఉన్నాయి. ఈ మూడు ప్రయోగాలకు సంబంధించిన పేలోడ్‌లను ఇందులో నింపుతారు. వీటి ద్వారా ఆయా విభాగాల్లో ప్రయోగాలకు ఈ ఉపగ్రహం పనిచేయబోతోంది. ఈ మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే నానో శాటిలైట్ వీటితో పాటు మరికొన్ని వస్తువులను కూడా తీసుకెళ్లబోతోంది.

అంతరిక్షంలోకి భగవద్గీత, మోడీ ఫొటో
వాస్తవంగా అంతరిక్ష పరిశోధనల కోసం ప్రయోగిస్తున్న ఈ శాటిలైట్‌లో ఈసారి మరో మూడు వస్తువులకు కూడా చోటు కల్పించాలని ఇస్రో నిర్ణయించింది. ఇందులో హిందువుల పవిత్ర గ్రంధమైన భగవద్గీత, ప్రధాని మోడీ ఫొటో, ఎంపిక చేసిన 25 వేల మంది పేర్లను కూడా ఈ శాటిలైట్‌లో పంపాలని ఇస్రో నిర్ణయం తీసుకుంది. దీంతో ఇలా ప్రత్యేక మైన వస్తువులను కూడా అంతరిక్షంలోకి పంపడం కూడా ఇదే తొలిసారి కానుందని తెలుస్తోంది. అంతరిక్షంలో భారత్ ప్రాధాన్యతను తెలియజేసేలా ఈ మూడింటిని పంపనున్నట్లు తెలుస్తోంది.

ఆ 25 వేల మంది ఎవరో తెలుసా ?
అంతరిక్షంలోకి సతీష్ ధావన్ పేరుతో పంపుతున్న ఎస్‌డీ శాట్ ఉపగ్రహంతో తీసుకెళ్లే భగవద్గీత, మోడీ ఫొటోతో పాటు ఉన్న 25 వేల మంది వ్యక్తుల పేర్ల జాబితా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎవరీ 25 వేల మంది, వారి పేర్లను ఎందుకు అంతరిక్షానికి పంపాలన్న ప్రశ్న కూడా తలెత్తింది. దీంతో ఇస్రో వీటిపై క్లారిటీ ఇస్తోంది. స్పేస్ కిడ్జ్ సంస్ధ అంతరిక్ష ప్రయోగాలపై దేశంలో విద్యార్ధులు, యువతలో అవగాహన పెంచేందుకు అంతరిక్షంలోకి ఓ 25 వేల మంది పేర్లను పంపాలని నిర్ణయించింది. తమ పేర్లు ఇవ్వాలాని స్పేస్ కిడ్జ్ కోరింది. దీంతో అనుకున్న విధంగానే 25 వేల మంది పేర్లు ఆన్‌లైన్‌లో వచ్చేశాయి. ఇందులో వెయ్యిమంది వరకూ విదేశాల్లో ఉంటున్న భారతీయులే. వీరి పేర్లతో ఓ జాబితా తయారు చేసి దాన్ని కూడా ఈ ఉపగ్రహంతో పాటు అంతరిక్షంలోకి పంపుతారు. వీరితో పాటు ఉపగ్రహం ప్యానెల్ మీద ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్, డాక్టర్ ఉమామహేశ్వరన్ పేర్లను కూడా ముద్రిస్తున్నారు.